భగవద్గీతలోని ఏకాదశాధ్యాయ పారాయణం
సర్వరోగహరం, సర్వకళ్యాణ కారకం భగవద్గీతలోని ఏకాదశాధ్యాయ పారాయణం
- లక్ష్మీరమణ
భగవద్గీత లోని ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగముగా ప్రసిద్ధిని పొందినది . తపస్సు వలన కానీ, యజ్ఞము వలన కానీ , యాగముల వలన కూడా పొందలేని పరమాత్ముని విశ్వరూప సందర్శనము ఈ విభాగములో దర్శించగలము. ఈ అధ్యాయమును తలుచుకోవడము , ఈ అధ్యయము యొక్క పారాయణా ఫలితాన్ని తెలుసుకోవడము ఆఖరికి తెలుసుకోవాలి అనే జిజ్ఞాసని కలిగి ఉండడం కూడా ఒక యోగమనే చెప్పుకోవాలి . అటువంటి విశిష్టమైన భగవద్గీతలోని ఏకాదశాధ్యాయము పారాయణం చేయడం వలన వచ్చే ఫలితాన్ని గురించి పద్మపురాణములో పరమేశ్వరుడు, పార్వతీమాతకు ఈ విధంగా తెలియజేస్తున్నారు .
“ప్రేయసి, గీతా మహిమని తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్ననీకు, పరమ పవిత్రము, విశ్వరూపాత్మకము అయినటువంటి ఏకాదశాధ్యాయ మహత్యాన్ని వినిపిస్తాను. దీనిని గురించిన ఇతిహాసాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. ప్రణీత నది ఒడ్డున మేఘంకరము అనే ఒక విశాలమైన నగరం ఉండేది. ఆ నగరము అనేక ప్రాకారాలతోటి, గోపురాలతోటి, బంగారు స్తంభముల తోటి, నిర్మించబడి శోభాయమానంగా ఉండేది. ధర్మానువర్తులైనటువంటి ప్రజలతో శోభిలుతు ఉండేది. ధరమ్ ఎక్కడ ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటారు. అలా శ్రీమహావిష్ణువు ఆ పురములో నివసిస్తూ, పౌరులందరికీ నిత్య సుఖాలను ఇస్తూ ఉండేవారు. అక్కడ పురజనులందరూ నిత్యము ఆ శ్రీహరిని దర్శించి సంసారభయ విముక్తులవుతూ ఉండేవారు.
ఆ పురములో మేఘాల అనేటటువంటి ఒక పుణ్యతీర్ధముండేది. అందులో స్నానం చేయడం చేత, మనుషులకు శాశ్వతమైన వైకుంఠము సంప్రాప్తించేది. అక్కడ ఉన్న శ్రీ నృసింహాని ఒక మారు సందర్శించినట్లయితే, మనుషుల ఏడు జన్మల పాపాలు నశించి పరమపదాన్ని పొందేవారు. అక్కడ కల వినాయకుడిని చూసినట్లయితే సర్వవిఘ్నాలు నశించిపోయేవి. ఆ పురములో సదా బ్రహ్మచర్యా నిరతుడు, మమతారహితుడు, జితేంద్రియేడు, వేదవేదాంగ పారంగతుడు, శ్రీహరి శరణాగత భక్తుడు అయిన సునందుడు అనే ఒక ఆసామి ఉండేవాడు. అతడు నిత్యము శ్రీహరి సాన్నిధ్యములో భగవద్గీతలోని విశ్వరూపాత్మకమైన ఏకాదసాధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు. అందుచేత అతడు చాలా స్వల్ప కాలములోనే బ్రహ్మజ్ఞాన పరిపూర్ణుడైనాడు.
ఒకరోజు ఆయన బృహస్పతి సింహరాశిని పొంది ఉన్నప్పుడు, గోదావరి తీర్థయాత్ర చేసేందుకు ఇంటి నుండీ పరివార సమేతంగా ప్రయాణమయ్యారు . దారిలో ఉన్న పుణ్య తీర్థములన్నీ సేవించి ‘వివాహ మండపము’ అనే ఊరికి చేరుకున్నారు . ఆ రోజు చీకటి పడిపోవడంతో , ఎవరింట్లోనైనా ఆరోజుకి విడిది చేసి , తర్వాత ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకున్నారు . అప్పుడు ఆ ఊరి గ్రామాధికారి వచ్చి, ఒక ధర్మశాలని అతనికి చూపించి, అందులో ఉండమని చెప్పి వెళ్లిపోయాడు.
సునందుడు తన పరివారముతోసహా ఆ విడిదిలో ఆ రాత్రికి హాయిగా విశ్రమించారు. మరుసటి రోజు ఉదయము మళ్లీ ఆ గ్రామాధికారి వచ్చారు. సునందుణ్ణి , అతని పరివారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘ మహాత్మ మీరందరూ కూడా చిరాయివులు, పుణ్యపురుషులు, పవిత్ర హృదయులు అయ్యుంటారు . ఈ విడిదిలో నిర్భయంగా ఒకరాత్రి బసచేసి బ్రతికి బట్టకట్టినవారు ఎవరూ లేరు . మీకు ఈ ఇంట్లో భయం కలగలేదా?” అని ప్రశ్నించాడు . “మహిమోపేతమైన మీ పాదం మా గ్రామానికి మంచిదని భావిస్తున్నాను. దయచేసి మీరు మరికొంత కలం మా గ్రామంలో ఉండండి”. అని అభ్యర్థించాడు.
ఆ గ్రామాధికారి అభ్యర్థనని మన్నించి, సునందుడు ఆ గ్రామములోనే సపరివారంగా నివసిస్తూ ఉన్నాడు. ఇలా ఎనిమిది రోజులు గడిచిపోయాయి. తొమ్మిదవ రోజు ఉదయమే గ్రామాధికారి ఏడుస్తూ, సునందుని దగ్గరికి వచ్చాడు. “మహాత్మా! గడచిన రాత్రి నా కుమారుడిని ఒక బ్రహ్మ రాక్షసుడు తినేశాడు. మీరొక్కరే వాడికి మల్లి జీవాన్ని ప్రసాదించగలరు . దయచేసి అనుగ్రహించండి.” అని పలుకుతూ ఆ బ్రహ్మ రాక్షసుని ఉదంతాన్ని ఇలా చెప్పా సాగాడు .
“ స్వామీ ! ఈ గ్రామంలో నరభక్షకుడైన ఒక బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు నగరంలో ప్రవేశించి ఇష్టం వచ్చినట్టు మనుషులను అందరినీ భక్షిస్తూ ఉన్నాడు. అది చూసి మేమందరము అతనిని ఇలా అభ్యర్ధించాము . ‘ఓ రాక్షసా ! నీవు మమ్మల్ని రక్షిస్తూ ఉండు. నీ ఆహారము కోసము మేమే ఒక ఏర్పాటును చేస్తాము. ప్రయాణిస్తూ, బాటసారులై ఈ గ్రామానికి వచ్చే అతిధులను నీ ఆహారము కోసము ఈ ధర్మశాలకు పంపుతూ ఉంటాము. నీవు వాళ్ళని భక్షిస్తూ ఉండు. ఆ విధంగా ఈ ధర్మశాల కి ఎవరు రాని రోజు నువ్వు గ్రామములో ప్రవేశించు. అంత వరకూ మా జోలికి రావొద్దు.’ అని అతన్ని ప్రార్థించారు. అతడు కూడా మా ప్రార్థనను విని ‘ఆ విధంగానే జరుగును గాక’ అని వెళ్ళిపోయాడు.
ఆరోజు నుండి ఆ విధంగానే జరుగుతోంది. ఇంతకాలానికి నేడు మీరి ధర్మశాలలో సుఖంగా ఉండగలిగారు. మీరు ఎంత ప్రభావపూర్ణలో దీన్ని బట్టే మేము అర్థం చేసుకోగలిగాము. ఓ భూసురోత్తమా! రాత్రి మార్గవసమున నా కుమారుని మిత్రుడు వచ్చాడు. అతనిని ఈ ధర్మశాలకు పంపాను. ఈ విషయం తెలియక, స్నేహితునితో కలిసి నా కుమారుడు కూడా ఇక్కడే పడుకున్నాడు .ఆ బ్రహ్మ రాక్షసుడు అతనితోపాటు నా కుమారుణ్ణి కూడా తినేశాడు. స్వామీ! నేను చేసేది తప్పేనని నాకు తెలుసు అయినా నాగ్రామాన్ని రక్షించుకోవడానికి నాకు ఇంతకంటే మరో మార్గం కనిపించలేదు . కుమారుణ్ణి కోల్పోయిన బాధలో నేను ఈ రోజు ఉదయము ఆ బ్రహ్మ రాక్షసుని వద్దకు వెళ్లాను . నియమాన్ని ఉల్లంఘించి , ఈ ఊరివాడైన నా కొడుకుని ఎలా తినేశావని ప్రశ్నించాను . రాత్రి పూట సరిగా కనిపించక నా కుమారుణ్ణి తినేశాననీ , అతనీతోపాటుగా తానూ తినేశిన ఇతరులందరినీ తిరిగి బ్రతికించుకొనే ఆకాశం మీ రూపంలో ఈ సత్రంలో ఉన్నదని చెప్పగా విని ఆశ్చర్య పోయాను” అని చెప్పాడు గ్రామాధికారి.
సునందుడు తానూ చేయగలిగిందేమైనా ఉంటె తప్పక సాయపడతానని మాటిచ్చిన తర్వాత తిరిగి ఆ గ్రామాధికారి ఆ రాక్షసుడు చెప్పిన తరుణోపాయాన్ని ఇలా వివరించాడు. “ ఓ పుణ్యాత్మా !భగవద్గీతలోని ఏకాదసాధ్యాయాన్ని పారాయణ చేస్తూ అభిమంత్రించిన జలము చేత అతని రాక్షసత్వం పోవడమే కాక ఇంతకు ముందర అతను భక్షించిన వారందరూ కూడా జీవించి ముక్తిని పొందగలరని ఆ బ్రహ్మరాక్షసుడు చెప్పాడు . మీరు ఈ ధర్మశాల లో గీతలోని ఏకాదసాధ్యాయాన్ని పారాయణ చేస్తూ అతనికి దర్శనమిచ్చారని , అందువల్లే మిమ్మల్ని కబళించలేకపోయానని అతను నాతొ చెప్పాడు . ఏడుమార్లు గీత ఏకాదశాధ్యాయాన్ని పారాయణ చేసి, జలమును అభిమంత్రించి ఆ రాక్షసునిపైన జల్లితే, అతని ఉదరములో ఉన్న జీవులందరినీ కూడా ఉద్దరిస్తాను అని చెప్పాడు . పైగా కృత జన్మలో తన పేరు కృషీవలుడు అనే బ్రాహ్మణుడనీ , ముని శాపం వాళ్ళ తానూ బ్రహ్మరాక్షడ నయ్యానని , ఈ ఏకాశమాధ్యాయ పారాయణ చేసి ప్రోక్షించిన జలముతో తన శాపం కూడా తొలగిపోతుందని ఆతను వివరించాడు .
కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమా ! అతని వద్దకు పోదాము. మీ చేతితో అతని శిరస్సును తాకి, జలమును ప్రోక్షించి అతనిని, అతని ఉదారములోని సమస్త జీవములను ఉద్ధరింప చేయండి” అని వేడుకున్నాడు. కరుణా తరంగితుడైనటువంటి సునందుడు గ్రామపాలుని వెంట ఆ రాక్షసుని దగ్గరకు వెళ్లి, జలమును తీసుకొని ఏడుమారులు గీత లోని ఏకాదశాధ్యాయ పఠనం చేసి, నీటిని అభిమంత్రించి రాక్షసుని శిరస్సున జల్లాడు .
వెంటనే ఆ రాక్షసుడు, వాడిచేత భక్షించబడిన వేలకులది జీవులు దివ్య వస్త్రాలంకార భవిష్యత్తులై చతుర్భుజలై శంఖ , చక్ర, గదా, పద్మ దారులై దివ్య విమానాలను అధిష్టించారు. అప్పుడు పుత్రవాత్సల్యము చేత గ్రామ పాలుడు, రాక్షసుని ఉద్దేశించి ఈ విధంగా పలికాడు. “ఓ రాక్షసా! వీరిలో నా కుమారుడు ఎక్కడ ఉన్నాడు ? “ అని అడిగాడు . అప్పుడు గ్రామపాలుడు దివ్య లక్షణ సంపన్నుడు, చతుర్భుజుడు అయిన ఇతనే నీ కుమారుడు అని రాక్షసుడు అతన్ని చూపించాడు. గ్రామాధికారి కుమారున్ని ఇంటికి పోదాము రమ్మని ఆహ్వానించాడు. అప్పుడతను తండ్రితో “తండ్రి! నమస్కారం. ఇదివరలో నీవు నాకు ఎన్ని మార్లు పుత్రుడవైయావో ! ఈ జన్మలో నేను నీకు కుమారుడునై ఇప్పుడు దైవత్వమును పొందాను. ఈ బ్రాహ్మణుని అనుగ్రహం వలన వైకుంఠమునకు పోతున్నాను. ఈ రాక్షసుడు కూడా దివ్యదేహ దారియై వైకుంఠమునకు వెళుతున్నాడు. కాబట్టి నీవు కూడా ఈ మోహమును విడిచి పెట్టు. ఈ బ్రాహ్మణుని వలన ఏకాదశాధ్యాయమును ఉపదేశము పొంది, నిత్యము పారాయణ చేయి. దీని వలన నీవు కూడా నిస్సంశయముగా ఉత్తమ గతిని పొందగలవు. తండ్రి! మానవులకు సాధుజన సాంగత్యం లభించుట చాలా దుర్లభము. అటువంటి సాంగత్యం కూడా నీకు ఇప్పుడు లభించినది. దానివలన నీ అభీష్టము తప్పక లభిస్తుంది.
ధనభోగ యజ్ఞ దాన తపస్సుల వంటి వాటి వలన ప్రయోజనమేముంది? ఏకాదశాధ్యాయ పారాయణము వలన పరమ కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. పూర్ణానంద సందోహ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రములో అతని మిత్రుడైన అర్జునునికి అమృతోపదేశం చేశారు. పరతత్వ స్వరూపుడైన శ్రీకృష్ణుడిని సదా ధ్యానము చేయి. అదే మోక్షసిద్ధికి ఉత్తమ రసాయనము. దానివలన సంసార బంధాల నుండి విముక్తి కలుగుతుంది. సర్వ వ్యాధులు నశించిపోతాయి. జన్మరాహిత్యం తప్పకుండా కలుగుతుంది.” అని అతడు తండ్రితో ఈ విధంగా చెప్పి ఆ తర్వాత అందరితో కలిసి వైకుంఠాన్ని పొందాడు.
ఆ గ్రామాధికారి కూడా ఆ సునందుని వలన భగవద్గీతలోని ఏకాదశాధ్యాయాన్ని ఉపదేశమును పొంది, నిత్యము పారాయణ చేసి అంతములో పరమపదాన్ని పొందాడు . కాబట్టి ఏకాదశాధ్యాయము పారాయణ చేయడం వలన కాలధర్మమును పొందినవాడు జీవించుట, సర్వపాపముల నుండి విడిబడుట, రాక్షసత్వం నుండి విముక్తి పొందుట తుదకు వైకుంఠమును చేరుట సంప్రాప్తిస్తుంది.” అని పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరించారు .
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!
#bhagavadgeeta #bhagavadgita
Tags: bhagavadgeeta, bhagavadgita, viswarupasandarsana yoga