Online Puja Services

భక్తుని కోసం కదిలి వచ్చిన కనకమహాలక్ష్మి !

3.133.109.251

సామాన్యుడైన భక్తుని కోసం కదిలి వచ్చిన కనకమహాలక్ష్మి !
లక్ష్మీ రమణ 

మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం... కల్లూరు .. రాయచూరు కర్ణాటక

అమ్మ నిజంగా అమ్మే ! బిడ్డ తనదగ్గరికి రాలేకపోతే, తానె స్వయంగా  ఆ బిడ్డ దగ్గరికి వెళ్లి , ఆ బిడ్డ ఆశ్చర్యంతో తనవంక అలాగే చూస్తుంటే, చిరునగవులు చిందిస్తూ , కటాక్షాన్ని కురిపిస్తుంది. అనుగ్రహాన్ని వర్షిస్తుంది . అమ్మ అంగీకారం గనక దక్కిందా , ఇక నాన్న కూడా తప్పక అంగీకరిస్తారు . అమ్మవెంటే అనుగ్రహిస్తారు . ఎవరి గురించి అనుకుంటున్నారా ! ఒక సామాన్య భక్తుని కోసం కదిలివచ్చిన కనకమహాలక్ష్మి గురించి. ఈ క్షేత్రం గురించి తెలుసుకుంటే, మరింతగా ఆశ్చర్యపోవడం ఖాయం .

మధ్వ పండితులు శ్రీ లక్ష్మీకాంత ఆచార్యులు లక్ష్మీదేవి ఉపాసకులు. అమ్మ మీద అమలినమైన ప్రేమ, ఆరాధన ఆయనకీ. నిత్యం చందనం అరగదీసి అమ్మవారికి లేపనంగా సమర్పించేవారు. కొల్హాపూర్ లక్ష్మీమాత దర్శనానికి,  దసరానవరాత్రుల్లోని అష్టమి నాడు తప్పకుండా వెళ్లేవారు ఆచార్యులు.  ఆ ఉపాసనా ఆయనకీ నిత్యజీవన వేదం . 

కాలం ఎవరికోసమో ఆగదుకదా ! కాలంతోపాటు, ఆచార్యులవారికి వయసు మీదపడింది. 88 ఏళ్ళవారయ్యారు . ఆ వయసులో దూరాభారం కొల్హాపూరు వరకూ వెళ్ళాలి. పైగా ఆర్థిక పరిస్థితికూడా అనుకూలంగా లేదు . దాంతో ఆచార్యులవారు నవరాత్రి ఉత్సవాలకు వెళ్లలేని పరిస్థితి. అమ్మ తన బిడ్డలా పరిస్థితి తెలుసుకోలేదా ? 

ఇక, తెల్లవారితే నవమి. ఆచార్యులవారు చందనం అరగదీస్తున్నారు . మనసులో ఒకటే ఆలోచన . అమ్మ దర్శనానికి వెళ్లలేకపోయానే అని. అలాగే అర్చనాదికాలు ముగించారు . ఆ రాత్రి అమ్మవారు ఆచార్యులవారి  కలలో దర్శనమిచ్చారు. ‘ నాయనా ! నాదగ్గరికి రాలేకపోయానని బాధపడకు. ఈ సారి నవరాత్రులకి నేనే నీదగ్గరికి వస్తాను’ అన్నారు అమ్మ . ఆనందం అవర్ణమయ్యింది ఆచార్యులవారికి . 

తెల్లవారు ఝామునే లేచి, స్నానాదికాలు ముగించుకొని , ఆ కలనే మళ్ళీ మళ్ళి తలుచుకుంటూ, అమ్మ నిజంగానే వస్తే, బాగుండునని  ఆలోచిస్తూ అమ్మకి సమర్పించేందుకు చందనాన్ని రోజూలాగానే అరగదీస్తున్నారు . ఆ చందనాన్ని అరగదీసే సానరాయి ఉన్నట్టుండి , దాని మృదుత్వాన్ని కోల్పోయినట్టు అనిపించింది ఆచార్యులవారికి . రాయిలోని ఆ కాఠిన్యం అంతకంతకూ పెరుగుతూ ఉండడం ఆచార్యులవారు చేతికి తెలుస్తూనే ఉంది .  ఏమిటా ఇది ఉన్నట్టుండి ఈ రాయిలో ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తోంది అనుకొంటూ , పూర్తిగా దానిపైన చందనాన్ని తొలగించి, చక్కగా నీటితో శుభ్రం చేశారు . అప్పుడు దర్శనమిచ్చింది అమ్మ !

చిరునగవులు చిందిస్తూ, ఆచార్యులవారు కళ్ళలోని ఆశ్చర్యాన్ని అబ్బురంగా అవలోకిస్తూ … ! ఇప్పటికీ అలా స్వయం వ్యక్తమైన లక్ష్మీ మాతని మనం దర్శించుకోవచ్చు. అదికూడా ఆ అమ్మ మీది ప్రేమతో తపించిన ఆచార్యులవారు ఇంటిలో !      

ప్రస్తుతం రెండో కొల్హాపూరిగా ప్రసిద్ధిని పొందింది కల్లూరులో  ఉన్న ఈఆ  మహాలక్ష్మి అమ్మ వారి దేవాలయం. రాయచూరు కి సమీపంలోనే ఉంటుంది ఈ ఆలయం . అమ్మవారి విగ్రహం, సానరాతిమీద స్వయం వ్యక్తమయినట్టుగా, దానిమీద చందనం అరగదీసిన  గుర్తులు కూడా మనం ఈనాటికీ గమనించవచ్చు . ఆ అమ్మ స్వరూపం వర్ణించడానికి వీలులేనిది , దర్శించి తరించాల్సినది . ఆలయంలో ఎక్కడ నిలబడినా మనవైపే చూస్తూన్నారా అమ్మవారు అన్న భ్రాంతికి లోనవుతాం. ఆ అమ్మ పక్కనే అయ్యవారు వెంకటేశ్వరులు కూడా కొలువై ఉంటారు. ఈయన ఇక్కడికి విచ్చేయడం కూడా ఒక అద్భుతమైన సంఘటనే . 
   
అమ్మవారు విచ్చేసిన  మరుసటి సంవత్సరం ఆచార్యుల వారు ఒక గ్రామం గుండా వెళ్తుండగా, ఒక పొలంలో రైతు నాగలి దున్నుతున్నాడు . ఆ నాగలి ఒక ప్రదేశానికి వచ్చి అక్కడే ఏదో అడ్డుపడ్డట్టు ఆగిపోయింది . తవ్వి చూస్తే,  వెంకటేశ్వర స్వామి విగ్రహము బయల్పడింది . ఆయన  దానిని తీసుకొని వచ్చి అమ్మ వారి ప్రక్కనే ప్రతిష్టించారు. ఇలా వేరు వేరుగా లభ్యమయినా ఆ దంపతులు విశాల నేత్రాలతో , ఒకే శిల్పి మలిచిన మూర్తులేమో అని మనల్ని భ్రమించేలా చేస్తాయి . వెంకన్న మూలమూర్తి శిలపైనే  శ్రీదేవి , భూదేవి కూడా ఉండడం విశేషం . 

అలా అమ్మ వారు లక్ష్మీ కాంత్ ఆచార్య వారి  సాదరణ  గృహం లొనే కొలువై పూజలందుకుంటున్నారు.ఇక్కడ కార్యక్రమలు అన్ని మధ్వ సంప్రదాయ పరంగా జరుగుతాయి. ఆచార్యులవారి కుటుంబీకులు ఇప్పటికీ అక్కడే ఉంటూ ఆలయ వ్యవహారాలూ చూసుకుంటూ ఉంటారు . 

మంత్రాలయం వెళ్లిన వారు వీలు చూసుకొని తప్పకుండా దర్శించాల్సిన దివ్యమైన లక్ష్మీ క్షేత్రం ఈ కల్లూరు లక్ష్మీ దేవాలయం . మహామేమోపేతం కూడా ! ఇక్కడ కావాల్సిన కోరికలు చెప్పుకొని భక్తులు కొబ్బరికాయ ముడుపుని ఆలయంలో కడతారు . ఆ ,కోరికతీరాక  తిరిగి ఆ కొబ్బరికాయ ముడుపుని విడదీస్తారు . ఇక్కడ మొక్కుకున్నవారికి ఖచ్చితంగా అమ్మవారి కృపతో వారి వారి కోర్కెలు ఈడేతాయని విశ్వాసం . 

ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రాయచూరు దగ్గరి ప్రదేశం . అక్కడినుండి బస్సులు, ఆటోలు దొరుకుతాయి .  

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore