Online Puja Services

భగవద్గీత పదునాల్గవ అధ్యాయ పారాయణ మహత్యం .

18.191.165.192

స్త్రీ హత్యా పాతకము, జారత్వదోషము మొదలైన పాపాల నుండీ ముక్తినిచ్చే భగవద్గీత పదునాల్గవ అధ్యాయ పారాయణ మహత్యం . 
- లక్ష్మీరమణ 

ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వము,రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు జీవాత్మను శరీరములో  బంధించి ఉంచుతాయి. మన అందరిలోనూ ఉన్న ఈ త్రిగుణాల  ప్రభావం వలననే జీవులు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి, క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. అంటూ ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును పరమాత్మ భగవద్గీతలోని పదునాల్గవ అధ్యాయంలో వివరిస్తారు. ఈ అధ్యాయాన్ని నిత్యమూ పారాయణ చేయడం వలన కలిగే ఫలితాన్ని పరమేశ్వరుడు పరమేశ్వరికి ఈ విధంగా వివరిస్తున్నారు . 

“ఓ దేవీ ! బ్రహ్మాండమంతా భగవంతుని సృజనే ! అయితే త్రిగుణాత్మకమైన ఆ సృష్టిలో సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేసేది.  జీవునికి సుఖంపట్ల కన్నా జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.

దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు. అని పరమాత్మ భగవద్గీతలో అర్జనునికి త్రిగుణాల గురించి వివరిస్తారు .

ఓ పర్వతపుత్రి! ఇప్పుడు భవ బంధాల నుండీ విముక్తిని పొందేందుకు ప్రధానమైన ఈ దివ్యమైన అధ్యాయాన్ని  వలన కలిగే ఫలితాన్ని చెబుతాను.  శ్రద్ధగా విను” . అని పరమేశ్వరుడు ఇలా చెప్పడం కొనసాగించారు . 

 “పూర్వము శౌర్యవంతుడైన శౌర్యవర్మ అనే రాజు  కాశ్మీర మండలాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు.  అదే కాలంలో సింహళ ద్వీపాన్ని పరాక్రమ వంతుడైన విక్రమవేదాలుడనే మహారాజు ఏలుతూ ఉండేవాడు.  వీళ్ళిద్దరికీ మంచి స్నేహం ఉండేది.   ఒకనాడు సౌర్యవర్మ తన మిత్రుడైన విక్రమ వేదాలుని సందర్శించడానికి వెళ్లి ఆయనకీ రెండు ఆడ కుక్కలను కానుకగా ఇచ్చాడు .  విక్రమ వేతాళుడు ఆ కుక్కలను స్వీకరించి, తన స్నేహితునికి ఒక మదపుటేనుగుని , మంచి జాతి అశ్వముని,   మణిభూషణాలనూ కానుకలుగా పంపించాడు. 

ఆ తర్వాత విక్రమ వేతాళుడు ఒకరోజు రాజకుమారులతో కలిసి ఆ కుక్కలను వెంటబెట్టుకుని వేటకు వెళ్ళాడు. ఆ విధంగా అడవిలో ప్రవేశించి వేటాడుతూ ఒక కుందేలుని పట్టుకొబోయారు రాజుగారు . దాన్ని పట్టుకునేందుకు తన దగ్గరున్న కుక్కల్లో ఒకదాన్ని విడిచిపెట్టారు . ఆ కుందేలు వాళ్ళని ఒక ఆశ్రమ ప్రాంతానికి తీసుకుపోయింది . అక్కడ జంతువులన్నీ చాలా మర్యాదగా , జాతివైరాలని మరిచి మరీ ప్రవర్తిస్తున్నాయి . పాములు భయాన్ని వదిలి నెమళ్ళ రెక్కల్లో నిద్రిస్తున్నాయి.  ఏనుగులు సింహాలతోటి ఆడుకుంటున్నాయి . అక్కడికి దగ్గరలోని ఆశ్రమంలో ఒక మునీశ్వరుడు నివసిస్తూ ఉన్నారు. అతడు నిత్యము గీతా చతుర్దశాధ్యాయం పారాయణ చేస్తూ, శిష్యులకు కూడా ఉపదేశిస్తూ ఉన్నారు. 

ఆ ముని శిష్యులు అప్పుడే బయటినుండీ ఆశ్రమానికి వచ్చి, ఆశ్రమ ప్రాంగణంలో కాళ్ళు కడుక్కొన్నారు. ఆ నీళ్ళ చేత తడిసిన భూమి అక్కడ బురదగా మారి ఉంది. కుక్కచేత తరమాబాదుతున్న కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బురదలో పడింది .  అలా ఆ శిష్యులు కాళ్ళు కడుక్కున్నా నీళ్లు  కుందేలు శరీరాన్ని తాకగానే, అది తన దేహాన్ని విడిచి దివ్య రూపాన్ని ధరించింది. అది దివ్య విమానాన్ని అధిష్టించి, దివికి వెళ్ళింది.  ఆ కుందేలుని వెంబడిస్తూ వచ్చిన  కుక్క కూడా దైవకృప చేత ఆ పదప్రక్షాళనా జలంలో జారిపడి దాని జంతు శరీరాన్ని విడిచిపెట్టింది .  దేదీప్యమానమైన ఒక దివ్యగంధర్వ స్త్రీ రూపాన్ని ధరించి, అఖిల గంధర్వుల చేత కీర్తించబడుతూ, దివ్య విమానాన్ని అధిరోహించి, స్వర్గానికి వెళ్ళింది. 

విక్రముడు ఇదంతా చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు.  ఆ మునివర్యుని శిష్యులకి ప్రణామం చేసి , ఇలా ప్రశ్నించాడు. “ ఓ మహాత్మా! పశువులుగా జన్మించి,  జ్ఞానము అంటే ఏమిటో కూడా తెలియని ఈ జంతువులూ దివ్య రూపాలను ధరించి ఉత్తమ గతిని పొందడానికి కారణమేమిటి? దయతో తెలియజేయండి” అన్నారు . 

అప్పుడు ఆ మునీశ్వరుని శిష్యులు ఈ  విధంగా చెప్పారు.  “ఓ రాజా! ఈ ఆశ్రమములో మా గురువుగారు రోజూ గీతా చతుర్ధశాధ్యాయాన్ని భక్తితో పారాయణ చేస్తూ, మాకు కూడా ఉపదేశిస్తూ ఉన్నారు. వారి ఆజ్ఞానుసారముగా మేము కూడా  గీత చతుర్దశాధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉన్నాము .  ఇంతకు ముందర మేము ఇక్కడ కాళ్లు కడుక్కున్నాము.  మేము నిత్యము చతుర్దశాధ్యాయాన్ని పఠిస్తూ ఉండడం చేత పునీతమైన దేహాన్ని కడిగిన నీళ్లలో పడినందువల్ల  కుక్క కుందేలు కూడా పరమ పరమపదాన్ని పొందాయి. 

 రాజా! ఈ జంతువుల  పూర్వ వృత్తాంతాన్ని కూడా చెబుతాను.  జాగ్రత్తగా విను” అంటూ ఇలా చెప్పసాగాడు.  పూర్వకాలంలో మహారాష్ట్ర దేశంలో  కపట శీలుడైనటువంటి కేశవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు.  అతనికి తగిన భార్యే  విలోభన. ఆమె కామోన్మత్తంతో విచ్చలవిడిగా ప్రవర్తించేది. ఒకసారి ఆమె ప్రవర్తనకి  కేశవునికి పట్టలేని కోపం వచ్చింది . దాంతో ఆమెని హత్య చేశాడు . ఆ స్త్రీహత్యాపాతకము వలన ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా కుందేలై జన్మించాడు. ఆ కుందేలుని తరిమిన ఆడకుక్క అతని భార్యయైన విలోభనే కాక వేరుకాదు .” అని వివరించాడు . 

అటువంటి దుష్ట స్వభావం కలిగి, పాపాలు చేసి, జంతు జన్మలు పొందిన దంపతులు కేవలం ఆ శిష్యులు కాళ్ళు కడుక్కున్నా నీటిలో పడడం వలన పొందిన ఉత్తమ గతులు చూసి రాజుగారు విస్మయులయ్యారు. ఆరోజు నుండీ భక్తితో తాను కూడా భగవద్గీత లోని చతుర్ధసాధ్యాయాన్ని పారాయణ చేయడం మొదలుపెట్టారు .  ఆవిధంగా ఆ విక్రమవేతాల మహారాజు  కూడా చివరికి మోక్షాన్ని పొందారు. 

కాబట్టి ఈ 14వ అధ్యాయాన్ని రోజూ పారాయణం చేయడం చేత మానవులు స్త్రీ హత్యా పాతకాన్ని, జారత్వ దోషము మొదలైన పాతకములుగా చెప్పబడిన పాపాలని కూడా నశింపజేసుకుని, ఉత్తమ గతులను పొందగలరు. ఇందులో ఎంత మాత్రం కూడా సందేహము లేదు.”  అని పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరించారు. 

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!! 

#bhagavadgeeta

Tags: bhagavadgeeta, bhagawadgeeta, bhagavadgita,

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi