కలిపురుషుడు మొదట అడుగు పెట్టిన ప్రదేశాలు ఏవి ?
కలిపురుషుడు మొదట అడుగు పెట్టిన ప్రదేశాలు ఏవి ?
సేకరణ
కలియుగం మొదలవుతూనే కలిపురుషుడు భారతదేశంలోకి ప్రవేశించలేదని మన పూర్వగ్రంథాలు తెలియజేస్తున్నాయి. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన ప్రకారం - అసలు మొదట ఆయన భూమండలం మీద అడుగుపెట్టడానికే భయపడిపోయాడట. భూలోకానికి వెళ్ళి పరిపాలించవలసిందని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించినప్పుడు, హడిలిపోయాడట . అప్పుడా కలిపురుషుడు బ్రహ్మ ఆజ్ఞని పాలించడానికి మొదట ఎక్కడికి వెళ్ళాడో తెలుసా !
"స్వామీ ! అన్ని దేశాల్లోను, ఖండాల్లోను యజ్ఞయాగాదులతో, అఖండ ధర్మాచరణతో నిరతాగ్నిహోత్రంలా వెలిగిపోతున్న భూమికి నేనెలా వెళ్ళేది ? నాకేమో యజ్ఞయాగాలంటే చచ్చేంత భయం. దేవుడి పేరు వింటే గుండెపోటు. శుచి అన్నా శుభ్రత అన్నా అసహ్యం. నియమనిష్ఠలంటే వొళ్ళుమంట. శాస్త్రాల పేరు చెబితే కంపరం. బ్రాహ్మణుల ఉనికే భరించలేను. నా పేరే కలి ( కలహం). ప్రజలు ఐకమత్యంతో ఉంటే నాకు నిద్రపట్టదు. అబద్ధాలకోరులూ, తడిగుడ్డలతో గొంతులు కోసేవాళ్ళు, నరహంతకులు, గురుద్రోహులు, దైవద్రోహులు, పతితస్త్రీలు, జారులూ, చోరులూ, వ్యభిచారులూ, దొంగభక్తులు, బందిపోటు దొంగల్లా ప్రవర్తించే రాజులూ, కనిపించిన ప్రతిదీ అమ్ముకుని బతికేవాళ్ళు, వావివరుసలు లేనివాళ్ళు, నాస్తికులు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు. కొట్టుకుచచ్చే దేశాలు, కూలిపోయిన కుటుంబాలు, పాడుపడ్డ కొంపలు, ఎండిపోయిన బీళ్ళు, వట్టిపోయిన నదులు, రక్తధారలు, మాంసపు ముద్దలు, అనాథలై వలసపోయే ప్రజలు, భోరున ఏడుస్తున్న స్త్రీలు, విధవరాళ్ళు - ఇవీ నా మనస్సుని పరవశింపజేసి మత్తెక్కించే సుందర దృశ్యాలు. అలాంటి నన్నేనా తమరు పరమ పవిత్రమైన భూలోకానికి వెళ్ళమంటున్నది ? ఇది కలా ? నిజమా ? నేను రాజ్యం చెయ్యడానికి అనుకూలమైన పరిస్థితులక్కడ లేవు గద స్వామీ ?" అని అడిగాడు.
బ్రహ్మదేవుడు చిఱునవ్వు నవ్వి "నాయనా ! కలీ ! ఇహ నీ వంతొచ్చింది. కనుక నువ్వక్కడికి వెళ్ళకా తప్పదు. రాజ్యపాలన చెయ్యకా తప్పదు. ప్రస్తుతం నీ ఏల్బడికి తగిన పరిస్థితులక్కడ లేవన్నమాట నిజమే. కానీ అలాంటివి క్రమక్రమంగా ఏర్పడతాయి. వైదిక ధర్మాచరణ గలవారిని, గురుభక్తుల్ని నువ్వేమీ చెయ్యలేవు. కానీ మిహతావారిలోని అధర్మాన్ని ఆసరాగా చేసుకొని వారిని నువ్వు వశం చేసుకోవచ్చు. అలా నీ ధర్మాన్ని భూమండలమంతా వ్యాపింపజేయవచ్చు." అని సముదాయించి ధైర్యం చెప్పి పంపాడు.
"సరే" నని కలిపురుషుడు ఎలాగో మనసు చిక్కబట్టుకొని పీచుపీచుమంటున్న గుండెతో భయం భయంగా భూమండలానికి దిగివచ్చే సమయానికి ప్రపంచాన్ని పాండవుల పౌత్రుడైన పరీక్షిన్ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన మెత్తని మనసు గలవాడని విన్నాడు కలి. "అయితే నన్నేం చెయ్యలే"డనుకొని ధైర్యం తెచ్చుకున్నాడు. ఒకసారి ఆ మహారాజు వస్తున్నదారిలో ఒక శూద్రుడి రూపాన్ని ధరించి ఒక గోమిథునాన్ని (ఒక ఆవు, ఒక ఎద్దు) హింసించడం మొదలుపెట్టాడు. ఎద్దు కాళ్ళు మూడు విఱగ్గొట్టాడు. పరీక్షిన్ మహారాజు అక్కడికొచ్చి చూసేసరికి వీడు ఇంకా వాటిని చావగొడుతూనే ఉన్నాడు.
"ఎవడ్రా నువ్వు దుర్మార్గుడా ? సాక్షాత్తు నా రాజ్యంలోనే గోహింసకి పాల్పడుతున్నావ్ ?" అని గద్దించి అడిగాడు పరీక్షిత్తు.
"నువ్వెవడివోయ్ అడగడానికి ? నీ పని నువ్వు చూసుకో ! ఇది నాయిష్టం. నేను వీటిని కొడతాను, చంపుతాను." అని మొండిగా సమాధానమిచ్చాడు కలి, సరిగ్గా ఇఱవయ్యో శతాబ్దపు మనిషిలా.
ఆ మాటతో పరీక్షిత్తుకు అఱికాలిమంట నెత్తికెక్కింది. ప్రచండ ఆగ్రహోదగ్రుడై వెంటనే రథం నుంచి కిందికి దూకి వాడి జుట్టుపట్టుకున్నాడు. ఇహ చంపడమే తరువాయి. మహాపుణ్యాత్ముడైన పరీక్షిత్తు ముందు తన మాయలు పనిచేయకపోవడం గమనించి వాడు భయకంపితుడయ్యాడు. తప్పించుకోవడానికి సాధ్యం కాక ఆ మహారాజు సామాన్యుడు కాడని తెలుసుకొని దీనంగా ఆయన కాళ్ళు పట్టుకొని శరణువేడాడు.
"మహారాజా ! నేను కలిపురుషుణ్ణి. ఈ గోమిథునం భూదేవి మఱియు ధర్మదేవుడు. భూలోకంలో నా ధర్మాన్ని ప్రవర్తింపజేయమని సాక్షాత్తు పితామహు డాదేశించిన ప్రకారమే నేను చేస్తున్నాను. నన్ను దయదల్చి వదిలిపెట్టండి మహాప్రభో !" అని ఆక్రోశించాడు.
"అలా అయితే నేనూ, నా వంశస్థులూ పరిపాలిస్తున్నంతకాలం నువ్వీ భూమండలం మీద కనిపించడానికే వీల్లేదు" అన్నాడు పరీక్షిత్తు.
"మఱి పితామహులాజ్ఞ ఎలా ఉల్లంఘించేది మహారాజా ?" అని నసిగాడు కలి.
"అయితే నువ్వు అప్పటిదాకా పశ్చిమభూములకి పారిపో !" అని సెలవిచ్చాడు పరీక్షిత్తు. ఆనక బంగారం ధరించిన ప్రభావముతో ఆయన కలి బారిన పడ్డారనేది వేరే కథ .
వాడు "బతుకుజీవుడా ! "అనుకుంటూ భరతఖండం నుంచి పశ్చిమానికి పారిపోయాడు. వాడికి నేరుగా భరతఖండాన్ని వశం చేసుకోవడం కుదఱలేదు కనుక అట్నుంచి నఱుక్కురావడం మేలని భావించాడు. ఆ ప్రకారమే పశ్చిమద్వీపాల నుంచి, పశ్చిమదేశాల నుంచి తన జైత్రయాత్ర ప్రారంభించాడు. ఆ పశ్చిమదేశాల్లో ఈజిప్టు, ఇస్రాయేల్, యూరోపు, అరేబియా, ఇంగ్లండు ఉన్నాయి - ఇప్పటిదాకా గడిచిన చరిత్ర ప్రకారం చూస్తే !
అటువంటి వారు చూపిన దారిలో నడుస్తూ , వారి సంస్కృతిని మనం అనుసరించడం మన ఖర్మ కాకపొతే మరేమిటీ !! ఇప్పుడు నిజంగా మనం అనుకోవాల్సి పరిస్థితి, ఇది కలికాలం అని .