స్వామి వివేకానందకి అతీతమైన శక్తులు ఉన్నాయా ?
స్వామి వివేకానందకి అతీతమైన శక్తులు ఉన్నాయా ?ఆయన అద్వైతస్థితిని నిరూపించిన సంఘటన .
సేకరణ
స్వామి వివేకానందుని పుట్టినరోజు జనవరి 12. దీనినే ప్రస్తుతం మనం జాతీయ యువజనదినోత్సవంగా జరుపుకుంటున్నాం . వివేకానందులవారు సత్యాన్వేషకులుగా రామకృష్ణులవారిని కలుసుకున్నారు . ఆ తర్వాత ఆయన ఎన్నో స్ఫూర్తిదాయకమైన, భారతీయ ఔన్నత్యాన్ని చాటిచెప్పే ప్రసంగాలు చేశారు . కానీ అయన నిజంగానే ఆధ్యాత్మిక, అద్వైత స్థితిని పొందగలిగారా ? అటువంటి దృష్టాంతరాలేమైనా ఉన్నాయా ?
స్వామి వివేకానందుని గురించి తెలియని భారతీయుడు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. యువతకు స్పూర్తి దాయకుడైన వివేకానందుడు అందరికీ ఆదర్శమే. ఆయన ఎన్నో అధ్యాత్మిక అనుభవాలు చివరికి అత్యున్నతమైన అద్వైత స్థితిని కూడా పొందారు. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వెంటాడుతూ ఉంటుంది. అదేమిటంటే ఇంత మహానుభావునికి సిద్ధులు అనగా అతీతశక్తులు ఉన్నాయా లేవా అని! ఉన్నాయి, కాని అతను ఎప్పుడూ వాటిని బహిరంగముగా ప్రదర్శించలేదు.
ఈ సంఘటన స్వామి పరమహంస యోగానంద గారితో ముడిపడి ఉన్నది . కాబట్టి ఆయన గురించి పరిచయాన్ని చెప్పుకుందాం . స్వామి పరమహంస యోగానంద క్రియాయోగమును భారతదేశంతోపాటుగా అమెరికా,ఇంగ్లండు లలో వ్యాప్తి చేసిన ఒక యోగి. ఇతను రచించిన ఆత్మకథ పేరు "ఒక యోగి ఆత్మకథ". ఈ పుస్తకం చాలా ప్రచారం పొందింది.ఈ పుస్తకమును అనేక అమెరికా విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశముగా పెట్టారు. ఈ పుస్తకములోనే మనకు తెలియని వివేకానందుని అతీత శక్తి గురించి ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి .
పరమహంస యోగానంద గారు రెండవ సారి అమెరికా వెళ్ళినప్పుడు తన పాశ్చాత్య శిష్యుల కోసం ఎన్నో కానుకలు తీసుకెళ్ళారు. అక్కడ అందరికీ కానుకలు ఇస్తున్నారు. ఒక శిష్యునికి ఒక వెండి కప్పు బహుమానముగా ఇచ్చారు.
ఈ శిష్యుడు యోగానందుల కంటే వయసులో పెద్దవాడు. అప్పుడు ఆ శిష్యుడు నిశ్చేష్టుడై నోట మాట రాక ఒక మూల ఏడుస్తూ కూర్చుండిపోయాడు. యోగానంద గారు అది గమనించి అప్పటికి ఏమీ అనకుండా చివరలో ఏకాంతముగా ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ శిష్యుడు అవి ఆనందభాష్పాలు అని చెప్పాడు. యోగానంద గారు కారణం అడిగారు.
అప్పుడు ఆ శిష్యుడు తన చిన్ననాటి సంఘటన గురించి చెప్పాడు. అతని చిన్నతనంలో ఒకసారి అతను నీళ్ళల్లో మునిగిపోబోతూ రక్షించండని అరవసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి గాలిలో సూర్యతేజస్సుతో ప్రత్యక్షమై "లే" అన్నాడు. ఈ శిష్యుడు ఎలాగో బయట పడ్డాడు. కొన్ని రోజులకు ఆ విషయం మరిచిపోయాడు.
తర్వాత చికాగోలో విశ్వమతమహాసభ జరుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి లోపలికి పోవడం చూసి ఈ అబ్బాయి నిశ్చేష్టుడై తన తల్లితో "అమ్మా! చిన్నప్పుడు నాకు గాలిలో కనిపించిన వ్యక్తి అతనే" అంటూ వడివడిగా లోనికి ప్రవేశించారు. ఆ వ్యక్తే స్వామి వివేకానంద.
వివేకానందులు ఈ అబ్బాయిని చూడ్డంతోనే నవ్వుతూ " నీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు" అన్నారు. అప్పుడా అబ్బాయి ఆనందభాష్పాలు రాలుస్తూ ‘ స్వామీ, నన్ను నీ శిష్యునిగా చేర్చుకోమన్నాడు. అందుకు వివేకానందులు "నీ గురువు నేను కాదు. అతను మరో పాతిక సంవత్సరాల తర్వాత వస్తాడు. దానికి గుర్తు అతడు నీకు ఒక "వెండి కప్పు"ను బహుమానముగా ఇస్తాడు" అని చెప్పారు.
వివేకానందులకు తనను శిష్యునిగా చేసుకోవడం ఇష్టములేక ఇలా అంటున్నాడని బాలుడు అనుకొన్నాడు. కాని ఇప్పుడు అతని భవిష్యవాణి ఇలా జరగడం చూసి ఆనంద భాష్పాలు వర్షించాడు .
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వమత మహాసభ జరిగినది 1893 సెప్టెంబరులో. యోగానంద గారు పుట్టినది 1893 జనవరి 5 న.యోగానంద గారు పుట్టిన ఏడాదే , ఆయన ఎవరికి ఎప్పుడు గురువుకాగలరో , ఏ శిష్యునికి వెండి కప్పుని బహూకరిస్తారో వివేకానంద స్వామి చెప్పారంటే, ఆయన అద్వైత స్థితి ఏమిటి అనేది అర్థం అవుతోంది కదా !