రామాయణంలోని మరో మంథర !
రామాయణంలోని మరో మంథర !
-లక్ష్మీ రమణ
ఒకవేళ సూర్పణఖ ముక్కుచెవులు ల్కక్ష్మణుడు తెగకోసి ఉండకపోతే, రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోయేవాడే కాదు . అసలు రామాయాణమే జరిగి ఉండేది కాదేమో! సూర్పణఖ కోపానికి కారణం ఆమె భర్తయిన విద్యుత్జిహ్వుని మరణమేనా ? లేక మరేదైనా కారణమా ? అందరూ అనుకుంటున్నట్టు , రామాయణంలో చూపించినట్టు రాముని సమ్మోహన రూపం ఆమెని ఆకర్షించిందా ? అంటే, అందుకు మరో వింతైన కథనం సమాధానంగా లభిస్తోంది. ఆ కథనం ప్రకారం, అసలు రామాయణానికి మూలబీజం, సీతమ్మ అవతారానికి కారణం ఈ సూర్పణఖ అనేది తెలుస్తోంది. అదేంటో చూద్దాం పదండి .
వ్యక్తులు వారి కర్మలు , ఇంకా పూర్వజన్మ సంచితమైన శాపాల ప్రభావం అధికంగా ఉంటుంది. దానిని వారు మరో జన్మ ఎత్తయినా సరే అనుభవించాల్సిందే ! కర్మ అనేది అంత బలమైనది. సూర్పణఖ రావణుడి చెల్లెలుగా జన్మ పొందే ముందరే ఆమె ఒక శాపానికి గురయ్యింది. నిజానికి ఆమె ఒక గాంధర్వ కాంత. అవతారాన్ని దాల్చి భూమిపైకి వస్తేనే, తన సమ్మోహన రూపంతో అతివల మనసులని ఆకర్షించే మాధవుడు ,క్షీర సాగరంలో , శేషతల్పంపైన పవళించి, అర్థనీలిమిత నేత్రాలతో ఉంటె, ఆ అందం వర్ణించడం, ఆ మాయని తట్టుకోవడం అంత సులువైన విషయం కాదుకదా !
ఆ గాంధర్వ కాంత కూడా ఆ లీలామానుషుని రూపాన్ని చూడాలని తహతహలాడింది . ఆయన క్రీగంటి చూపు తన మేనిపై వర్షిస్తే చాలనుకుంది . కానీ ఆదిశేషుడు ఆమె ప్రయత్నాన్ని పసిగట్టి , మాధవునికి తన పడగలతో గొడుగు పట్టి, ఆయనని చూడాలని ప్రయత్నిస్తున్న ఆ గంధర్వకాంతకి ఆయన కనిపించకుండా చేశాడు. దాంతో, ఆమె ఆదిశేషుని చెవులూ , ముక్కు గిల్లేసింది . లక్ష్మీ దేవి కూడా తన భర్తని ఆమె అలా మోహావేశంతో చూడాలనుకోవడంతో కోపగించింది . పైగా తన బిడ్డ వంటి ఆదిశేషుణ్ణి రక్కేయడంతో ఆగ్రహించింది . ‘ రాక్షస వనితవై జన్మించి, హరిని ఆశించి, నీముక్కూ చెవులూ కోయించుకుంటావని’ శపించింది. ఆ గంధర్వకాంత కూడా, హరి నాకే సొంతం అనుకున్నందుకు, భగవంతుని దర్శనం లేకుండా చేసినందుకు , నువ్వు ఆయనకీ దూరమై అలమటిస్తావని ప్రతిశాపం ఇచ్చింది .
ఆ విధంగా శాప ప్రతిశాపాలిచ్చుకున్న వారిద్దరే, రామావతారంలో ఎదురుపడ్డారు . సీతమ్మగా లక్ష్మీ దేవి రామునికి దూరమై రావణుని చెరలో మ్రగ్గినది . సూర్పనఖ గా మారిన ఆ గాంధర్వ కాంత , రాముని ఆశించి ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుని చేత ముక్కు చెవులూ కోయించుకుని, రామ రావణ యుద్ధానికి నాంది పలికింది .
ఇకవేళ ఇదంతా జరగక పోయి ఉంటె, రామ రావణ యుద్హం , రమ్యమైన రామాయణ కావ్యం మనకి దక్కేవి కావేమో. మళ్ళీ ఇది వాల్మీకమా కాదా ? అనే సందేహం ఒకటి . జనాలు ఎలా పిలిస్తే అలా పలికిన వాడు భగవంతుడు . ఇది వాల్మీకం కాకపోయినా, అయినాకూడా , జనాల నోటిలో నానుతున్న కథ . అని మాత్రం చెప్పుకోవచ్చు . మహిళా మణుల హృదయాలకి అంతరంగాలకీ అడ్డం పట్టేలా ఉన్న ఈ కథనుండీ మనం ఈర్ష్యా అసూయలు తగ్గించుకోవాలని పాఠం నేర్చుకుంటే బాగుంటుంది కదూ !