భగవద్గీతలోని నవమాధ్యాయం పారాయణ మహత్యం
కష్టాలని కడతేర్చి, భగవానుని కరుణకి ప్రాత్రులని చేసే దివ్యమైన పారాయణ - భగవద్గీతలోని నవమాధ్యాయం
- లక్ష్మీరమణ
రాజవిద్యా రాజగుహ్య యోగమును చెప్పేది భగవద్గీతలోని నవమాధ్యాయం. సర్వజీవుల స్వరూపము నేనే ! నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు అని ఈ అధ్యాయంలో భగవానుడు చెబుతారు. ఈ అధ్యాయాన్ని నిత్యం పారాయణ చేయడం వలన సిద్ధించే దుర్లభమైన ప్రయోజనాన్ని పద్మపురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా వివరిస్తున్నారు .
”నర్మదా నది తీరంలో మాహిష్మతి అనే పట్టణమున్నది. ఆ పురంలో వేద వేదాంగాలు చదివి, అతిథి పూజా నిరతుడైన మాధవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ధనికుడైన ఆ బ్రాహ్మణుడు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. ఆ యజ్ఞంలో బలి చేయడానికి ఒక మేకను తీసుకువచ్చారు. దానికి పూజారికాలు నిర్వహించాడు. ఆ తర్వాత ఆ మేక చిరునవ్వు నవ్వుతూ, సభంతా ఆశ్చర్యపోయే విధంగా మనుష్య భాషలో ఇలా మాట్లాడింది. “ఓ బ్రాహ్మణోత్తమా! ఈ యజ్ఞము వలన లాభం ఏమిటి? ఈ యజ్ఞఫలం పూర్తికాగానే మళ్లీ జనన మరణములు తప్పేవి కాదుకదా ! నీవు యజ్ఞము ఈ విధంగా చేయడం వలన నీకూ నా వంటి జన్మమే ప్రాప్తిస్తుంది.” అన్నది.
ఈ విధంగా మేక మాటలని విన్న సభికులందరూ ఆశ్చర్య చకితులయ్యారు. రుత్వికులు మొదలైనవారు నమస్కార పూర్వకంగా ఆ యజము(మేక) ని ఈ విధంగా ప్రశ్నించారు. “ఓ యజమా! పూర్వజన్మలో నీ వృత్తి ఏమిటి? నీకు ఏ కర్మఫలం చేత, ఇటువంటి దశ సంప్రాప్తించింది? నీకు పూర్వ జన్మ స్మృతి ఏ విధంగా కలిగింది? నీ ప్రజ్ఞని చూసి, మేమందరమూ కూడా నే గురించి తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాము. కాబట్టి తెలియజేయవలసింది “ అని కోరారు. ఆ మేక “ఓ బ్రాహ్మణోత్తములారా! పూర్వము నేనొక బ్రాహ్మణుణ్ణి. అన్ని వేదములను అభ్యసించి, సర్వ విద్యా విశారదుణ్ణి అయ్యాను. వున్న రోజు నా పుత్రుడు రోగ పీడితుడవడం చేత, నా భార్య మాటలు విని , వాని రోగ నివారణార్థం చండీకకు బలివ్వడానికి ఒక యజమును తీసుకువచ్చి బలి ఇచ్చాను. ఆ సమయంలో దాని తల్లి వచ్చి నన్ను చూసి “ఓరీ పాపాత్ముడా! దుర్మార్గుడా! నీవు నా పిల్లను బలి ఇచ్చావు. కాబట్టి, తిరిగి మేక యోనిలో జన్మించుదువు గాక! అని నన్ను శపించింది.
కాలవసంలో మృతి చెంది నరకయాతనలను అనుభవించి, ఆ తర్వాత నేను మేకనై జన్మించాను. మేకగా జన్మించినప్పటికీ నాకు పూర్వజన్మ స్మృతి ఉన్నది. ఇంతకన్నా ఆశ్చర్య జనికమైన విషయం ఏమిటంటే, నేను ఒక సమయంలో కోతినై పుట్టి, పాములవాని చేత చంపబడి, మరల కుక్కనై జన్మించి, పవిత్ర పదార్ధములను తాకుట చేత ఒక బ్రాహ్మణ స్త్రీ చేత చంపబడ్డాను. అనంతరమ అశ్వమునై జన్మించి ఒక రాజభారమును మోస్తూ, ఒకచోట బురదలో దిగబడి మృతిచెంది, మళ్ళా ఈ రీతిగా మేకనై జన్మించాను. అని చెప్పింది . ఈ వృత్తాంతమంతా విన్న మాధవుడు తదితర సభికులు “ అయితే, “ఓ యాజమా! ప్రతిగ్రహణ దోషాలని రూపుమాపి ముక్తిని ప్రసాదించే మార్గము ఏది ? దయతో తెలియజేయి”. అని కోరారు.
అప్పుడా మేక తిరిగి ఇలా చెప్పసాగింది . “ఓ విప్రోత్తమా ! నీకు వినాలనేటటువంటి కుతూహలం ఉన్నట్లయితే చెపుతాను విను.” అంటూ ఈ విధంగా చెప్పసాగింది.
“ పూర్వము మోక్షప్రదాయకమైన గురుక్షేత్రమును చంద్రశర్మనే సూర్యవంశపు రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ఒక రోజున సూర్య గ్రహణ పర్వములో కాలపురుష దానాన్ని చేయదలచి, వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణున్ని పిలిచి, పురోహితుణ్ణి వెంట తీసుకొని నది కెళ్ళి స్నానమాచరించి, తిరిగి ఇంటికి వచ్చి గంధపుష్ప మాల్యాధికములచే ఆ బ్రాహ్మణున్ని పూజించి, యధావిధిగా కాలపురుష దానము చేశాడు. వెంటనే ఆ కాలపురుష విగ్రహం నుంచి ఒక చండాల మిధునం ఉద్భవించి దానమును గ్రహించిన బ్రాహ్మణుని హృదయంలో ప్రవేశించబోయింది. దాంతో ఆ బ్రాహ్మణుడు మనసులో శ్రీహరిని ధ్యానించి, శ్రీమద్ భగవద్గీత నవమాధ్యాయాన్ని పారాయణం చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు అతని హృదయ పీఠాన్ని అలంకరించి ఉండుట చేత, ఆ చండాలురు అతని హృదయములో ప్రవేశించలేకపోయారు. గీతా నవమాధ్యాయములోని అక్షరములు అతని ముఖము నుండి వెలువడుతూ, ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క విష్ణు దూతగ మారి ఆ చండాల దంపతులను దూరంగా పారద్రోలారు.
ఇది చూసి రాజు విస్మితుడై బ్రాహ్మణుడితో ఇలా పలికాడు. “ ఓ బ్రాహ్మణోత్తమా !ఇటువంటి భయంకర సమయంలో నిన్నెవరు కాపాడారు ? నీవు ఏ మంత్రాన్ని జపిస్తున్నావు? ఆ చండాల దంపతులు ఎవరు? వారు ఈ విధంగా శాంతి పొందడానికి కారణమేంటి? ఈ వృత్తాంతమంతా కూడా పూర్ణముగా వినదలుచుకున్నాను” అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు “రాజా వాళ్ళిద్దరూ మహా పాపాత్ములు. కాలపురుష దాన గ్రహణ దోషము చేత నా హృదయంలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. అప్పుడు నేను గీతా నవమాధ్యాయ మంత్రాన్ని జపించాను. ఇదంతా కూడా ఆ మంత్ర ప్రభావమే! ఓ భూపాలా! భవద్గీత నవమాధ్యాయ పారాయణము చేత ఎటువంటి కష్టాలైనా కూడా దూరమవుతాయి. ఆ కష్టముల నుండి మనము తరించవచ్చు. నిత్యము నేను ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉన్నాను . అందువలన నా చేత ఆచరించబడేటటువంటి ప్రతిగ్రహణ (దానం తీసుకున్న దోషం) దోషాలన్నీ కూడా నశించాయి” అని చెప్పారు .
అది విని రాజు మిక్కిలి సంతోషించి, ఆ బ్రాహ్మణుని వలన గీతా నవమాధ్యాయ ఉపదేశాన్ని పొంది, నిత్యము భక్తితో పారాయణ చేస్తూ, అంతమున ఆ రాజు, బ్రాహ్మణుడు కూడా పరమ పదాన్ని పొందారు. అని మేక మాధవునీతో పాటు సభలో ఉన్న వారందరికీ భగవద్గీత నవమాధ్యాయ పారాయణా ప్రతిభని వివరంగా చెప్పింది .
ఈ ప్రకారము మేక చేత చెప్పబడిన వృత్తాంతమును విన్నటువంటి ఆ బ్రాహ్మణులు కూడా దానిని చంపడం మానుకున్నారు. నిత్యము భక్తితో గీతలోని నవమాధ్యాయాన్ని పారాయణ చేసి, అంతమున పరమపదాన్ని పొందారు. కాబట్టి గీతా నవమాధ్యాయ పారాయణం వలన ప్రతి గ్రహణ దోషము నశించడమే కాక, చివరకు ముక్తి కూడా సంప్రాప్తిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎటువంటి కష్టాన్నాయినా కడతేర్చి భగవంతుని సాన్నిధ్యాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన ఉపాయము భగవద్గీత నవమాధ్యాయ పారాయణం.
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.
#bhagavadgita #bhagavadgeeta #bhagawadgita
Tags: bhagavadgita, bhagavadgeeta, bhagawadgeeta