గీత పంచమ అధ్యాయ మహత్యం

గీతా పంచమాధ్యాయముతో మనకి ఎలాంటి సంబంధం ఉన్నా, అది జన్మరాహిత్యాన్ని అనుగ్రహిస్తుంది .
- లక్ష్మి రమణ
భగవద్గీతని చిన్ననాటి నుండే పారాయణ చేయడం , చిన్న చిన్న శ్లోకాలని పలకడం పిల్లలకి అలవాటు చేయడం ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇది ఆ చిన్నారులకి ఎంతో మేలు చేకూరుస్తుంది అనడంలో సందేహం లేదు. మనకన్నా కూడా , విదేశీయులు భగవద్గీతని ప్రామాణిక గ్రంధంగా పఠిస్తూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక, తెలిసికానీ, తెలియకగానీ, భగవద్గీతని చదివినా , విన్నా , లేక ఆ గ్రంథంతో మరేదైనా అనుబంధం కలిగినా జన్మరాహిత్యాన్ని , పుణ్యలోకాలనీ ప్రసాదిస్తుందని పద్మపురాణం చెబుతున్న మాట. ఈ మాటని స్వయంగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీ దేవికి వివరించారు. ఆ కథ ఇక్కడ తెలుసుకుందాం .
లక్ష్మీ దేవికి నారాయణుడు చెప్పిన కథని పరమేశ్వరుడు ఈవిధంగా పార్వతీదేవికి వివరిస్తున్నారు. “ దేవి! అందరి చేత ఆదరించబడేటటువంటి పంచమాధ్యాయ మహత్యాన్ని సంక్షిప్తంగా చెబుతాను. సావధాన చిత్తవై అవధరించు. మద్రదేశములో బురుకుత్సము అనే పట్టణం ఉండేది . అందులో పింగళుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాధ్యయనము విడిచి దుష్ట సాంగత్యం చేస్తూ సంగీతమును, నాట్యమును అభ్యసించి ప్రసిద్ధుడై, ఒక రాజాస్థానములో స్థానం సంపాదించి కీర్తి ప్రతిష్టలు పొందాడు . అక్కడ ఒక స్త్రీని ప్రేమించి, ఈ ప్రపంచంలో ఆమె కంటే అధికమైనదేదీ లేదన్న చందంగా ఆమెను అంటిపెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. రహస్యముగా రాజుతోటి ఇతరుల పైన లేనిపోని నేరములు ఆరోపించి చెబుతూ ఉండేవాడు.
ఆమేకాక, పింగళునికి వేరే కులములో జన్మించిన అరుణ అనే భార్య కూడా ఉన్నది. ఆమె, పరస్త్రీ వ్యామోహములో రమించిపోతున్న పింగళుని ప్రవర్తనకి విసిగిపోయి, మరొకరిని ప్రేమించి అతనితో కాలం గడపడం మొదలుపెట్టింది. ఆమె వ్యామోహం బాగా ముదిరిపోయి, ఎక్కడ తన వ్యవహారానికి భర్త అడ్డు తగులుతాడో ననే ఉద్దేశ్యంతో, ఒకరోజు అర్ధరాత్రి పింగళుని తలపై పెద్ద బండవేసి హత్య చేసింది . ఎవరికీ అనుమానం రాకుండా భర్త కళేబరమును భూమిలో పాతిపెట్టేసింది.
అలా చనిపోయిన పింగళుడు , యమలోకానికి చేరాడు. చేసిన పాపాలకి నానా శిక్షలూ అనుభవించాడు. తిరిగి ఒక అరణ్యములో గ్రద్దగా జన్మించాడు. అరుణకూడా కొంతకాలానికి భగంధర రోగముతో నానాయాతనా అనుభవించి మృతి చెందింది. నరకయాతనలను అనుభవించి, గ్రద్ద నివసించే అరణ్యములోనే చిలుకగా జన్మించింది.
గ్రద్ద ఒక రోజున ఆహారము కోసం తిరుగుతూ ఉండగా ఈ ఆడ చిలుక దానికి కనిపించింది. పూర్వజన్మ వైరము చేత అవి రెండూ కొట్టుకున్నాయి. అక్కడ నీళ్లతో నిండిన ఒక ఋషీశ్వరుని పుర్రె పడి ఉంది. ఇవి రెండూ కొట్టుకొని, కొట్టుకొని ఆ పుర్రెలో పడి చనిపోయాయి. మళ్ళీ యమదూతలు వచ్చారు. వారిద్దరిని యముని దగ్గరకు తీసుకుని పోయారు . కానీ ఈ సారి వారికీ యముడు నరకయాతనాలని శిక్షగా విధించలేదు. “దూతలారా వీళ్ళిద్దరూ కూడా ఆ మునీశ్వరుని పుర్రెలో పడి మృతి చెందారు. అందువల్ల సర్వపాపములూ నశించి పరమ పవిత్రులయ్యారు. కాబట్టి వారికి ఇష్ట లోకములను ప్రసాదిస్తున్నాను” అన్నారు.
ఒక్కసారిగా వారిద్దరూ కూడా ఆశ్చర్యపోయి, ధర్మరాజుకు నమస్కరించి “మహాత్మా! పూర్వ జన్మలో మేము అనేక పాప కృత్యాలను చేశాము. ఎలాంటి పుణ్యాన్ని చేసి ఎరుగము. అలాంటిది, మాకు ఇంతటి సుకృతము కలగడానికి కారణాన్ని వివరించండి” అని అభ్యర్థించారు. అప్పుడా యమా ధర్మరాజు ఎంతో కరుణతో ఇలా చెప్పారు. “ ఓ పుణ్య దంపతులారా! గంగా తీరంలో ద్వేషరహితుడు, ఉత్తమజ్ఞాని అయిన వటుడు అనే మహాత్ముడు ఉన్నాడు. ఆయన నిత్యము నియమముతో గీతా పంచమాధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు. గీతా పంచమాధ్యాయ శ్రవణ మాత్రము చేత మహా పాప రాశి కూడా దహించుకు పోతుంది. జీవులు పునీతులవుతారు. అటువంటి ప్రభావం చేతనే వటుడు కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొంది దేహమును విడిచాడు. గీతా పంచమాధ్యాయ పారాయణం వలన అతని దేహము పరమ పవిత్రమైంది. అటువంటి మహానుభావుని కపాలములో పడి మీరు ఇద్దరు ప్రాణాలు విడిచారు. కాబట్టి మీరు కూడా పునీతులయ్యారు. అందువల్లనే మీకు ఇస్తలోక ప్రాప్తి కలిగింది” అని వివరించారు.
వారిద్దరూ కూడా అప్పుడు పుష్పక విమానాన్ని అధిరోహించి వైకుంఠనికి వెళ్లారు. కాబట్టి క్రూర కర్మములను ఆచరించి, పక్షులై జన్మించినప్పటికీ, ఏ కారణం చేతనైనా కూడా గీతా పంచమాధ్యాయ సంబంధము కలిగినట్లయితే తప్పక జన్మ రాహిత్యమై వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది.” అని మహేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పారు.
శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!
#bhagavadgita #bhagavadgeeta
Tags: Bhagavadgita, bhagawadgeeta,