లక్ష్మణుడు అవతార పరిసమాప్తి చేయడానికి కారణం
రామాయణంలో లక్ష్మణుడు అవతార పరిసమాప్తి చేయడానికి కారణం దూర్వాస మునీంద్రుడా ?
- లక్ష్మి రమణ
లక్ష్మణుడు రాముని ఆరోప్రాణం. శ్రీరామ చంద్రుడు లక్ష్మణస్వామి యుద్ధం చేస్తూ మూర్ఛపోయిన సందర్భంలో “ లక్ష్మణా ! సీత స్థానాన్నయినా భర్తీ చేయవచ్చునేమో ! కానీ నీవంటి సోదరుడు ఎక్కడ లభిస్తాడయ్యా ? నీవు లేకపోతె నేను కూడా ప్రాణత్యాగం చేస్తా” నంటారు . అంతటి అనుబంధం రామ లక్ష్మణులది . శ్రీరామ చంద్రుని అవతార పరిసమాప్తి సమయంలో స్వయంగా ధర్మదేవతయిన యమధర్మరాజు వచ్చి , స్వామీ సమయం ఆసన్నమయింది. ఇక మీరు వైకుంఠానికి దయచేయవలసింది అని గుర్తు చేస్తారు. ఆ సమయమే లక్ష్మణ స్వామి వారి అవతార పరిసమాప్తికి కూడా కారణమయ్యింది .
ఒకనాడు శ్రీ రాముడు బ్రాహ్మణుడి వేషంలో తనని కలవడానికి వచ్చిన యమధర్మరాజు తో ఆంతరంగికంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో ఎవరిని లోపలికి రానివ్వద్దని ఆదేశించి లక్ష్మణున్ని ద్వారం వద్ద కాపలాగా ఉండమని ఆదేశించారు . లక్ష్మణుడు శ్రీరామచంద్రుని ఆజ్ఞాబద్దుడు. రామ చంద్రుని మాట ఆయనకి శిరోధార్యం .
లక్ష్మణుడు ఆ బాధ్యతని నెరవేరుస్తున్న సమయంలో దుర్వాస మహాముని శ్రీరాముని దర్శనార్థం వచ్చారు. ఆయన ముక్కోపి. వద్దని అంటే మహర్షి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అది తనకే కాకుండా , రామరాజ్యానికే చేటు తీసుకొనిరావొచ్చు. అలాగని ఆయన్ని లోపలికి పంపిస్తే, అన్నగారి ఆజ్ఞని ధిక్కరించినట్టు అవుతుంది. కేవలం అది మాత్రమే కాదు, రాజాజ్ఞ కూడా ! ఆ విధంగా తర్జన భర్జన తర్వాత రాజ్య శ్రేయస్సుని ఆలోచించి, దుర్వాసుని రాకను తెలియజేయడానికి శ్రీరాముని మందిరంలోకి ప్రవేశిస్తారు లక్ష్మణస్వామి.
యమధర్మరాజుకిచ్చిన మాట ప్రకారం వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వచ్చిన వారెవరైనా సరే, వారిని రాములవారు శిక్షించాలి. అందుచేత ఇప్పుడు రాములవారికి లక్ష్మణున్ని శిక్షించాల్సిన పరిస్థితి వచ్చింది . తనకి ప్రాణాధికుడైన లక్ష్మణుణ్ణి, అతని ధర్మసంకటాన్ని అర్థం చేసుకున్నప్పటికీ ధర్మాన్ని పాటించడానికి మాత్రమే కట్టుబడిన రామచంద్రమహాప్రభువుకి ఏంచేయాలో తోచలేదు . అప్పుడు ఆయన గురువైన వశిష్ఠ మహర్షి ఆ ధర్మ సంకేతాన్ని తీర్చి కర్తవ్యబోధ చేస్తారు .
ఆయన సలహా ప్రకారం లక్ష్మణుడు సరయు నదిలో ప్రాణత్యాగం చేసి, అవతార పరిసమాప్తి చేస్తారు. శ్రీరామ చంద్రుడు అవతారాన్ని చాలించి మహావిష్ణువుగా వైకుంఠాన్ని చేరేటప్పటికి ఆయన సేవకి సిద్ధమైన మహా ఆదిశేషుడు ఆ విధంగా సిద్ధంగా వుంటారన్నమాట. నిజానికి అలా జరగడానికి రామాయణంలో దూర్వాస మహాముని కారణమయ్యారు . అదీ కథ . శుభం .