భగవద్గీత రెండవ అధ్యాయాన్ని నిత్యం పారాయణం చేయడం వలన
భగవద్గీత రెండవ అధ్యాయాన్ని నిత్యం పారాయణం చేయడం వలన జ్ఞానం సిద్ధిస్తుంది .
- లక్ష్మి రమణ
భగవద్గీత ప్రాశస్త్యాన్ని అనేక పురాణాలు శ్లాఖించాయి. పద్మపురాణంలో ఉత్తరఖండంలో పరమేశ్వరుడు పార్వతి దేవి తో సంభాషిస్తూ, భగవద్గీత యొక్క గొప్పతనాన్ని శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినట్టుగా వివరించినట్టు ఉంది. దీనిలో ప్రతి గీతాధ్యాయం యొక్క పారాయణ వలనా కలిగే ఫలితాన్ని వివరంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ద్వితీయాధ్యాన్ని ప్రతిరోజూ పారాయణం చేయడం వలన జ్ఞానసిద్ధి కలుగుతుందని పాద్మపురాణం తెలియజేస్తోంది . గీతలోని ద్వితీయాధ్యాయ పారాయణా మహత్యాన్ని వివరించే ఉదంతాన్ని ఈ విధంగా పేర్కొంది .
“లక్ష్మీ! భగవద్గీత ద్వితీయ అధ్యాయ ప్రభావాన్ని చెప్తాను ఏకాగ్రచితంతో విను” అంటూ ఆ శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పసాగారు. “ దక్షిణదేశంలో పురంధరము అనే పట్టణం ఉంది. అక్కడ వేదవేత్త, అతిధులను పూజించేవాడు, ఋషులంటే ప్రేమ కలిగిన వాడు, అనేక యజ్ఞాల చేత దేవతలను తృప్తి పరిచిన దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎన్ని విధాల సత్కార్యాలు చేసినప్పటికీ మనసుకి తృప్తి లేక, పరమ కళ్యాణాత్మకమైన తత్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకత గలవాడై నిత్యము సాధుసేవ చేస్తుండేవాడు. ఈ విధంగా చాలా కాలం గడిచిపోయింది. ఒక రోజున నిత్యానందుడు, పరమ సాధువు, అనుభవజ్ఞుడు అయిన ఒక ఋషి సాంగత్యం ఆయనకి లభించింది. దేవశర్మ భక్తితో ఆయన్ని పూజించితన జ్ఞానాకాంక్షని ఆయనకీ తెలియజేశాడు. ఆత్మజ్ఞానం కలిగే ఉపాయాన్ని బోధించమని అర్థించాడు. అప్పుడాయన దేవశర్మమీది వాత్సల్యంతో సౌపురం అనే గ్రామంలో మిత్రవాసుడనే గొర్రెల కాపరిని కలవని , ఆయన నీకు ఉపదేశము చేయగలడు అని చెప్పాడు.
వెంటనే దేవశర్మ సౌపురము బయల్దేరి వెళ్లారు. ఆ పురమునకు ఉత్తరమున ఒక విశాల వనములో, నదీ తీరంలో ,ఒక రాతి మీద కూర్చుని నిశ్చల దృష్టితో చూస్తున్న మిత్రవానుని చూశాడు . ఆయనున్న ప్రదేశంలోని మృగాలన్నీ కూడా మిత్ర భావంతో సంచరిస్తూ ఉన్నాయి. వాయువు మెల్లగా వీస్తున్నాడు. ఆ ప్రాంతమంతా శాంతమై, మంగళాత్మకంగా అలరారుతోంది. దేవశర్మ ధ్యాననిష్ట లో ఉన్న మిత్రవానుని సమీపించి ‘మహాత్మా తమ వలన నాకు ఆత్మ జ్ఞానము సిద్ధిస్తుందని ఇక్కడ వరకు వచ్చాను. అనుగ్రహించి నన్ను ధన్యుణ్ణి చేయమని ప్రార్థిస్తున్నాను’ అని పలికాడు. దేవశర్మ మాటలని విన్నటువంటి మిత్రవానడు అర్థనిమీలిత నేత్రుడై ఇలా చెప్పసాగాడు.
“ఓ విద్వాంశుడా! గోదావరి తీరంలో ప్రతిష్టాపురమనే ఒక పురము ఉన్నది అందులో విక్రముడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను వేరే కులానికి చెందిన కన్యను వివాహమాడి, అనేక దుష్కార్యములు, దుష్కర్మములు ఆచరిస్తూ నిత్యము ఉదర పోషణకై అనేక దానములను గ్రహిస్తూ ఉండేవాడు. జాతి వ్యతిరేకతములైన పనులను ఆచరిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు.
భర్త యొక్క దరిద్రాన్ని, ప్రవర్తనను చూసి అతని భార్యకి విసుగువచ్చేది . దాంతో ఆమె అతన్ని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆ గ్రామాన్ని విడిచి వెళ్లిపోయింది. వార్ధక్యంలో అనేక బాధలను అనుభవించి మృతి చెంది పూర్వకర్మ ఫలాల చేత డాకినిగా జన్మించింది. దుర్మార్గురాలై నర మాంసాన్ని తింటూ తిరుగుతూఉండేది. ఒకనాడు మనుషుల చేత బలవంతంగా చంపబడి, నరకయాతనలు అనుభవించి మరు జన్మలో పెద్దపులిగా జన్మించింది. ఆ జన్మలో అనేక ప్రాణులను హింసించి మృతి చెంది, తిరిగి ఒక గృహములో మేకగా పుట్టింది. అని వివరించాడు మిత్రవానుడు. ఇంకా ఇలా చెప్పసాగాడు .
ఇదిలా ఉంటె , ఆమె భర్తయిన విక్రముడు వయసు మీద పడడంతో అనేక కష్టాలను అనుభవించి, చివరకు కాలధర్మము చెంది యమలోకం చేరాడు . అక్కడ యమయాతనలను అనుభవించిన తరువాత, పెద్దపులిగా జన్మించాడు. ఒక రోజు వనములో నేను గొర్రెలను కాస్తూ ఉండగా, పెద్దపులి రూపంలో ఉన్న విక్రముడు అక్కడకు వచ్చాడు. దానిని చూసి గొర్రెలన్నీ చిందర వందర కావడంతో నేను ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించాను. ఇంతలో వనములోనే ఉన్న ఆ మేక భయము వదిలి, ఆ పులికి ఎదురుగా వెళ్ళింది . గంభీరముగా ‘ఓ పులీ ! ఏం ఆలోచిస్తున్నావు? నీకు ఆకలి అవ్వడం లేదా ? నీకు ఆహారంగా నేను తగను అనుకుంటున్నావా ? నన్ను నిర్భయంగా ఆరగించు ‘ అన్నది . అప్పుడా పెద్దపులి ‘ఓ చాగమా (మేకా !) నీవు ఇక్కడకు వచ్చేంత వరకు నేను ద్వేష భావాన్ని కలిగి ఉన్నాను. కానీ నీవు దగ్గరికి రాగానే నాలోని ద్వేష భావము నశించిపోయింది. ఆకలి దప్పికలు దూరమయ్యాయి. నేనింక నిన్ను తినను.’ అని చెప్పింది.
‘నీకు ద్వేషము ఆకలి దప్పికలు ఎలా పోయాయి? అని పులిని అడిగింది మేక .వారిద్దరికీ కూడా సమాధానం దొరకక వారు నా దగ్గరకు వచ్చి నన్ను తమ సందేహానికి కారణాన్ని చెప్పమని కోరాయి. నేను ఆశ్చర్యపోతూ నాకు తెలియదని పలికి వారిని వెంటబెట్టుకుని, చెట్టు కింద ఉన్న ఒక వానరోత్తముడిని దగ్గరకు వెళ్లి మా ముగ్గురికీ ఉన్న సందేహాన్ని తీర్చమని కోరాను. అప్పుడా వానరరాజం మాకు ఇతిహాసాన్ని వివరించారు.
‘ఈ సమీపంలో మీ ఎదురుగానే దేవాలయం ఒకటున్నది. అందులో బ్రహ్మచేత స్థాపించబడిన శివలింగం ఉన్నది. పూర్వము సుకర్మఈ మందిరములో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఈ వనములోని పుష్పముల చేత జలము చేత ఆ పరమేశ్వరున్ని ఆరాధిస్తూ అతడు ఈ మందిరములో చాలా కాలము నివసించాడు . ఇలా ఉండగా ఒకనాడు అతని ఆశ్రమానికి ఒక అతిధి వచ్చారు. అప్పుడు సుకర్మ అతనిని ఆదరించి ‘మహాత్మా ఇక్కడ నేను చాలా కాలము నుండి తత్వ జ్ఞానమును పొందగోరి ఈశ్వరోపాసన చేస్తున్నాను. ఈరోజు తమ రాక చేత నా ఈశ్వరారాధనము సఫలమైంది. మీ అనుగ్రహం కూడా నాకు లభించి నట్లయితే, నేను ఎంతో ధన్యుడనవుతాను అని పలికాడు . అప్పుడు ఆ అతిథి చాలా సంతోషించినవాడై ఒక రాతి పలకము మీద గీతా ద్వితీయ అధ్యాయంను రాసి ఇలా పలికాడు ‘ సుకర్మ! రోజూ నీవు ఈ అధ్యాయాన్నితప్పక పారాయణం చేస్తూ ఉండు. దీనిని పఠించడం చేత తప్పక నీ మనోరథము తీరుతుంది. అని చెప్పి ఆ అతిథి అక్కడే అంతర్దానమయ్యాడు.
సుకర్మ ఆశ్చర్యపోయి, అంతలోనే తేరుకొని అతని ఆజ్ఞనుసారంగా నిత్యము గీతా ద్వితీయ అధ్యాయాన్ని పారాయణ చేయడం మొదలుపెట్టాడు. ఇలా పారాయణ చేస్తూ ఉండగా కొంత కాలానికి అతని అంతఃకరణము పరిశుద్ధమై, ఆత్మ జ్ఞానము లభించింది. క్రమంగా సుకర్మ ఎక్కడైతే అడుగు పెడతారో ఆ ప్రదేశాలన్నీ కూడా ప్రశాంతంగా మారడం ప్రారంభించాయి. ఆయా ప్రదేశములలో సుఖదుఃఖాలు, శీతోష్ణములు, రాగద్వేషాలు మొదలైన ద్వంద్వ భావములు దూరం కాసాగాయి. ఆ ప్రదేశములలోని జీవులకు ఆకలి దప్పికలు అంతరించి భయము పటాపంచలైనదని’ ఆ వానర రాజు చక్కగా ఆ కథనంతా కూడా వివరించారు.
ఆ కథను విన్న నేను, మేకను పులిని వెంటబెట్టుకుని సుకర్మ నిత్యమూ పారాయణ చేసిన ద్వితీయాధ్యాయం చెక్కి ఉన్న ఈ రాతి ఫలకం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఉన్న ఉన్న గీతా ద్వితీయ అధ్యాయాన్ని చదివి వారికి వినిపించాను. అలా కొంత కాలము ఆ అధ్యాయమును రోజూ పారాయణ చేయగా నా తపస్సు ఫలించింది. కాబట్టి, అదే విధంగా నీవుకూడా భగద్గీత రెండవ అధ్యాయాన్ని పారాయణ చెయ్యి. నీకు ముక్తి తప్పక కలుగుతుంది. నీకు తప్పక జ్ఞానము సంప్రాప్తిస్తుంది’ అని చెప్పాడు.
లక్ష్మీ ! ఈ విధంగా మిత్రవానుని ఉపదేశాన్ని గ్రహించి దేవశర్మ తన పురంధర పురానికి చేరుకున్నాడు . నిత్యము తాను గీతా ద్వితీయ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ, ఆత్మ జ్ఞానాన్ని పొందాడు. చివరకు ఆయన పరమపదాన్ని పొందాడు’ . అని నారాయణుడు లక్ష్మీ దేవికి చెప్పాడు. కాబట్టి ఓ పార్వతీ ! ఎవరైతే ఈ విధంగా భవద్గీతలోని ద్వితీయ అధ్యాయము భక్తితో పారాయణ చేస్తారో వారు ఖచ్చితంగా ఆత్మజ్ఞానాన్ని పొంది, తుదకు ఉత్తమ గతులను పొందుతారని’ మహేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు.
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!
#bhagavadgita
bhagavadgita, bhagawadgeeta, bhagavadgeetha, dwitheeya, chapter, second