భగవద్గీత పదమూడవ అధ్యాయ పారాయణ మహత్యం
భగవద్గీత పదమూడవ అధ్యాయ పారాయణ జన్మజన్మాంతర పాపముల నుండీ విముక్తిని ప్రసాదిస్తుంది.
- లక్ష్మీరమణ
భగవద్గీత లోని పదమూడవ అధ్యాయానికి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అని పేరు . ఆత్మ నాశనము లేనిది. కానీ, ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరములో బంధిస్తూ ఉన్నాయి. అందరిలోను ఉన్న ఈ మూడు గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు . ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి, క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. అంటూ జీవుడిపైన ఈ త్రిగుణాల ప్రభావాన్ని భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో అర్జనుడికి ఉపదేశిస్తాడు. నారాయణుడు - శ్రీకృష్ణుడైతే, నరుడు - అర్జనుడు . అందువల్ల మానవ హితం కోసం ఆ పరమాత్మ చెప్పిన పరమ జ్ఞానమే భగవద్గీత .
బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృష్టించబడుతుంది. సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపచేసేటటువంటిది. ఇది జీవునికి సుఖంపట్ల, జ్ఞానం పట్ల, ఆసక్తిని పెంచి, జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది.
వీటిల్లో సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి. దేనినీ ద్వేషించకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మల మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు, గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు. అని భగవానుడు ఈ విభాగంలో చెబుతారు . గీతలోని ఈ పదమూడవ అధ్యాయాన్ని పఠించడం వలన కలిగే ఫలితాన్ని పద్మపురాణంలో పరమేశ్వరుడు పార్వతీమాతకి ఇలా వివరించారు .
“ఓ దేవీ ! గీతలోని ఈ పదమూడవ అధ్యాయాన్ని కేవలం వినడం వలన అంతకరణము పవిత్రమవుతుంది. దానిని తెలిపే ఉదంతాన్ని నీకిప్పుడు చెబుతాను. జాగ్రత్తగా విను .” అంటూ ఇలా చెప్పసాగారు . “దక్షిణ దిశలో తుంగభద్రా నాదీ తీరములో హరిహరపురము అనే నగరం ఉన్నది. హరిహరుడనే భగవంతుడు ఆ పురములో అధిష్టాన దేవుడై ఉన్నాడు. ఆయనని సందర్శించిన మాత్రము చేత పరమ కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. ఆ నగరంలో హరి దీక్షితుడు అనే ఒక క్షత్రియ బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు వేద వేదాంగ పరంగతుడు, తపస్సాలి, విద్వాంసుడు. కానీ, అతని భార్య దురాచారపరురాలు. ఎల్లపుడూ భర్తని తిడుతూ ఉండడమే ఆమె పని . పైగా పరపురుష వ్యామోహముతో , జారత్వము కూడా కలిగినది.
ఒకసారి ఆ గ్రామంలో ఉత్సవాలు జరుగుతున్నాయి . ఆరోజు గ్రామమంతా కూడా జనాలతో నిండిపోయి ఉంది . హరిదీక్షితుడు దైవకార్యాలలో తీరికలేకుండా ఉన్నాడు . అప్పడు అతని భార్య దగ్గరలోని అరణ్యము ప్రాంతాన్ని తనకు సంకేత స్థలముగా ఎన్నుకొని, విటులకోసం ఎదురుచూడడం మొదలుపెట్టింది. ఆనాటి రాత్రి ఒక్క విటుడైనా ఆ అరణ్యానికి పోలేదు. ఆమె కామోన్మత్తముతో అక్కడున్న పొదరిళ్లన్నీ కలయదిరిగింది. ఎక్కడా ఒక్క మనిషయినా కనిపించకపోవడంతో, విసిరి వేసారి ఒక పొదరింట పిచ్చి ప్రేలాపాలు చేస్తూ, కూర్చుంది . ఆమె ప్రేలాపాలు విని అక్కడి గుహలో నుండీ ఒక పులి గర్జిస్తూ యువతలకు వచ్చింది. ఆ అరుపులు విన్న ఆమె అవి తనకోసం వచ్చే విటుడు చేస్తున్న సంకేత శబ్దాలుగా అర్థం చేసుకుంది . ఆ పొదరిల్లు నుండి బయటకు వచ్చింది.
వెంటనే ఆ పులి ఆమె మీదకి లంఖించింది. కానీ ఆమె గంభీరంగా ఆ పులిని ఉద్దేశించి ఇలా అన్నది . “ ఓ వ్యాఘ్రమా! క్షణకాలం ఆగు . నీవు నాపై ఎందుకు అనవసరంగా దాడి చేస్తున్నావు ? ముందుగా నన్ను ఇలా చంపడానికి గల కారణం చెప్పి, ఆ తరువాత నన్ను చంపు.” అన్నది . మిక్కిలి ఆకలిగా ఉన్న ఆ వ్యాగ్రము ఆమె మాటలు విని క్షణకాలము ఆగి, మందహాసముతో ఈ విధంగా పలికింది. “ దక్షిణ దేశంలో మలాపహ నదీ తీరమున మునిపర్ణమనే గ్రామము ఉంది. అందులో భగవంతుడు పంచలింగశ్వరుడు అనే పేరుతో విరాజిల్లుతున్నాడు. పూర్వము ఆ గ్రామములో నేనొక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. ధనాస చేత వేదవిద్యను విక్రయించి, ఇతర భిక్షకులకు, పండితులకు కూడా ఆధారమేమీ లేకుండా చేసి, అన్యాయ ఆర్జన చేస్తూ, ఇతరుల వద్ద ఋణములు చేస్తూ, చెడ్డ పనులను ఆచరిస్తూ జీవించాను.
ఈ విధంగా ఉండగా, కొన్నాళ్ళకి వయసు మీదపడింది. తల నెరిసిపోయి, పళ్ళు ఊడిపోయాయి ఇంద్రియ పటుత్వము అంతరించింది. శరీరము ముడతలు పడింది. ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా, నేను ఒక పర్వదినాన ఒక తీర్థానికి వెళ్ళాను . అక్కడ ఒక శునకము వచ్చి నన్ను కరిచింది. వెంటనే నేను మూర్చపోయి, భూమి మీద పడి వెంటనే మృతి చెందాను. ఆ తరువాత యమదూతలు నన్ను యమలోకానికి తీసుకు వెళ్లారు . అక్కడ అనేక యాతనలు అనుభవించి, తిరిగి ఈ విధంగా వ్యాగ్రమునై జన్మించాను. ఆనాటి నుండి ఈ అరణ్యంలో నివసిస్తూ, పూర్వ స్మృతి కలిగిన వాడినవడం చేత సాధువులను, పతివ్రతలను చంపకుండా దుష్టులను, పాపాత్ములను చంపి భక్షిస్తూ ఆకలి తీర్చుకుంటున్నాను. ఇప్పుడు కులటవైన నీవు దొరికావు. కాబట్టి నాకు ఆహారమయ్యావు.” అని ఆ వ్యాగ్రము ఆమె దేహంను చీల్చి భక్షించివేసింది.
ఆ క్షణములోనే యమదూతలు వచ్చి, ఆమెను యమసన్నిధికి తీసుకుపోయారు. ఆ తర్వాత ఆమె పాప కృత్యాలను శాంతముగా విచారణ చేసి, కోటికల్పములు, నూరు మనవంతరములు గడిచేంతవరకు ఆమెను దహనం అనే నరకములో పడద్రోసి అనేక యాతనలను అనుభవించేటట్లు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఆమె భూమి పైన చండాల స్త్రీ అయి ఉద్భవించింది. పూర్వకర్మ వాసన చేత ఆమె చండాల స్త్రీ అయి కూడా జారత్వమును ఆచరిస్తూనే ఉన్నది. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆమెకు చెప్పలేని వ్యాధులు కలిగాయి. ఆ వ్యాధుల చేత పీడితురాలై ఆమె తన జన్మస్థానమునకు వెళ్ళిపోయింది.
అక్కడ జంభకాదేవితో విరాజమానుడై పరమేశ్వరుడు నిత్యపూజలు అందుకొంటూ ఉండేవాడు . ఆ ఆలయములో వాసుదేవుడు అనే బ్రాహ్మణుడు నిత్యము ఆ పరమేశ్వర సన్నిధిలో గీతలోని త్రయోదసాధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉండేవాడు. ఆమె అక్కడకు వెళ్లి, ఆ బ్రాహ్మణుని చేత పారాయణ చేయబడుతున్న త్రయోదశాధ్యాయాన్ని విన్నది . వెంటనే చండాల దేహం విడిచి, దివ్య దేహమును ధరించి, విమానమును అధిష్టించి, దేవతల చేత సేవించబడుతూ, ఉత్తమ లోకాలను పొందింది. కాబట్టి ఈ త్రయోదశాధ్యాయాన్ని భక్తితో పారాయణం చేసేటటువంటి వారు, విన్నవారు కూడా జన్మజన్మాంతర పాప విముక్తులై చండాలత్వము పోయి ఉత్తమ గతులను పొందుతారు.” అని పరమేశ్వరుడు పార్వతీ దేవికి వివరించారు .
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!
#bhagavadgita
Tags: bhagavadgita, bhagawadgeeta, bhagavadgeeta