భగవద్గీత 15వ అధ్యాయ పారాయణ మహత్యం
సర్వపాపములు నుండీ విముక్తిని ప్రసాదించే భగవద్గీత పదిహేనవ అధ్యాయం .
- లక్ష్మీరమణ
జీవుల త్రిగుణాల గురించి వివరించేది భగవద్గీతలోని పదునాల్గవ అధ్యాయం గుణత్రయవిభాగ యోగము . దాని తర్వాత పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ అధ్యాయంలో పరమాత్మ జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముని పొందడం పురుషోత్తమ ప్రాప్తి యోగము అనిపించుకుంటుంది అని పరమాత్మ భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయంలో చెప్పారు . ఈ అధ్యాయాన్ని నిత్యమూ పఠించడం ,పారాయణగా చేయడం వలన ఒనగూరే ప్రయోజనాల గురించి పరమేశ్వరుడు ఈశ్వరికి ఇలా తెలియజేస్తున్నారు.
“ఈశ్వరి! పరమ పవిత్రమైన పంచదశాధ్యాయాన్ని వివరిస్తున్నాను. సావధానంగా విను. పూర్వము గౌడదేశాన్ని నరసింహుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని దగ్గర గొప్ప పరాక్రమశాలి అయిన శరభేరుండుడు అనే సేనాధిపతి ఉండేవాడు . ఆటను యెంత శౌర్యవంతుడంటే, యుద్ధములో దేవతలు సైతం అతని ముందర తలా వంచాల్సిందే . ఆ శౌర్య పరాక్రమాలే అతనిలో దుర్భుద్ధిని కలిగించాయి . రాజుగారిని అతని సంతానంతోపాటు మట్టుపెట్టి , ఆ రాజ్యాన్ని తాను ఆక్రమించాలని పన్నాగం పన్నాడు .
కానీ అతని కోరిక తీరకుండానే కాలం కాటువేశింది . అకాలమృత్యువు పాలిపోయాడు . పూర్వకర్మానుసారంగా ఆ సేనాధిపతి సింధు దేశంలో మిక్కిలి ఒక గొప్ప ఉత్తమజాతి అశ్వమై జన్మించాడు. అక్కడికి వెళ్లిన ఒక గౌడదేశ వర్తకుడు ఆ అశ్వాన్ని చూసి ముచ్చటపడి బోలెడంత దానం వెచ్చించి కొనుక్కొచ్చాడు . మరో జన్మ పొంది కూడా తిరిగి గౌడదేశానికి వచ్చిన ఆ అశ్వాన్ని ఆ వర్తకుడు రాజుగా ఉన్న నరసింహునికి విక్రయించాడు .
ఇదిలా ఉండగా, ఒకరోజు ఆ మహారాజు అదే అశ్వాన్ని ఎక్కి వేటకి వెళ్ళాడు . చాలా వేగంగా పరిగెత్తి , సైన్యాన్ని దాటి మహారాజుని ఒక దట్టమైన అటవీ ప్రదేశానికి తీసుకెళ్ళిందా అశ్వం . అప్పటికే ఆ రాజు వేటలో అలసిపోయారు . ఒక చెట్టుకింద అశ్వాన్ని విడిచి, సమీపంలో ఉన్న జలాశయంలో నీళ్లు తాగేందుకు దిగారు . అలా నీళ్లు తాగి అక్కడ ఉన్న ఒక పాకుడు పట్టిన రాతిమీద కాలు వేశి జారి పడ్డారు . ఆ రాతి దగ్గర ఒక ఆకు మీద శ్రీమద్భగవద్గీతలోని పంచదసాధ్యాయములోని ఒక సగం శ్లోకము రాసి ఉన్నది. ఆ ఆకుని తీసుకొని ఏం రాసుందా అని చదివారు . ఆ పరమాక్షరములని రాజుగారు చదివినప్పుడు వినడంవలన ఆ అశ్వము వెంటనే తన జంతు దేహమును విడిచి దివ్య రూపాన్ని ధరించింది. రాజుగారు చూస్తూ ఉండగానే, దివ్య విమానాన్ని అధిరోహించి విష్ణు లోకాన్ని పొందింది.
ఆ తర్వాత రాజు ఆ శిలా వేదిక పైన కూర్చుని తనకి సమీపంలోనే ఒక దివ్య మైన ఆశ్రమము ఉన్నట్టు గమనించారు . వెంటనే అక్కడికి వెళ్లి అక్కడ నివసిస్తున్న విష్ణుశర్మ అనే బ్రాహ్మణున్ని కలిశారు . ఆయనకీ భక్తితో నమస్కారం చేసి, “ ఓ విప్రోత్తమా ! నేను చూస్తూ ఉండగానే నా అశ్వం తన దేహాన్ని విడిచి దివ్యదేహాన్ని ధరించి వైకుంఠాన్ని పొందింది. అందుకు గల కారణం ఏమిటో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను” అని అడిగాడు.
అప్పుడు త్రికాల వేదియైన ఆ విష్ణుశర్మ ఈ విధంగా చెప్పసాగారు . “ఓ రాజా! పూర్వము నీ దగ్గర శరభేరుండుడు అనే సేనాధిపతి ఉన్నాడు కదా ! అతడు ఒక సమయంలో దుర్బుద్ధి చేత పుత్ర సహితముగా నిన్ను చంపి నీ రాజ్యాన్ని గ్రహించాలని తలపోశాడు . కానీ నాకోరిక తీరకుండానే మృతిచెందాడు. ఆ దురాలోచన దోషము చేత, ఈ విధంగా అశ్వమై జన్మించాడు. ఇప్పుడు నువ్వు చదివిన భగవద్గీత పంచదశాధ్యాయములోని అర్థశ్లోక భాగాన్ని వినడం చేత ఆ దోషం తగిలి , అశ్వదేహం విడిచి స్వర్గాన్ని పొందాడు.” అని చెప్పాడు .
ఇదంతా విని ఆ రాజు తన పరివారముతో కూడా విష్ణుశర్మకు నమస్కారము చేసి, గీతా పంచదశ ఆధ్యాయాన్ని ఉపదేశము పొందారు . తిరిగి అతని అనుమతిని పొంది తన రాజ్యానికి వెళ్లారు . ఆ తర్వాత రాజ్యమును తన కుమారుడైన సింహబలునకి పట్టముగట్టి, తాను ప్రతిరోజూ గీతా పంచదసాధ్యాయాన్ని పారాయణ చేస్తూ, చివరికి మోక్షాన్ని పొందారు. కాబట్టి ఈ పంచదశాధ్యాయాన్ని పారాయణ చేసేవారు, వినేవారు కూడా సర్వపాప విముక్తులై తరిస్తారు. చివరికి పశువులు విన్నా కూడా వాటికి మోక్షం కలుగుతుంది .” అని పరమేశ్వరుడు ఈశ్వరికి వివరించారు .
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!
#bhagavadgeeta
Tags: bhagavadgita, bhagawadgeeta, bhagavadgeeta