Online Puja Services

నహుషుని మదం

18.226.93.22

దివ్యశ్రీనారాయణీయమ్

జాగ్రత్తగా చదవండి......

నహుషుడు చంద్రవంశంలో జన్మించిన గొప్ప రాజు. దానధర్మాలతో, యజ్ఞయాగాలతో, యయాతి వంటి పుత్రులతో ప్రపంచమంతటా వేనోళ్ల కీర్తింపబడిన వాడు. అలా దశదిశలకూ వ్యాపించిన అతని కీర్తి, ఇంద్రలోకానికి కూడా చేరుకుంది. అక్కడ నుంచి అసలు కథ మొదలైంది.

ఒకసారి ఇంద్రుడు వృత్రాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. దాని వల్ల తనకు పాపం చుట్టుకుందని భావించిన ఇంద్రుడు, కొన్నాళ్ల పాటు నారాయణమంత్రాన్ని జపిస్తూ ఒక కమలంలో ఉండిపోవాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఇంద్రుడు వచ్చేవరకూ ఇంద్రపదవిని అధిష్టించేది ఎవరు అన్న సమస్య మొదలైంది. ఇంద్రపదవిని చేపట్టేందుకు అందుకు సాటైనవాడు ఎవరా అని అష్టదిక్పాలకులంతా ఆలోచించగా, నహుషుడే అందుకు తగినవాడు అని తట్టింది. దాంతో ఒక సాధారణ రాజైన నహుషుడికి ఇంద్రపదవిని కట్టబెట్టారు. 

ఇంద్రపదవిని చేపట్టిన నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు. కానీ రానురానూ అతనిలో అధికారం తలకెక్కింది. మదపు మత్తులో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాంటి నహుషునికి ఓమారు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కనిపించింది. అంతే! ‘ఇంద్రపదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా!’ అనుకున్నాడు నహుషుడు. వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియచేశాడు.  నహుషుని మాటలకు శచీదేవి విస్తుబోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. వద్దు అన్నా ఆగేట్లు లేడు నహుషుడు. 

ఆ సమయంలో దేవతల గురువు బృహస్పతి, శచీదేవికి ఒక ఉపాయాన్ని అందించాడు. ‘ఏ మదంతో అయితే నహుషుడు మునిగితేలుతున్నాడో, ఆ మదంతోనే అతన్ని జయించాలి. అందుకోసం నువ్వు అతడిని ఒక కోరిక అడుగు’ అంటూ శచీదేవికి ఒక సలహా ఇచ్చాడు. బృహస్పతి ఇచ్చిన సలహా మేరకు శచీదేవి, నహుషునికి ఒక కబురు పంపింది ‘ఇంద్రపదవిలో ఉన్నావు కాబట్టి, అందుకు తగినట్లుగా గొప్ప రుషులందరి చేతా పల్లకీని మోయించుకుంటూ రా!’ అన్నదే ఆ సందేశం.‘ఓస్‌! అంతేకదా’ అనుకున్నాడు నహుషుడు. అగస్త్యుడు మొదలైన రుషులందరి చేతా తన పల్లకీని మోయించాడు. 

అసలే ఇంద్రపదవి, ఆపై తన సొంతం కానున్న శచీదేవి! నహుషుని సంబరానికి అంతులేకుండా పోయింది. శచీదేవిని చేరుకునేందుకు అతని మనసు ఉవ్విళ్లూరుతోంది. ఆ తొందరలో పల్లకీని మోస్తున్న అగస్త్యుడిని ఒక్క తాపు తన్నాడు. ‘సర్ప! సర్ప!’ (త్వరగా, త్వరగా) అంటూ ఆయనను తొందరపెట్టాడు. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేకపోయాడు. ‘సర్ప! సర్ప! అంటున్నావు కదా! నువ్వు సర్పానివై భూలోకాన పడి ఉండు,’ అంటూ నహుషుడిని శపించాడు. అగస్త్యుని శాపం విన్న తరువాత కానీ తానెంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థం కాలేదు నహుషునికి. కానీ జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది కదా! ఇక చేయగలిగిందేమీ లేదని గ్రహించిన నహుషుడు ‘తప్పైపోయింది మహాప్రభూ! నాకు ఈ శాపవిమోచనం కలిగే ఉపాయాన్ని అనుగ్రహించండి!’ అంటూ అగస్త్యుని ప్రాథేయపడ్డాడు.

నహుషుని పశ్చాత్తాపాన్ని గమనించిన అగస్త్యుడు ‘కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక కొండచిలువ రూపంలోనే సంచరిస్తూ ఉండమనీ, ఆ తరువాత అటుగా వచ్చేవారు ఎవరైతే నహుషుని ప్రశ్నలకు సరైన జవాబులు అందిస్తారో, వారే అతనికి శాపవిమోచనాన్ని కలిగిస్తారనీ’ సెలవిస్తాడు.

అగస్త్యుడు పేర్కొన్నట్లుగానే... చాలా ఏళ్ల పాటు ద్వైతవన సమీపంలో కొండచిలువ రూపంలో సంచరించసాగాడు. అలాంటి ఒక సందర్భంలో భీముడు అటు రావడం తటస్థించింది. సర్ప రూపంలోని నహుషుడు మాంచి కండపట్టి ఉన్న భీముని అమాంతం చుట్టిపారేశాడు. భీముని పరాక్రమం నహుషుని పట్టు ముందర ఎందుకూ కొరగాకుండా పోయింది. మరికాసేపటిలో నహుషుడు, భీముని ఫలహారం చేస్తాడనగా... తన సోదరుని వెతుక్కుంటూ ధర్మరాజు అక్కడకు చేరుకున్నాడు. 

నహుషుని చెరలో విలవిల్లాడుతున్న భీముని చూడగానే ధర్మరాజుకి ఆ సర్పం సామాన్యమైనది కాదని అర్థమైంది. దాంతో మెల్లగా దాన్ని మాటల్లోకి దింపి తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. ‘నీ ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే నా సోదరుడిని విడిచిపెడతావా!’ అని ప్రతిపాదించాడు ధర్మరాజు. ‘నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, శాపవిమోచనాన్ని కలిగిస్తానంటే అంతకంటేనా! జవాబులు చెప్పకుంటే మాత్రం నీ సోదరుని చావు తథత్యం!’ అన్నాడు సహుషుడు. 

సహుషుడు, ధర్మారాజుని రెండు ముఖ్యమైన ప్రశ్నలు వేశాడు. అవి ‘బ్రాహ్మణుడు అంటే ఎవరు? అతను ఏం తెలుసుకోవాలి?’ అని. దానికి ధర్మరాజు ‘సత్యం, దానం, దయ, వ్యక్తిత్వం, అహింస, నిగ్రహము... వంటి లక్షణాలు ఉన్నవాడే బ్రాహ్మణుడనీ, అతను దుఃఖానికి అతీతమైన పరబ్రహ్మను తెలుసుకోవాలనీ’ బదులిచ్చాడు. అంతేకాదు! ఈ గుణాలు కలిగినవారెవ్వరైనా సరే బ్రాహ్మణులని చెప్పుకొచ్చాడు. 

ధర్మరాజు జవాబులకు నహుషుని మనసుకి సబబుగా తోచడంతో అతనికి శాపవిమోచనం కలిగింది. ఇటు భీమునికీ స్వేచ్ఛ లభించింది. పౌరులను పాలించాల్సిన రాజుకి, ఆ పాలనాధికారమే తలకెక్కిన రోజు నహుషునిలా దిగజారిపోక తప్పదని ఈ కథ చెబుతోంది.

ఓంనమోనారాయణాయ
ఓంనమోభగవతేవాసుదేవాయ
ఆచార్యనారసింహ
కలవళ్ల.
8106484810.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore