భగవద్గీత మూడవ అధ్యాయ పారాయణ ఫలము వలన
భగవద్గీత మూడవ అధ్యాయ పారాయణ ఫలము వలన పితృదేవతలు ఉత్తమ గతులు పొందుతారు.
- లక్ష్మీరమణ
అమృత మంత్రమయం గీతా స్వరూపం. అది అన్ని లోకములలో పారాయణ చేయబడుతున్న పంచమవేదంలోని పరమాత్మ ప్రవచనం . వేదగానానికి కూడా గీతాసారమే మూలము అని చెప్పుకుంటే ఆశ్చర్యపోనసరం లేదు. గీతా ప్రపంచంలో భగవద్గీత ఆదిగీత. అది వాసుదేవ ద్వాదశాక్షరీ విద్యా వివరణ రూపము. గీత అష్టదసాధ్యాయాత్మకం (18 అధ్యాయాలు కలిగినది) కావడంలో కూడా ఒక వైశిష్యమున్నది. వేరువేరు మహామంత్రాలు ఆయా అధ్యాయాలలో పొందుపరచబడి వివరంగా వ్యాఖ్యానించబడి ఉన్నాయి. దీంతోటి అన్ని ఆశ్రమముల వారికి ఇది గీతగా ఉపదేశించబడింది. అంతటితో తృప్తి పడక శ్రీవ్యాసమని పామర బాలక వర్గానికి కూడా అందుబాటులో ఉండి, వారికి అది ఉపశమనంగా ఉండేందుకు అనుకూలంగా పద్మపురాణంలో ఈ గీతాపారాయణ వాళ్ళ చేకూరే ప్రయోజనాలని పొందుపరచి తరింపజేశారు. ఆ విధంగా వ్యాసుని చేత చెప్పబడినట్టి భగద్గీతా మూడవ అధ్యాయ పారాయణ ఫలము వలన పితరులు / పితృదేవతలు ఉత్తమ గతులు పొందుతారు. తరతరాల వారికి కూడా పాపారాశి దగ్దమై వైకుంఠ వాసాన్ని పొందగలరు. ఈ విశేషాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధంగా వివరించారు.
గీతా ప్రతిభ తృతీయ అధ్యాయ మహిమని శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించారని, ఆ కథని నేను నీకు వివరిస్తానని పరమేశ్వరుడు పార్వతీ మాతకి ఈ విధంగా చెబుతున్నారు. “దేవీ ! పూర్వం జడుడు అనే బ్రాహ్మణు ఉండేవాడు. అతడు దురాచారపరుడై, జాతి ధర్మములను వదిలి, స్త్రీలాలసుడై తిరుగుతూ సురాపానము చేస్తూ, పరులను హింసిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. దుర్వ్యసనాలు అతని సంపదని కరిగించేశాయి. దానితో ఉత్తరదిశలో వ్యాపారం చేస్తూ అతను చాలా దూరం వెళ్ళాడు. ధనాన్ని సంపాదించాడు. సంపాదించిన సంపదలతో తిరిగి తన జన్మస్థలానికి వస్తూ ఉండగా, మార్గమధ్యంలో సూర్యాస్తమయం అయ్యింది . ఆ రాత్రి అతడు ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఆ నాటి అర్ధరాత్రితో అతని ఆయువు తీరిపోయింది. దాంతో అతను మృతిచెంది, పాపాత్ముడై ఉండడం చేత ప్రేత రూపుడయ్యాడు.
ఆ జడునకి ధర్మపరుడు, చక్కటి యోగ్యుడు నిత్యము గీతా తృతీయఅధ్యాయముని పారాయణ చేసేవాడు అయినటువంటి ఒక కొడుకు ఉన్నాడు. అతడు ఒకనాడు తన తండ్రి గురించి వాకబు చేస్తూ, తన తండ్రి గారి మిత్రులని కలిశాడు. వారు నీ తండ్రి మృతి చెందాడని చెప్పారు. అది విని అతడు తన తండ్రికి పారలౌకిక క్రియలు చేయాలని సంకల్పించుకున్నాడు. అందుకు తగిన సామాగ్రి సమకూర్చుకుని అతను కాశీకి ప్రయాణమయ్యాడు. అలా ప్రయాణిస్తూ తొమ్మిదవ నాటి సాయంకాలానికి తన తండ్రి మృతి చెందిన వృక్షమూలానికి చేరుకున్నాడు. అక్కడ తన కాలకృత్యాలు అన్నిటిని నిర్వర్తించుకొని ఆ వృక్షమూలములో కూర్చుని అతడు భక్తితో గీతా తృతీయ అధ్యాయాన్ని పారాయణం చేశాడు.
అప్పడటానికి ఆకాశము నుండీ ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. భయంతో అతడు తల పైకెత్తి చూశాడు. అక్కడ తన తండ్రి ప్రేత దేహాన్ని విడిచి దివ్య వస్త్రాలంకార భూషితుడై దేవతలందరి చేత సేవింపబడుతూ ఒక దివ్య విమానంలో కూర్చుని ఉండటాన్ని చూశాడు. వెంటనే అక్కడికి వెళ్లి, తన తండ్రికి నమస్కరించాడు. అప్పుడా దివ్యరూపుడైన జడుడు కుమారుణ్ణి ఆశీర్వదించి “కుమారా దైవ యోగమున నీ చేత పారాయణ చేయబడిన గీతా తృతీయ అధ్యాయమును వినడం చేత నాకు దివ్యదేహము సంప్రాప్తించింది. నువ్విక కాశీకి పోవక్కర్లేదు. ఈ తృతీయ అధ్యాయ పారాయణం చేతనే స్వర్గము సులభముగా సాధ్యమవుతుంది. కనుక నీవిక తిరిగి ఇంటికి వెళ్ళవచ్చు . అని చెప్పాడు.
ఇంకా ఆ భగవద్గీత తృతీయ అధ్యాయ ఫలాన్ని ఈ విధంగా విమరించసాగారు. “కుమారా! నేను పాపాత్ముడనై, పుణ్యాత్ములలైన నా వంశజులు అందరినీ నరకములపాలు చేశాను. నీ అనుగ్రహం వలన నరకయాతనలను అనుభవించకుండానే నాకు త్వరితగతిన విష్ణులోకమునకు చేరుకొనే ప్రాప్తి కలిగింది. కనుక నీవు జీవితాంతమూ కూడా భగవద్గీతలోని తృతీయ అధ్యాయాయ పారాయణము చేస్తూ, నరక పతితులైన మన వంశజుల అందరిని ఉద్ధరించి, వారికి ఉత్తమ గతులు కలగజేయి” అని ఆదేశించాడు. తండ్రి ఆజ్ఞని స్వీకరించిన కుమారుడు “తండ్రి! నీవు చెప్పిన రీతిగా మన వంశజులనే కాక నరకమందు పడి ఉన్న జీవులన్నింటినీ కూడా ఈ తృతీయ పారాయణము చేత తరింప చేస్తాను. ఇదే నా శ్వాసగా జీవిస్తాను.” అని మాట ఇచ్చాడు . ఆ సమాధానంతో తృప్తిని పొందిన వాడై అతని తండ్రి వైకుంఠానికి చేరుకున్నాడు.
ఆ తరువాత అతని పుత్రుడు తిరిగి తన స్వస్థానానికి చేరుకొని మిక్కిలి నిష్టతో విష్ణుమూర్తి ఆలయములో తృతీయ తృతీయ అధ్యాయమును పారాయణ చేస్తూ ఆ ఫలమును నరకములోని జీవులని ఉద్ధరించడం కోసం ధారపోస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా, విష్ణు లోకములో శ్రీహరి తన దూతలను పిలిచి, “మీరు వెంటనే యమలోకానికి వెళ్లి, నరకములోని జీవులను, యమధర్మరాజును వెంటబెట్టుకుని తీసుకుని రండి” అని ఆజ్ఞాపించాడు. దాంతో విష్ణు దూతలు యమలోకానికి పోయి సాదరంగా తమ ప్రభువు యొక్క ఆదేశాన్ని యమునికి నివేదించారు. అప్పుడు యముడు వారి ఆజ్ఞను శిరసా వహించి నరక జీవులందరినీ వెంట తీసుకుని విష్ణు దూతలతో కూడా వైకుంఠానికి వెళ్లి లక్ష్మీనాథుని సందర్శించి, ఆయనని వేనోళ్ళా కీర్తించాడు. ఆతర్వాత తనని ఎందుకు పిలిపించారో కారణం చెప్పాల్సిందిగా అర్థించాడు.
అప్పుడు ఆ శ్రీ మహా విష్ణువు “ ధర్మరాజా! తిరిగి నేను ఆజ్ఞ ఇచ్చే వరకు కూడా నీవు నరకములోని జీవులను అందరిని ఇక్కడికి పంపి వేస్తూ ఉండు. ప్రతి మనిషి పాప భారమును నేను స్వయంగా భరిస్తాను. అని చెప్పి అంతర్దానమయ్యాడు. ధర్మరాజు తాను ఒక్కడు తిరిగి తన పురానికి వెళ్లిపోయాడు.
అలా ఆ బ్రాహ్మణుడు సమస్త జీవుల పాపాలను పోగొడుతూ, అంతమున వైకుంఠం ని పొందాడు. కాబట్టి ఈ తృతీయ అధ్యాయాయ పారాయణం వలన ఎలాంటి మహాపాతకుడైనప్పటికీ కూడా ముక్తిని పొందుతాడు. పితృదేవతలు ఊర్ధ్వ లోకాలని పొందుతారు. మరీ ముఖ్యంగా ప్రేతత్వము కూడా పరిహారమవుతుంది.” అని మహేశ్వరుడు వివరించారు. కాబట్టి ఈ పవిత్రమైన మార్గశిర మాసంలో అనేదరూ కూడా చక్కగా భగవద్గీతలోని మూడవ అధ్యాయాన్ని పారాయణ చేసి ఆ నారాయణుని కృపకి పాత్రులమవుదాం .
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు
#bhagavadgita
Tags: bhagavadgita, bhagawadgeeta, Bhagavadgeeta,