భగవద్గీత ప్రథమాధ్యాయం రోజూ చదివితే
భగవద్గీత ప్రథమాధ్యాయం రోజూ చదివితే పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది.
- లక్ష్మి రమణ
భగవద్గీత ప్రాశస్త్యాన్ని అనేక పురాణాలు శ్లాఖించాయి. పద్మపురాణంలో ఉత్తరఖండంలో పరమేశ్వరుడు పార్వతి దేవి తో సంభాషిస్తూ, భగవద్గీత యొక్క గొప్పతనాన్ని శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినట్టుగా వివరించినట్టు ఉంది. దీనిలో ప్రతి గీతాధ్యాయం యొక్క పారాయణ వలనా కలిగే ఫలితాన్ని వివరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇందులో భగవద్గీత నారాయణుని స్వరూపమని స్యయంగా ఆ పరమాత్మే పేర్కొనడం విశేషం. భగవద్గీత లోని మొదటి 5 అధ్యాయములు ముఖములుగాను, తరువాతి పది అధ్యాయములు భుజాలుగాను, ఒక అధ్యాయము ఉదరము గాను, రెండు అధ్యాయములు పాదములు గాను ఇలా మొత్తం 18 అధ్యాయములు కలిసి ఆ పరబ్రహ్మ స్వరూపంగా ఈ పురాణం వర్ణిస్తుంది . అష్టాదశాధ్యాయమైన ఈ గీత జ్ఞానశక్తి అనే సాధనము చేత మహాపాతకాలని కూడా నాశనం చేస్తుంది. గీతా పారాయణాన్ని పూర్తిగా గాని, ఒక అధ్యాయమును గాని, ఒక శ్లోకమును గాని, శ్లోక అర్థమును గాని, పాదమును గాని చివరికి గీతలో ఒక పదాన్ని గాని భక్తి పూర్వకంగా ఎవరైతే స్మరిస్తారో వారు సుశర్మ లాగా ముక్తికాంత ని వరిస్తారనడంలో సందేహం లేదు. ఆ చరిత్రని ఇక్కడ చెప్పుకుందాం.
సుశర్మ ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ద్విజుడు. కానీ అతను వేదాభ్యాసం చేయకుండా,జపతపాదులైన వైదిక కర్మలని వదిలి, చెడు సావాసాలు పట్టి , క్రూరడుగా ప్రవర్తిస్తూ విషయలాలసుడై తిరుగుతూండేవాడు. వ్యవసాయము, ఆకులు అమ్ముకోవడం ముఖ్య వృత్తులుగా జీవితం సాగిస్తూ మాంసాహారి అయ్యాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది.
ఒకనాడు ఆ సుశర్మ ఒక ఋషి వాటికలో ఆకులు కోస్తూ ఉండగా, ఒక పెద్ద సర్పము అతన్ని కాటువేసింది . వెంటనే అక్కడికక్కడే అతను మరణించాడు. పాప ఫలమైనటువంటి నరక బాధలను అనుభవించి మరు జన్మలో అతడు ఒక వృషభంగా (ఎద్దుగా) జన్మించాడు. ఒక కుంటివాడు దానిని వాహనంగా చేసుకొని చాలా భారమైన పనులు చేయిస్తూ, మోయలేనంత బరువులు మీద వేసి మోయిస్తూ ఉండేవాడు. 10 సంవత్సరాలు ఇలా గడిచిపోయాయి. ఎత్తయిన పర్వత ప్రదేశాలలో ఒకనాడు ప్రయాణం చేస్తూ ఆ వృషభము భారాన్ని భరించలేక కిందపడి మరణించింది.
దైవవశాన కొందరు సాధువులు ఆ మార్గాన వెళ్తూ, అక్కడ చచ్చిపడిఉన్న వృషభాన్ని చూసి జాలిపడి దానికి సభ్యత్తులు కలగాలని తమ తప ఫలాల నుంచి కొంత ధారపోశారు. వారిలో ఒక వేశ్య కూడా ఉంది. నేను చేసిన పుణ్యం ఏమిటా అని ఆలోచించి, ‘ నేను ఏ పుణ్యాన్ని చేశానో దాన్నే ఈ వృషభానికి ధారపోస్తున్నానని‘ పలికి తన పుణ్యం ధార పోషింది . ఆ తరువాత యమదూతలు యముని దగ్గరికి ఆ వృషభాన్ని తీసుకుపోయారు. అప్పడు యముడు ‘వేశ్యధార పోసిన పుణ్యం చేత దీని కర్మ నశించిపోయింది’అని చెప్పాడు. ఆ తర్వాత అది పుణ్యలోక సుఖాలను పొంది పూర్వజన్మ జ్ఞానము కలిగినదిగా , తిరిగి బాహ్మణ కుటుంబమే జన్మించింది.
సుశర్మ పూర్వజన్మ జ్ఞానము వలన క్రిందటి వృషభజన్మలో తన సుకృతమును ధార పోసిన వేశ్యని వెతుక్కుంటూ, ఆమె ఇంటికి వెళ్ళాడు. ‘తల్లి నీ సుకృత దానము చేత నేను కృతకృత్యుడనయ్యాను. నీవు ఇచ్చిన ఈ సుకృతం ఎలాంటిది? అని ప్రశ్నించాడు . అప్పుడామె , ‘అయ్యా! ఇదిగో నా చిలుక . ఈ పంజరంలో చిలుక పలికిన పలుకులు రోజూ వినండం వల్లనే నీకు ధారపోయగలిగిన సుకృతం నాకు ప్రాప్తించింది. నా అంతఃకరణమును పవిత్రము చేసిన ఆ సుకృతమనే నీకు ధారపోశానని’ చెప్పింది.
సుశర్మ అమితమైన ఆశ్చర్యముతో ఆ చిలుకను సమీపించి, ఆ చిలుక పలికే పలుకులు ఎలాంటివని తెలుసుకొనే ప్రయత్నం చేశాడు . అ పూర్వజన్మ శ్మృతి గల ఆ చిలుక ఇలా చెప్పసాగింది.’ పూర్వజన్మలో విద్వాంశుడనైన నేను చాలా అహంభావిగా, మోహితుడునై రాగద్వేషయుక్తుడునై గురువులను దూషిస్తూ తిరుగుతుండేవాడిని. కాలానుసారముగా మృత్యువు కబళించింది. ఆ తర్వాత సద్గురు దూషణము చేయడంవలన నానావిధ నరకయాతనలు అనుభవించి, తిరిగి ఇలా చిలుకనై జన్మించాను. బాల్యంలోనే నా జననీ జనకులు కాల ధర్మాన్ని పొందారు. కాలము గడుస్తూ ఉండగా, ఒకనాటి గ్రీష్మ కాలంలో దాహంతో అలమటిస్తూ మూర్ఛపోయి ఒక చెట్టు మొదట్లో పడిపోయాను.
ఒక ముని నన్ను అనుగ్రహించి తనకు తన ఆశ్రమానికి తీసుకుపోయి, ఒక పంజరంలో ఉంచి ప్రేమతో ఆహారం ఇస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము తన శిష్యులకు శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని ఉపదేశిస్తూ ఉండేవారు. దానిని నేను రోజూ వింటూ క్రమక్రమంగా పఠిస్తూ సమర్ధురాలనయ్యాను. దైవవశాన, ఒక రోజు ఒక దొంగ ఆ ఆశ్రమానికి వచ్చి నన్ను అపహరించి ఈమెకు విక్రయించాడు. అలా భగవద్గీతలోని ప్రథమాధ్యాయం పారాయణ వలన నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది . నిత్యమూ నేను చెప్పే ఆ సలికాలు వినడం వలన ఈ వేశ్య అంతఃకరణము పరిశుద్ధమయ్యింది. ఆమె చేసినటువంటి పుణ్య దానము చేత నీవు పాప విముక్తుడయ్యావు. అని వివరించింది.
అప్పటి నుండీ సుశర్మ శ్రీమద్భగవద్గీత పారాయణముకు క్రమం తప్పక చేశారు. ఈ విధంగా వారు ముగ్గురు కూడా నిరంతర గీతా ప్రథమాధ్యాయ పారాయణ చేత జ్ఞానోదయం కలవారై, ముక్తిని పొందారు. కాబట్టి నిత్యము మనస్ఫూర్తిగా గీతా ప్రథమాధ్యాయాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే పూర్వజన్మ స్మృతి తప్పకుండా కలుగుతుంది అని నారాయణుడు లక్ష్మీదేవికి వివరించారని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశారు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!
#bhagavadgita
Tags: bhagavadgita, bhagawadgeeta, bhagawadgitha, parayana,