వెల్లాయి (దేవదాసి ) ఏంచేసిందో తెలుసా !!

పెరుమాళ్ళుని రక్షించుకొనేందుకు వెల్లాయి (దేవదాసి ) ఏంచేసిందో తెలుసా !!
లక్ష్మీ రమణ
పెరుమాళ్ళుని విగ్రహంగా భావించి ఉంటె, గోదాదేవి వివాహమే చేసుకునేదికాదు. అక్కడ ఉన్నది రాయిమాత్రమే అనుకుని ఉంటె, శ్రీరంగంలో రంగనాథుని రూపం మనకి దక్కేదే కాదు. ఆ క్షేత్రం నిజంగా విష్ణుభక్తులకి అపర వైకుంఠమె. రంగనాధుడు అంటే, అచ్చంగా దిగివచ్చిన స్వయానా విష్ణువే ! ఆ స్వామి విగ్రహంలోనూ ఆ సజీవ స్వరూపం కనులకి కడుతుంది. చూసే కన్నులకి మనసుండాలేగానీ , ఆ విగ్రహంలో శ్రీరంగనాధుడే ఉంటాడు. కానీ ముష్కరుల కంటికి ఆయన విగ్రహం, అందులోని బంగారం, ఆ బంగారానికి విలువా కనిపించాయి . అప్పుడు జరిగిందా అద్భుతం !
శ్రీరంగం మీద మహమ్మదీయులు దండయాత్ర చేసినపుడు, పిళ్లై లోకాచార్యులు అక్కడ నుండి రంగనాథ స్వామిని తరలించి తీసుకు వచ్చి తిరుపతిలో భద్రపరిచారు. అలా ఆయన తన రంగనాథుణ్ణి తప్పించడానికి సహాయం చేసింది ఒక దేవదాసి. ఆమెది సాయంకాదు , త్యాగం. ఇది నిజంగా ఒక గొప్ప కథ . భారతీయుల విశ్వాసాల్ని వారు యెంత బలంగా కాపాడుకుంటారో తెలియజేసే సంఘటన .
వెల్లాయి - అందములోనూ, నాట్య, గానాలలోనూ, వాక్చతురతలోనూ ఆమెకు సాటి లేరు. లేలేత వయసు ప్రాయములోనే ఆమె శ్రీరంగని సేవకు అంకితం అయింది. ఆమె ఎంతటివారినైనా తన చతురతతో ఇట్టే మెప్పించేది. ఆమె పాండిత్యము కూడా తక్కువది కాదు . శ్రీరంగని కరుణాప్రసాదముతో ఆమెకి ఆ ప్రజ్ఞ సాధ్యం అయ్యింది .
అవి శ్రీరంగం మీద అల్లా ఉద్దీన్ ఖిల్జీ సైనికులు ఆతని సైన్యాధిపతులు దాడులు జరిపి పదివేలమంది బ్రాహ్మణులను ఊచకోత కోసిన సమయం. ఆలయం మీద దాడి జరిపినపుడు ప్రతిఘటించిన మరో 12,000 మంది ప్రజలు కూడా ఆ ముష్కరుల ఊచకోతకు బలై పోయారు . ఆలయములోని విలువైన నగలు, సంపద అంతా వారు దోచుకున్నారు . అక్కడ ఉన్న విగ్రహాలు పూర్తిగా బంగారంతో తయారయ్యాయి అనే సమాచారం ఉంది వారికి . వాటినీ డిల్లీకి తీసుకుని పోవాలని వారు గుడి అంతా వెదికారు. కానీ వారికి ఆ విగ్రహాలు దొరకలేదు .
వాటిని పిళ్లై లోకాచార్యులు రాత్రికి రాత్రే ఆ విగ్రహాలను తీసుకుని మారు వేషాలలో మధురకు పారి పోయారు. అలా వారు పారిపోవడానికి పథకం ప్రకారం సాయం చేసింది వెల్లాయి.
శ్రీరంగం ఆలయం మీద దండయాత్రకి సైనికులు ప్రయత్నం చేస్తుండగా, ఆలయం బయట ఆ ఆలయములో నాట్యం చేసే దేవదాసి వెల్లాయి తన వాద్య, గాత్ర పండితుల సహాకారముతో ఓ శృంగార నాట్య ప్రదర్శన చాతుర్యంగా ఏర్పాటు చేసింది. సైన్యాధిపతి తోపాటుగా అనేక మంది సైనికులు ఆమె శృంగార నాట్యం, అందం చూసి విచలితులయ్యారు. ఆ నాట్యం సమ్మోహనంగా అలా గంటలకొద్దీ సాగింది .ఈ సమయములోనే పిళ్లై లోకాచార్యులు సైనికుల కనుగప్పి ఆ విగ్రహాలను తీసుకుని మారువేషములో మధురకు పారిపోయారు.
వెల్లాయి అందం హొయలు చూసి విచలితుడై, ఆమె వెంటబడిన సైన్యాధిపతిని అటు ఇటు అంటూ తూర్పు గోపురం ప్రాంతానికి తీసుకుని పోయింది .అక్కడ తన చతురతో విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను రమ్మంటూ, తూర్పు గోపురం పైకి ఎక్కించింది . అక్కడ నుండి అతన్ని తోసి వేసింది. ఆ తర్వాత తాను ముష్కరుల చేతిలో బందీ అవడం, అనవసరమైన బాధల్ని కొనితెచ్చుకోవడం అనేది ఆమెకి స్పష్టంగా తెలుసు. అది ఇష్టం లేక ఆ గోపురం మీద నుండి రంగనాథుని తలుస్తూ దూకి చనిపోయింది .
ఆ తర్వాత మధుర సుల్తానులని ఓడించి విజయనగర పాలకుడైన కుమార కంపరాయలు ఆలయాన్ని వేదాంత దేశికుల వారి సాయముతో పునరుద్ధరింపజేసి ఆలయములో యథావిధిగా పూజావిధుల ఏర్పాటు చేశారు. దీనికి అంతటికీ వెనుక ఉండి నడిపించినది విద్యారణ్యులు మరియు విజయనగర సైన్యాధిపతిగా ఉన్న అభినవ ద్రోణాచార్య బిరుదాంకితుడు అయిన గోపనాచార్యులు .
నాడు స్వామి వారి విగ్రహాలను సంరక్షించేందులకు తన ప్రాణాలకు సైతం వెరువక త్యాగం చేసిన దేవదాసి వెల్లాయి స్మృత్యర్థం ఆ తూర్పు గోపురాన్ని పునరుద్ధరించి కంపరాయలు ఆమె పేరుతో వెల్లాయి గోపురం అని పేరు పెట్టించారు. అందుకే ఆమె స్మృత్యర్థం ఇప్పటికీ ఆ గోపురానికి సున్నం వేసి వెల్లాయి గోపురంగా పిలుస్తారు.
ఈ గాథలన్నీ కంపరాయలు ధర్మపత్ని గంగాదేవి తన మధురా విజయం లో వివరించారు . కంపన్న వీరత్వాన్ని అందులో వ్రాశారు. దురదృష్టవశాత్తూ కంపన్న చిన్నతనములోనే అనారోగ్యంతో మరణించారు. అతనే ఆరోగ్యముతో ఉండిఉంటే, దక్షిణాపథమంతా కూడా ఒక్క తాటి మీదకు తేగల వీర విక్రమసముపార్జితుడు కుమార కంపరాయలు.