రాముడికి భార్యావియోగం కారణం?
రాముడు రాక్షసంహారం కోసం జన్మించినా , ఆయన అంతటి భార్యా వియోగాన్ని అనుభవించడానికి కారణం ఏమిటి ?
- లక్ష్మీరమణ
యోగ వాసిష్ఠం లో రాముడికి కలిగిన సందేహాలకు వసిష్ఠ మహర్షి చేసే తత్వబోధ ఉంటుంది. అందులో విష్ణుమూర్తి మానవుడిగా ఎలా అవతరించారు ? మోయలేని భార్యా వియోగం ఎలా కలిగింది, అందుకు కారణమైన 4 శాపాల వివరణ వున్నాయి. అయితే, వాటిల్లో 3 శాపాలు భార్యా వియోగానికి కారణమైనవి. వాటిని గురించి తెలుసుకుంటే, ఆ నీలమేఘశ్యాముని కరుణాద్ర హృదయం యెంత విశాలమో అర్థమవుతుంది .
1. దేవదానవ సంగ్రామం హోరాహోరీగా జరుగుతోంది. ఆ యుద్ధంలో విష్ణుమూర్తి దేవతల పక్షాన పోరాడుతూ, రాక్షసులను తరుముతున్నారు . ఆ అసురులు భృగు మహర్షి భార్యని శరణువేడారు. ఆమె వారిని తన ఇంట్లో దాచి ఉంచింది . శ్రీహరి ఇంట్లోకి పోవడానికి వీల్లేదని అడ్డగించింది. రాక్షసులంతా ఒకేచోట దొరికారు, ఇప్పుడు వీరిని వదిలేస్తే లోకాలకు చాల ఉపద్రవం తెస్తారు. లోకాలన్నిటికీ ముప్పు కలిగించేకంటే, ఋషిపత్నిని అడ్డుతొలగించి , ఆ పాప ఫలాన్ని అనుభవించడం న్యాయం అనుకున్నారు శ్రీమహావిష్ణువు . అంతే , భృగుపతిని సంహరించి, అదే ఉదుటన ఆ రాక్షసులందరినీ మత్తు పెట్టాడు . భృగు మహర్షికి కోపం ఎక్కువ . తన పత్నిని మట్టుపెట్టాడన్న క్షణిక కోపాన్ని జయించలేక , దుఃఖంతో ఒళ్ళు తెలియక "శ్రీహరి! నీకు కూడా నాలాగే భార్యా వియోగం కలుగుగాక!" అని శపించాడు. ఇదీ మొదటి శాపం .
2. ఆ తర్వాత బృంద అనే గోలోక కన్య శ్రీహరి పొందు కావాలని వరం కోరింది. భర్త కావాలని కోరలేదు, అది విని రాధాదేవి ఆగ్రహించింది. రాక్షసకన్యవి కమ్మని శపించింది. ఆ జన్మలో కూడా ఆమె పేరు బృంద నే . ఆమె జాలంధురుడు అనే రాక్షసుడికి ఇల్లాలయ్యింది . మహాపతివ్రతగా ఉండేది. జాలంధురుడు మహా దుర్మార్గుడై లోకాలను పీడిస్తూ ఉండేవాడు. కానీ బృందయొక్క పాతివ్రత్య మహిమ వాడికి చావు లేకుండా చేసింది . వాడి పీడని లోకానికి వదిలించాలంటే, ముందు బృంద పాతివ్రత్యాన్ని భంగం చేయాల్సిన అవసరం రక్షకుడైన శ్రీహరికి కలిగింది .
పూర్వ జన్మలో ధర్మభంగకరంగా ఆమె శ్రీహరి పొందు కోరింది కనుక, ఆమె కోరిక తీర్చేందుకు ఇప్పుడు జాలంధరుడి రూపం ధరించి బృందాదేవిని మోహింపచేసాడు శ్రీహరి . ఆమె పాతివ్రత్య భంగం జరగగానే జాలంధురుడు యుద్ధంలో మరణించాడు. అప్పుడు విష్ణుమూర్తి చేసిన మోసాన్ని గ్రహించిన బృందాదేవి దుఃఖావేశానికి లోనయ్యింది . అది తాను పూర్వజన్మలో చేసిన పొరపాటని గుర్తించలేకపోయింది . తప్పంతా శ్రీహరిదే అని భావించి, "నాకు భర్త్రువియోగం కలిగినట్లే, నీకూ భార్యావియోగం కలుగుగాక!" అని శపించింది. ఇదీ రెండవ శాపం .
3. పూర్వం పయోష్ణీ నదీ తీరాన దేవదత్తుడు అనే గృహస్తు నరసింహోపాసన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తపస్సుకి సంతోషించి నృసింహ స్వామి మంచి ఆర్భాటంగా సాక్షాత్కరించాడు. సామాన్యంగా దేవతల సాక్షాత్కారాలు ఎవరు తపస్సు చేసారో వారికి మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ నృసింహ సాక్షాత్కారం దేవదత్తుడి భార్యకి కూడా కనిపించింది. అసలే సింహ స్వరూపుడేమొ , మహా అట్టహాసంగా దర్శనమిచ్చేసరికి ఆ సున్నిత మనస్కురాలు తట్టుకోలేకపోయింది . స్వామి భయంకర ఆకారాన్ని చూసి గుండె ఆగి మరణించింది. దేవదత్తుడు నృసింహ సాక్షాత్కార మహానందంలో మునిగి, కొంతసేపటికి ఇహలోకంలో వచ్చాడు. వస్తూనే ఈ సాక్షాత్కారం వల్ల తన భార్య మరణించింది అని గ్రహించి దుఃఖావేశంలో పడిపోయి, వివేకం కోల్పోయాడు . "విష్ణుదేవా! నీకు కూడా నాకుమల్లే భార్యావియోగం సంభవించుగాక!" అని శపించాడు. ఇది మూడవ శాపం .
ఈ 3 శాపాలు శ్రీ మహావిష్ణువికి భార్యావియోగాన్ని కలిగించేవి. ఈ ముగ్గురి మీదా ప్రేమవల్ల, వారి శాపాలని మన్నించాడే తప్ప తిరిగి ప్రతిశాపమియ్యలేదు . వారి కోసం మానవుడై జన్మించి 3 సార్లు భార్యావియోగాన్ని అనుభవించాడు.
రావణుడు సీతాపహరణం చేసినప్పుడు ఒకసారి భార్యావియోగం . తర్వాత లోకుల అపవాదు వల్ల సీత గర్భవతిగా ఉండగా రెండోసారి భార్యని కానలకు పంపి స్వయంగా ఆమెకి దూరమయ్యారు . మళ్ళీ లవకుశుల జననానంతరం అశ్వమేధ యజ్ఞ సందర్భంలో కలిసాక, ఈసారి సీతాదేవి భూప్రవేశం చేయడంతో శ్రీరాముడికి మూడోసారి భార్యావియోగం. ఇలా తన భక్తులు ఇచ్చిన 3 శాపాలు చెల్లించాడు మహానుభావుడైన శ్రీహరి .