సీత కోణమునుంచి సీతారాముల కధ.
"సీతాయన్" సీత కోణమునుంచి సీతారాముల కధ.
-సేకరణ
రామాయణము జాతిజీవనములో ఓకభాగముగా మారిపొయింది.వాల్మీకి రామాయాణాన్ని మొదటగా సృజించితే తదనంతరము అనేక వందలమంది అనేక వందల భాషలలో వారి వారి ఆచారములు,స్థానిక సాంప్రదాయాలు కూడా ప్రక్షేపించి రామాయణాన్ని ఎందరో కవులు రాశారు . ఇందుకు కారణము రాముడు తమవాడు,తాము రామునివారము అన్నభావన. ఇలా "సీతయాన్" అన్నగ్రంధములొని కొన్ని విషయాలు మీకు పరిచయము చేస్తాను.
ఇది బీహార్,నేపాలు ప్రాంతాల్లో వాడుకలో వున్న గ్రంధము. మీరు పేరు బట్టే గ్రహించి వుంటారు ఇది సీతకొణము నుంచి రాసిన గ్రంధము.ఈ గ్రంధములో సీతకే ప్రాధాన్యము. నేపాల్ వారు సీతమ్మ తమ ఆడపడుచేనని విశ్వశిస్తారు . ఈ కధ రాముని జననం తో ప్రారంభం కాదు . రావణగాధతో ప్రారంభము అవుతుంది.
ఇతరరాజ్యలలొని అరణ్యాల నుంచి తన రాజ్యములొని అరణ్యాలలో తపస్సు చేసుకుంటున్న ఋషులపై రావణుడు పన్ను విధిస్తాడు. ఈ ఈ పన్నుని వసూలు చేయడానికి , పన్ను వసూలుదార్లు ఋషులవద్దకు పొయినప్పుడు వారు కోపించి "సుంకముగా చెల్లించటానికి మా వద్ద ఏమున్నది? శుష్కించిన మా శరీరాలలో మాంసం కూడాలేదు. ఈ రక్తం తప్ప" అని తమ శరీరాలనుండి తీసిన రుధిరాన్ని ఒక ఘటములో నింపి వాసెనకట్టి వారికి ఇచ్చి ఈ ఘటములొని శోణితాన్ని రావణుడు దర్శించగానే, ఆతనికి, ఆతని పాలితమయిన లంకకు వినాశము ప్రారంభము అవుతుందని శపిస్తారు.
అధికారులు ఈ ఘటము తీసుకుని రావణుని సంక్షములో వుంచి వృత్తాంతము మొత్తము వివరముగా తెలుపుతారు. ఇది విన్న రావణుడు భయ,సందిగ్దావస్తలకు లోనయి మంత్రిపురోహితులను సంప్రదిస్తాడు. వారు ఆభాండాన్ని భూస్థాపితం చేయమని సలహ ఇస్తారు. అయితే దీనిని ఎక్కడ నిక్షిప్తము చేయాలన్న ప్రశ్న ఉదయించగా, పూర్వము శంకరుని కొలువులో జనకునివలన తను అవమానితుడు అయ్యాడు, కనుక ఆ పగ తీర్చుకొవాలని జనకుని రాజ్యములొని పుణ్యకారణ్యములో ఆఘటాన్ని భూస్థాపితం చేయాలని నిర్ణయించుకొని ఆవిధముగా జరుపుతాడు. కానీ ఈ శొణిత ప్రభావము వల్లకాని, కాలప్రభావము వల్లకాని పుష్కరకాలము జనకుని రాజ్యము మొత్తము అనావృష్టి పీడితమయి దుర్భిక్షముతో అల్లాడిపొయి జనకుని శరణువేడగా జనకుడు మంత్రిపురొహితాదుల సలహాతో యఙ్ఞం చేస్తాడు.యఙ్ఞానంతరం యాగకర్త భూమిని దున్నాలి.అందుకై పుణ్యకారణ్యములొని స్థలము నిర్దేశించబడుతుంది.
జనకుడు బంగారు నాగలితో భూమిని దున్నుతుంటే రాక్షసులు భూస్థాపితము చేసిన రక్తభాండము ఆనాగేటి చాలుకు తగిలి అది విచ్ఛన్నమయిపొగా, ఆ భాండమునుంచి అష్టదళ మధ్యంలో రత్నఖచిత సింహాసనరూఢయై, సర్వదేవతాపరివృతమయి, దిగ్గజాలు రత్నఘటాలతో అమృతజలాలు అభిషేకిస్తుండగా, అణిమాది అష్టయిశ్వర్యసిద్ధులతో, కామధేనువు, జయాద్యప్సరసలు కొలువగా సూర్యచంద్రులు మణిదీపాలై ప్రాకాశిస్తుంటే, తుంబుర, నారదులు కీర్తీగానం చేస్తుండగా, పద్మాసనాసీనయై, కల్పతరుమూలంలొ, భృగ్వాదీఋషులు కొలవగా చతుర్బాహువులతో, వీరలక్ష్మీదేవి ఆవిర్భవించినది. వెంటనే కుంభవృష్టిగా వర్షం మొదలయింది.
ఋషులంతా ఆదేవిని స్తొత్రము చేయగా జనకుడు భక్తీపారవశ్యముతో అమెను స్తుతిస్తాడు. వీరలక్ష్మీదేవి ప్రసన్నయై వరము కొరుకొమనగా అతడు తల్లీ! నీవు పసిపాపవై నా ఒడిలో లాలింపబడాలని కొరగా అమే వల్లెయని పసిపాపయై రొదిస్తుంటే జనకుడు అక్కునచేర్చుకుని తన రాణి సునందకు అప్పగిస్తాడు. అమే సీత.
ఇదే గ్రంధములో సీత అశోకవనములో వున్నప్పుడు ఒకానోక సంధర్భములో ఇలా పలుకుతుంది" ఓరీ నేను ఏవరనుకుంటున్నావు మహాశక్తిని, దుర్బలనారియనినుకోకు. భైరవి రూపధారిణినై నీపై విరుచకపడి దంతాలతో నీ దశముఖాలని, చీల్చి చెండాడుతాను. చండికనై నీ రక్తంతో దాహం తీర్చుకుంటాను.కనుక ప్రళయకాల రూపిణి అయిన ఈ సీతనుండి భయపడి దూరంగాపో. నేను అగ్ని గర్భను నన్నంటిన వారు అగ్ని జ్వాలలోభస్మమయి పొతారు” అని వీర గర్జన చేస్తుంది.
వీలైనవారు తప్పక ఈ గ్రంధాన్ని చదవండి . రామాయణాన్ని మరో కోణాన్నుండీ చూసే అవకాశం, ఆద్యంతం అద్భుతమైన సన్నివేశ పటుత్వంతో కనులముందు సీతమ్మ సమగ్ర స్వరూపానికి రూపుకడుతుంది . స్త్రీ శక్తిని ఆవిష్కరిస్తుంది .