భగవద్గీత అష్టమాధ్యాయ పారాయణం
కష్టాన్ని, దుఃఖాన్ని తొలగించి, పరమపదాన్ని ప్రసాదించే మార్గం
భగవద్గీత అష్టమాధ్యాయ పారాయణం
- లక్ష్మీరమణ
మానవజీవితంలో ప్రతి దశలోనూ ప్రతి సమస్యకీ పరిష్కారం చెప్పగలిగే గ్రంథం భగవద్గీత. ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తిస్తే మనం ఈ జీవితాన్ని సార్థక పరచుకోగలం? చిట్టచివరికి జీవన పరమార్థమైన కైవల్యాన్ని పొందగలమో చెప్తున్న గ్రంథమిది. మొదట "అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే" అని మొదలౌతుంది. అశోచ్యానన్వ శోచస్త్వం అంటే దుఃఖించ గూడని వాటి కోసం దుఃఖించకు అని మొదటి శ్లోకం . అంటే ఆనందంగా ఉండు, దుఃఖపడకు అనేది మొదటి వాక్యం ఆ భగవానుని బోధలో. మళ్ళీ చిట్టచివరికి “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ! అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః!” అంటారు భగవానుడు . దుఃఖపడకు అనేది చివరి వాక్యం. మొదట దేని గురించి దుఃఖ పడకూదదో దాని గురించి దుఃఖపడకు అని,చివరికి దుఃఖపడకు, శోకించకు అని చెప్తున్నాడు. అంటే గీతయొక్క పరమార్థం శోకనాశనం, దుఃఖనాశనం. సృష్టిలో ఎవరైనా కోరుకొనేది అదే కదా. దుఃఖం లేకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అటువంటి పరమానందం అంటే ఏమిటో తెలియజేస్తూ అజ్ఞాన జనితమైన సర్వ శోకాలనీ నశింప చేయడం కోసమే భగవద్గీత పుట్టింది. అందుకే మొదటి వాక్యం చివరి వాక్యం రెండూ కూడా మనలో ఉన్నటువంటి సర్వ దోషాలనీ దుఃఖాలనీ పోగొట్టి పరమానంద జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యమని తేటపరుస్తున్నది. అటువంటి పరమ పావనమైన గీతలో దుఃఖాన్ని నశిపజేయగల, పరమపదాన్ని ప్రసాదించగల అష్టమాధ్యాయ పారాయణా మహత్యాన్ని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పరమేశ్వరుడు పార్వతీదేవితో భగవద్గీతలోని అష్టమాధ్యాయ ఫలమును ఈ విధంగా వివరిస్తున్నారు . “భగవద్గీలోని ఎనిమిదవ అధ్యాయమును కేవలం వినడం వలన అంతఃకరణము పవిత్రమవుతుంది. భావశర్మ కథే ఇందుకు ఉదాహారణ. కాబట్టి నీకిప్పుడా ఉందంతాన్ని వినిపిస్తాను. సావధానచిత్తంతో శ్రద్ధగా విను. దక్షిణ దేశంలో మందారమర్దక పురమనేటటువంటి పట్టణం ఒకటి ఉన్నది. అందులో భావశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు పరమ వేశ్యా లోలుడై తిరుగుతూ, మాంసాన్ని భక్షిస్తూ, మద్యపానము చేస్తూ వేటాడమే జీవనోపాధిగా జీవించ సాగాడు. అతనికి విధించిన వేదకర్మములు విడిచి సురాపానం చేస్తూ ఉన్మత్తుడై ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఒకరోజు మితిమీరి మద్యాన్ని సేవించడం చేత కాలధర్మము చెందాడు.
ఆ తరువాత అతడు అనేక యమయాతనలను అనుభవించి, తిరిగి ఒక తాళ వృక్షమై జన్మించాడు. ఒకరోజు భార్యాభర్తలైన బ్రహ్మ రాక్షసులు ఆ తాళవృక్షము నీడలో సేదతీరాలనుకొని ఆ చెట్టుకింద కూర్చొన్నారు”.
పరమేశ్వరుని కథా వివరణకు అడ్డుతగులుతూ పార్వతీమాత ఇలా అడిగింది . “ స్వామీ! బ్రహ్మరాక్షసత్వము ఎంతో పాపం చేసుకుంటే కానీ వచ్చే జన్మ కాదుకాదా ! ఈ దంపతులు బ్రహ్మ రాక్షత్వాన్ని ఎలా పొందారు ? వారి వృత్తాంతము కూడా తెలియజేయండి?” అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడిలా చెప్పసాగారు. “ ప్రేయసీ! పూర్వకాలంలో కృషిబలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగములు అభ్యసించాడు. సమస్త శాస్త్రములు అధ్యయనం చేసి సదాచారుడై మెలుగుతూ ఉండేవాడు.
కానీ అతనికి ధనార్జన మీద మక్కువ పెరిగిపోయింది. ధనార్జన కోసం అతను మహిష దానాలను, అశ్వదానాలను, కాలపురుష దానాలను స్వీకరిస్తూ ఉండేవాడు . అతడి ఈ విధంగా దానాలను గ్రహించడమే కానీ ఏ రోజు కూడా ఒక్క ధర్మకార్యాన్ని అయినా చేసి ఉండలేదు. ఆయన భార్య పేరు కుమతి. కాలవశ్యములో వారిరువురూ కూడా మృత్యువాత పడి, బ్రహ్మ రాక్షసులై జన్మించారు. ఇదీ వారి జన్మ వృత్తాంతం. అయితే వారికి పూర్వజన్మ జ్ఞానం మాత్రం బ్రహ్మరాక్షస రూపంలోనూ అలాగే ఉంది.
ఆ తాళ వృక్షం నీడలో విశ్రమిస్తూ, భార్య భర్తతో “నాథా !ఈ బ్రహ్మ రాక్షస రూపము మనకు ఎలా పోతుంది? దీనికి తగిన సాధనం ఏమిటి? అని ప్రశ్నించింది.” ఆ బ్రాహ్మణుడు ఆమెకు సమాధానం ఇస్తూ, “దేవీ,ఈ బ్రహ్మ రాక్షసరూపము బ్రహ్మవిద్యోపదేశము వలన, ఆధ్యాత్మిక విచారణ వలన మనకు కలిగిన ఈ కర్మ తొలగిపోతుంది” అని సమాధానమిచ్చాడు . అప్పుడు సుమతి అప్రయత్నంగా “కిం తత్బ్రహ్మ కిం ఆధ్యాత్మమ్ కిం కర్మ పురుషోత్తమ” అంటే ఆ బ్రహ్మ ఎవరు? ఆధ్యాత్మికత ఆంటే ఏమిటి? ఈ కర్మ ఏమిటి” అని ప్రశ్నించింది.
అప్పుడా కృషి బలుడు భగవద్గీతలోని అష్టమాధ్యాయంలోని ప్రథమ శ్లోకమైన ఈ వాక్యాన్ని విన్నంతనే, తాళవృక్ష రూపంలో ఉన్న భావశర్మతో పాటు బ్రహ్మ రాక్షస రూపంలో ఉన్న కుమతి,కృషి బలుడు విముక్తులై స్వస్వరూపాలను పొందారు. అందులో కుమతి, కృషి బలులు మాత్రము దివ్యవిమానములను అధిరోహించి, వైకుంఠనికి వెళ్లిపోయారు.
అది చూసి భావశర్మ ఆశ్చర్య చెకితుడయ్యారు. ఇదంతా కూడా ఆ కుమతి పఠించిన అర్థశ్లోకములోని మహిమేనని గుర్తించిన భావశర్మ ఆ అర్థశ్లోకమునే ఒక మంత్రంగా జపిస్తూ, కాశీకి వెళ్లి అక్కడ శ్రీహరిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించాడు.
ఆ సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రశ్నించింది. “నాథా! మీరు సదా నిద్రను కూడా విడిచి, ఈ విధంగా ఎందుకు చింతిస్తున్నారు” అని అడిగింది. అప్పుడు శ్రీహరి ఈ విధంగా చెప్పారు. “ ప్రేయసి! కాశీ నగరంలో భావశర్మ అనే బ్రాహ్మణుడు నాయందు అమితమైన భక్తి కలిగి ఘోరముగా తపస్సు చేస్తున్నాడు అతడు దేహమును కూడా మరిచి గీతలోని అష్టమాధ్యాయములో ఉన్న అర్థశ్లోకము “కిం తత్బ్రహ్మ కిం ఆధ్యాత్మమ్ కిం కర్మ పురుషోత్తమ” అను మంత్రాన్ని జపిస్తున్నాడు. నేను అతని తపస్సుకు తగిన ఫలితముగా ఏమి ఇవ్వాలా ? అని ఆలోచిస్తున్నాను” అని చెప్పారు.
ఈ విధంగా చెప్పినటువంటి విష్ణుమూర్తి భావశర్మ పట్ల దయగలవాడై అతనికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ భావశర్మ వలన నరక పతితులైన అతని వంశస్తులందరూ కూడా భావశర్మ చేసినటువంటి తపస్సు వల్ల తరించి పోయారు. కాబట్టి భగవద్గీత అస్టమాధ్యాయము పారాయణ చేయడం వలన బ్రహ్మ రాక్షసత్వం, వృక్షత్వము తొలగిపోవడమే కాక ముక్తి కూడా తప్పక కలుగుతుంది. సందేహమే లేదు” అని పద్మపురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు . శుభం .
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!