సూర్పణఖ అన్నని ఉసిగొల్పిన కారణం ఇదా !
సూర్పణఖ అన్నని రామునిమీదికి ఉసిగొల్పిన కారణం ఇదా !
-లక్ష్మీ రమణ
రావణుడి చెల్లెలు సూర్పణఖ. ఆమె భర్త విద్యుత్ జిహ్వ అనే రాక్షసుడు . కాలకేయులకి ఆయన సోదరుడు . రావణునితో కలిసి అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు . లంక కోసం రావణ పక్షాన నిలిచి పోరాడాడు . సూర్పణఖ , విద్యుత్ జిహ్వ దంపతులకి శంభుకుమార అనే కొడుకు కూడా ఉన్నాడు . వారిద్దరిదీ అన్యోన్య దాపత్యం . చక్కని ప్రేమ పెనవేసుకున్న జంట . అటువంటి సూర్ఫణఖ రామలక్ష్మణుల మీద మనసెలా పారేసుకుంది ? ముక్కుచెవులు ఎలా కోయించుకుంది ?
ఒకసారి రావణుడు , విద్యుత్ జిహ్వ దేవలోకంపైన దండెత్తాడు . దేవరాజైన ఇంద్రుణ్ణి ఓడించి , వెనుతిరిగి లంకాపట్టణానికి వస్తున్నాడు . అప్పుడు విద్యుత్ జిహ్వ సోదరులైన కాలకేయులు రావణాసురుణ్ణి అడ్డగించారు . వారిని ఎదుర్కొంటూ ఉన్న సమయంలోనే , తన సోదరులకు అండగా నిలబడబోయిన విద్యుత్ జిహ్వని కూడా సంహరిస్తాడు రావణుడు . అలా తన సొంత చెల్లెలి భర్తను చంపేస్తాడు.
కన్నీరు మున్నీరవుతున్న చెల్లెలికి , దానికి ప్రతిగా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడిన వ్యక్తి ,అతనికిచ్చి రెండవ వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు . మరో వ్యక్తినైతే తన చెల్లెలికోసం తీసుకురాగలడు కానీ , ఆమె తన భర్తమీద పెంచుకున్న మమకారాన్ని , అనురాగాన్ని, అతని తలా తీసేసినంత తేలికగా తుంచలేడుకదా !
తన భర్తను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని సూర్పణఖ నిర్ణయించుకుంది . ఒక పధకం రచించింది. రావణుడిని చంపగాలవాడు కేవలం శ్రీ రాముడు మాత్రమే అని గ్రహించింది. రాముడితో వైరం కలగాలని తనకు కోపం తెప్పించేలా ప్రయత్నించింది. రాముడు ఏకపత్నీవ్రతుడు అని తెలిసే, తనని పెళ్ళి చేసుకోమని విసిగించింది. అందుకు రాముడు ఏమి చేయకపోయినా, లక్ష్మణునికి ఆగ్రహం వచ్చి ముక్కూ చెవులూ కోసాడు. వెంటనే రావణుని దగ్గరకు వెళ్ళి లక్ష్మణుడు చేసిన పని చెప్పింది.
దాంతోపాటే , అన్నగారి బలహీనతని రెచ్చగొడుతూ , సీతమ్మ అందచందాలనీ వివరించింది . సీత వంటి అందగత్తె నీ లాంటి వాడికి రాణిగా ఉంటే బాగుంటుంది అని లేనిపోని ఆశలు కల్పించింది . దాంతో రెచ్చిపోయి , సీతమ్మను అపహరించి తెచ్చి రాముడితో వైరం పెట్టుకుని రావణుడు మరణిస్తాడని ఆమె పథకం రచించింది . చివరికి ఆమే అనుకున్నట్టే ఉచ్చులో పడ్డ రావణుడు, రాముని చేతిలో మరణించిన విషయం తెలిసిందే కదా !
గమనిక :అశోకవనంలో సీతకి రాములవారి మాయా బొమ్మని చూపించి , రాముడు మరణించాడని చెప్పిన విద్యుత్ జిహ్వ ఇతను కాదని మనవి .
https://www.hindu-blog.com/2013/09/story-of-vidyujjihva-husband-of.html