భగవద్గీతలోని ఆరవ అధ్యాయ పారాయణా ఫలం
సర్వదానాల ఫలితాన్ని భగవద్గీతలోని ఆరవ అధ్యాయ పారాయణా ఫలంగా పొందవచ్చు .
- లక్ష్మీరమణ
భగవద్గీత లోని ఒక్కొక్క అధ్యాయము ఒక్కో యోగముతో సరిసమానము. ఆ గీతలోని ఏఒక్క నామాన్నయినా నిత్యమూ పఠించినా కూడా పరమపదమైన ఆ వైకుంఠ వాసము సంప్రాప్తిస్తుంది. పరమాత్ముడు వరాహపురాణంలో ఇలా అంటారు “ ఎక్కడైతే గీత నిత్యమూ చదువుతూ , వింటూ, స్మరిస్తూ ఉంటారో అక్కడ నేను స్వయంగా నివశిస్తాను” అని . అటువంటి భగవానుని స్వరూపమే అయిన భగవద్గీతా పారాయణా మహత్యాన్ని పద్మపురాణం విశదపరుస్తోంది. ఆ భగవద్గీతా పరాయణా మహత్యాన్ని వరుసగా తెలుసుకుంటూ వస్తున్నాం . ఇక్కడ భగవద్గీత లోని ఆరవ అధ్యాయం యొక్క విశేషతను పరమేశ్వరుడు, పార్వతి దేవికి ఈ విధంగా తెలియజేస్తున్నారు. సర్వదానాల ఫలితాన్నివ్వగల ఆ భగవద్గీతలోని ఆరవ అధ్యాయ పారాయణా ఫలితమెలాంటిదో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .
“సుముఖి! ఆరవ అధ్యాయ మహత్యమును చెబుతున్నాను. ఇది విన్నంత మాత్రం చేత ముక్తి కరతలామలకమవుతుంది. సందేహమే లేదు. గోదావరి తీరంలో ప్రతిష్టాన పురమనే ఒక విశాలమైన నగరం ఉంది. అక్కడ ఈశ్వరుడైన నేను విప్పలేశ్వరుడు అనే పేరుతో నివసిస్తూ ఉన్నాను. ఆ పట్టణాన్ని జానుశృతి అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన నిత్యము యజ్ఞములు చేస్తూ, అపరిమితమైన దానములు చేస్తూ, ఉండేవాడు. ఆ యజ్ఞ కుండములో ఉండేటటువంటి ధూమము స్వర్గములో గల కల్పవృక్ష పర్యంతము వ్యాపించింది. కల్పవృక్షము కూడా సిగ్గు చెందిందా అన్నట్లు ఆ ధూమము చేత నల్లబడిపోయింది. ఆ యజ్ఞములో ఉండేటటువంటి ఆ యజ్ఞము నుండి వచ్చేటటువంటి హవిర్భాగాలను స్వీకరించడానికి నిత్యమూ వచ్చే దేవీ దేవతలందరూ ఆ పట్టణంలోనే నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ రాజు విడిచేటటువంటి దానోదకము , ప్రతాపము అనే తేజము, యజ్ఞ కుండములోని ధూమము ఈ మూడు కలిసి మేఘముగా ఏర్పడి ఆ రాజ్యంలో సకాలంలో వర్షాలు కురుస్తూ ఉండేవి.
వీటివల్ల అతని రాజ్యములో ఈతి బాధలు లేకుండా, నీతి నియమాలు కలిగి ప్రజలు ప్రవర్తించేవారు. ఆ రాజు చేసే దానధర్మాలకు సంతోషించి వరాలు ఇవ్వడానికి దేవతలు హంస రూపాన్ని ధరించి ఒక్కొక్కసారి అంతరిక్షంలో సంచరిస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు అలా వెళుతున్న దేవతా స్వరూపాలల్లో భద్రాశ్వములు అనే రెండు హంసలు వేగంగా ముందుగా ఎగురుతూ ఉండగా మిగిలిన హంసలన్నీ వాటిని అనుసరిస్తున్నాయి. ఆ హంసలు తమ ముందున్న భద్రాశ్వములతో ఇలా అన్నాయి “ఓ భద్రాశ్వములారా ! ఈ మార్గము చాలా దుస్తరంగా ఉంది. జాగ్రత్తగా ముందుకి వెళ్ళాలి . మీకు దారి సరిగ్గా కనిపిస్తోందా ? ఆ జానుశృతి మహారాజు తేజము తీవ్రంగా కనిపిస్తోంది. ఒక జ్వాలాగా అది మనల్ని దహింప చేయవచ్చునెమో ” అన్నాయి .
ఈ వాక్యాలు విన్న భద్రాస్వములు పరిహాసంగా నవ్వి ఇలా అన్నాయి. “ ఈ మహారాజు ఎన్నో యజ్ఞాలని చేసి, దానాలని చేసి ఇంతటి తేజస్సుని మాత్రమే పొందారు . కానీ స్వయంగా విష్ణుస్వరూపాన్ని పొందినవాడు, బ్రహ్మ తేజో సంపన్నుడైన ఆ రౌక్యుని తేజస్సుకు ఇది సాటిరాగలదా ?”
జానుశృతి మహారాజు తన మేడపైన మంత్రితో కలిసి విహరిస్తూ ఈ హంసల సంభాషణ విన్నాడు. వెంటనే తన మంత్రితో “ ఓ మంత్రి వర్యా ! నేను ఆ తేజోరాశి అయిన రౌక్య మహాశయుణ్ణి దర్శించాలనుకుంటున్నాను. కాబట్టి మీరు వెంటనే వెళ్లి ఆ మహాముని ఎక్కడున్నా సరే వెతికి మన రాజ్యానికి తీసుకురండి” అని ఆదేశించారు. రాజాజ్ఞానుసారంగా, ఆ మహామునిని వెతకడానికి బయల్దేరారు మంత్రి , ఆయన రథ సారధి.
ఆ విధంగా వాళ్ళు పుణ్యక్షేత్రాలన్నీ విచారిస్తూ , మధురలో ఉన్న శ్రీహరినిలయమైన జగన్నాధమును చేరారు. అక్కడ నుండి వాళ్ళు దానికి వాయువ్య భాగంలో ఉన్న కాశ్మీరమునకు వెళ్లారు. ఆపురము శ్రీ పరమేశ్వరుని నవ్వువలె తెల్లనిదై అనేక ప్రాసాదములతో అలరారుతూ ఉండేది. అందులో వేద వేదాంగ వేత్తలైన బ్రాహ్మణులు నివసిస్తూ ఉండేవారు. ఇక్కడి దైవబలము చేత మూగవారు సైతము వాక్చాతుర్యము కలిగిన వారవుతూ ఉండేవారు. అక్కడ జరిగే యజ్ఞముల ధూపము ఆకాశమంతా వ్యాపించి అంతరిక్షము కాలమేఘములాగా తేజరిల్లుతూ ఉండేది. మాణికేశ్వరుడు అనే పేరుతో అక్కడ పరమేశ్వరుడు పూలందుకొంటూ ఆ పురవాసులందరకు సుఖము కలగజేస్తూ ఉండేవాడు. ఆ స్వామీ కృపకలిగిన మానికేశ్వర మహారాజు సమస్త శత్రువులను జయించి, దిగ్విజయాన్ని పొంది ఆ మహారాజపురాన్ని పాలిస్తూ ఉండేవాడు .
ఆ మాణికేశ్వర ఆలయ ద్వారము దగ్గర ఒక ముని కూర్చుని ఉండడం చూసి మంత్రి సారథి అతనిని సమీపించి, ప్రణామము చేసి ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఆయనే తాము వెదుకుతున్న రౌక్య మునీద్రుడని తెలుసుకొని ఎంతో సంతోషంతో, తమ రాజుగారి ఆహ్వానాన్ని వినిపించారు. ప్రతిష్ఠాన పురాన్ని పావనం చేయాల్సిందిగా ఆహ్వానించారు. కానీ ఆయన “పూర్ణానందుడైన నేను ఎక్కడికీ రాను. ఎవరైనా నా మనస్సు తెలుసుకొని, నాకు సేవ చేయాలి” అన్నారు. అది విని వాళ్ళిద్దరూ ముని అభిప్రాయాన్ని రాజు గారికి తెలియజేశారు.
వెంటనే ఆ రాజు రౌఖ్యుని దర్శనాన్ని చేయాలనుకుని , ఆయనకి ప్రీతికరమైన కానుకల్ని వెంటతీసుకొని బయల్దేరాడు . ఒక వెయ్యి గోవులని, మంచి వస్త్రాలను, ముత్యాల హారాలను కానుకగా తీసుకుని రౌఖ్యుని సన్నిధికి పోయి ఆ కానుకలన్నీ అతని ఎదుట ఉంచి సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు ఆ ముని రాజు భక్తికి కోపగించుకొని, ఈ వస్తువులన్నీ పరిత్యాగినైన నాకు ప్రియాన్ని కలిగించవని తెలియదా ? నీ వస్తుజాతమంతా తీసుకుని తిరిగి తీసుకుని వెళ్ళిపో నాకేం అక్కర్లేదు. స్వయంగా శ్రీహరే నావాడైనప్పుదు నాకీ సంపదలతో పనేముంది రాజా !” అని పరుషంగా పలికాడు.
రాజు ఆశ్చర్యపోయి, “అయ్యా మీకీ వైరాగ్యము, శ్రీహరిని పొందగలిగిన ప్రతిభ ఎలా కలిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను . నా పై దయతో సెలవియ్యండి” అని అడిగాడు. “ఓ రాజా నేను నిత్యము భగవద్గీతలోని ఆరవ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉన్నాను. అందువల్ల నాకు పూర్ణమైన వైరాగ్యము కలిగింది . దేహం కూడా భారమవుతున్నది. కానీ ఆ శ్రీహరి కృప మాత్రము నిండుగా కలిగినది” అని రౌక్యుడు వివరించారు.
ఆనాటి నుండి రాజు కూడా భక్తి కలిగి భగవద్గీతలోని ఆరవ అధ్యాయాన్ని పారాయణ చేయడం మొదలుపెట్టాడు. దానివలన రాజుకి అతి అల్ప కాలంలోనే మోక్షం లభించింది . రౌక్యుడు ఆ మాణికేశ్వరుని ఎదుట ఆరవ అధ్యాయాన్ని పారాయణ చేయడాన్ని వినడం వలన, అక్కడికి వచ్చినటువంటి దేవతలు కూడా అత్తమతమ స్థానములకు చేరుకున్నారు.
కావున ఈ ఆరవ అధ్యాయాన్ని ఎవరైతే నిశ్చల భక్తితో నిత్యము పఠిస్తారో వారు సర్వదానముల వలన కలిగే ఫలాన్ని పొంది, చివరకు విష్ణు రూపాన్ని పొందగలరు. ఇందులో సందేహమేమీ లేదు” అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు .
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !
#bhagavadgita
Tags: bhagavadgita, bhagawadgeeta, bhagavadgeeta