Online Puja Services

పరీక్షిత్ - తక్షకుడు

3.17.142.93

కర్మ ఫలం తప్పదు

అందర్నీ హెచ్చరించే మంచి వ్యాసం. అందరూ చదవాలని మనవి 

కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు.
మన పాపకర్మే  గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది. ఎందుకంటే? కర్మ బలీయమైనది.

పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు. 
కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.

తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు.
 ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.

అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు తక్షకుడే స్వయంగా అయితేనో? అన్నాడు.

తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో, విషకీటక మంత్రమో అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు కశ్యపుడు.

అంత గొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని అని నిజరూపం చూపించాడు తక్షకుడు. 

అంతటా కశ్యపుడు, సర్పరాజా! నీకిదే నా ప్రణతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢవిశ్వాసం అని  అన్నాడా కశ్యపుడు.

అపుడా తక్షకుడు, తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విషశక్తి చూడు! అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు. 

కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు.  ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు! అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచి తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి 
ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు. 

చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది. 

వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని మహామంత్రద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసినాను, నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో... లేదో, నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలిప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షీతుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు. 

ఇంతకూ తమకు కావలసింది.... అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా ధనమయ్యా! ధనం! అన్నాడు. అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపివేసినాడు.

ఇంతవరకూ కథ బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది చాలా వున్నది.

మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు.
ఓక వేళ కశ్యపుడు లాంటివాడు బయలుదేరినా వారిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం. 
అదే మనం చేసుకొన్న పాపం,కర్మఫలం.
పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికి భగవంతుడు కూడా.

ఎందుకంటే వాడి కర్మ కలిసిరావాలి. 
కౌశికుడు రాజును రక్షించుదామని బయలుదేరినా,  పరీక్షిన్మహారాజు యొక్క పాపకర్మ అడ్డు పడినది.
ఏమిటి ఆ పాప కర్మ?  
ఓక ముని మీద చచ్చిన పామును వేయడం. 
మంచివారితో మహాత్ములతో చెలగాడటం.
కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.

రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, కేవలం తన కర్మ చేతనే చనిపోయినాడు.
 
పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు. ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అదే విధముగా గ్రహములు కూడా! మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది. 

మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మఫలం అనుభవింప జేస్తాయి.
నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.
మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది.
కర్మ బలీయమైనది.

గోవిందా, నారాయణా, రామా, కృష్ణా!కాపాడు!కాపాడు!అని ప్రార్ధిస్తూ ఉంటాం. ప్రాణాపాయంలో వున్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు. ఓయి, నీవు ఎప్పుడన్నా పుణ్యం చేశావా? నీ భార్య చేసిందా? నీ బిడ్డలు చేసినారా? నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? నీకు గురువుల అనుగ్రహం వున్నదా? నీవు చేసిన పుణ్యం లేదు, ఇతరులు నీకు ధారపోసిన పుణ్యం లేదు. మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేది? అనుభవించు! నీ కర్మ అని అంటాడు.

మన పుణ్యపలం మన జాతకంలో గురురూపంలో కనిపిస్తుంది.
గురు అనుగ్రహం వున్నదా? 
గురు దృష్టి వున్నదా? 
శుభగ్రహ దృష్టి వున్నదా? 
వుంటే బ్రతికిపోతాము. లేదా బాధ పడాలి, తప్పదు.
పాపం అంటే శరీరాన్ని తద్వారా మనసును బాధ పెట్టడమే.

"మనసు బాధ పడితేనే పాపకర్మ క్షయం అవుతుంది."
"మనసు సుఖ పడితే పుణ్యకర్మ క్షయం అవుతుంది" .

పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే. ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు,పాపమూ లేదు. అదే అకర్మ,వికర్మ,సుకర్మ.
కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు.

తాతముత్తాతలు చేసిన పుణ్యఫలం, పాపఫలం తప్పక పిల్లలకు వస్తుంది, వచ్చి తీరుతుంది.
ఆ పుణ్యమే మన సంతానాన్ని, మనుమలన్ని కాపాడుతుంది. మన వంశాన్ని కూడా కాపాడుతుంది.
ఇదే మన జాతకంలో రెండవ స్థానం, తొమ్మిదవ స్థానం స్పష్టంగా చెబుతుంది.

మనం చేసిన పాపాలు, ప్రారబ్ధం మన పితృదేవతలు చేసిన పుణ్యఫలితం వలన బ్రతికి బయట పడతాము.
వారి పుణ్యఫలం మనల్ని కాపాడుతుంది.
మనం చేసిన పుణ్యఫలం మన బిడ్డలను కాపాడుతుంది. 

సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షములు వున్న పరీక్షిత్తు అంతటి వాడు కూడా మాయలో పడ్డాడు గదా! 
కలిపురుషున్ని నిలదీసిన వాడు కూడా అహంకారానికి లోనైనాడు. శ్రీకృష్ణ పరమాత్మ
చేత రక్షింపబడి, గర్భం నుండి బయటపడిన వాడు నేడు మృత్యువు నుండి ఎందుకు బయట పడలేదు.
అదే కర్మఫలం, కాల మహిమ.

కాలానికి, మాయకు ఎవ్వరూ అతీతులు కారు. దీనిలో మనం మరోకటి కూడా గమనించాలి.
తక్షకుడు విషనాగు అంటే ప్రారబ్దకర్మ. దానిని కూడా జయించింది మంత్రశాస్త్రం. 
కాటు చేత పుష్పించిన మహావృక్షం కాలి బూడిద అయితే,  మంత్రం మరలా దానిని చిగురింప జేసినది.
అంటే మంత్రం చేత ప్రారబ్దకర్మ తొలగబడుతుంది అని మనం తెలుసుకోవాలి.

మంత్రం ప్రాణం పోస్తుంది. 

కానీ ఆ మంత్రం పనిచేయాలంటే ప్రారబ్ధకర్మ బాగుండాలి! అంటే మనం సత్కర్మలు మాత్రమే ఆచరించాలి!  

అందర్నీ హెచ్చరించే మంచి వ్యాసం. అందరూ చదవాలని మనవి

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba