Online Puja Services

పిల్లి ఎలుక

3.133.143.167

ఒకానొక అడవిలో ఓ మర్రిచెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తోంది. అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తోంది. ఒక వేటగాడు రోజూ రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి, అక్కడ ఓ వలను పరచి వెళ్లేవాడు. రాత్రివేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కనుక.. ఉదయమే వచ్చి వలలో చిక్కిన వాటిని చక్కగా తీసుకుని పోయేవాడు. ఒక రోజు అనుకోకుండా వలలో రోజసుడు అనే పిల్లి చిక్కుకుపోయింది. పిల్లి వలలో పడింది కనుక ఎలుక దానిచుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది.

ఆహారం కోసం అటూఇటూ ఆబగా చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. కొద్ది దూరంలోనే ఒక ముంగిస, గుడ్లగూబ దానికి కనిపించాయి. అవి ఎలుకని గుటుక్కుమనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు. అలా అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్లి ‘నేను ఈ వలని కొరికి నిన్ను రక్షిస్తాను. బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ, ముంగిసల బారి నుండి రక్షించవా!’ అని అడిగింది. పిల్లికి అంతకంటే ఏం కావాలి. వెంటనే అది సరేనంది. దాంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది. పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగిస, గుడ్లగూబ జారుకున్నాయి.

‘నేను నీ ప్రాణాలను రక్షించాను కదా! మరి తొందరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడేయి, అని అడిగింది పిల్లి. ‘ఉండు ఉండు నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా! నిన్ను ఇప్పుడే బయటకు తీసుకువస్తే, నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను.. అంటూ సంజాయిషీ ఇచ్చుకుంది ఎలుక. అన్నట్లుగానే మరుసటి ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుటుక్కున కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుకా తన కలుగులోకి దూరిపోయింది.

మర్రిచెట్టు కిందకి చేరుకున్న వేటగాడు కొరికివేసిన వలని చూసి తెగ బాధపడ్డాడు. తన ప్రయత్నం వృధా అయిపోయిందన్న బాధతో వెనుదిరిగి వెళ్లిపోయాడు. వేటగాడు అటు వెళ్లగానే పిల్లి కిందకి చూస్తూ ‘ఎలుకతో.. మిత్రమా! నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందామని పిలిచింది. దానికి ఎలుక నవ్వుతూ ‘మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో, శత్రువు ఎప్పుడు మిత్రడు అవుతాడో చెప్పడం కష్టం.

అలాంటిది సహజ శత్రువులమైన మనమిద్దరి మధ్యా స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయపడ్డానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు. కానీ ఏదో ఒక రోజున ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన నీకు రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా, ఆ స్నేహాన్ని విడువకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతోంది. నువ్వు నన్ను రక్షించావు. బదులుగా నేను నిన్ను రక్షించావు. మన బంధం ఇక్కడితో చెల్లు. ఇక మీదట నా జోలికి రాకు!’ అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక. ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్ల మారుమాటాడకుండా వెనుదిరిగిపోయింది.

భీష్ముడు చెప్పిన ఈ కథలోని పాత్రలు సహజశత్రువులైన పిల్లీ ఎలుకలే అయినా, ఇందులోని నీతి నిత్యజీవితానికి కూడా వర్తించి తీరుతుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి తెలిసీ అపకారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తోంది. పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి, జీవితాన్ని పణంగా పెట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తోంది.

మహాభారతం పంచమవేదంగా ఖ్యాతిగాంచింది. మహాభారతం మంచిచెడుల గురించి , మనిషి నడవడి ఎలా ఉండాలి తెలియజేస్తూ.. మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియచేస్తుంది. ముఖ్యంగా మహాభారతంలోని శాంతిపర్వంలో అనేక హృద్యమైన కథలు కనిపిస్తాయి. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు, ధర్మరాజుకి చేసిన హితబోధలలో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిలో ఒక కథే ఇది…

  సర్వేజనా సృజనో భవంతు 

- లలితా రాణి 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba