మగువ గెలుపు కథ
మగువ గెలుపు కథ
అష్టపతి మహారాజుకి
సావిత్రి ఒక్కగానొక్క కుమార్తె.
ఒకరోజు ఆమెకు అడవిలో ఒక యువకుడు అంధులైన తన తల్లిదండ్రులను
కాడిలో మోస్తూ కనిపించాడు.
అతడి పేరు సత్యవంతుడు.
తల్లిదండ్రులను ప్రేమగా చూస్తున్న సత్యవంతుడినే
వివాహం చేసుకోవాలనుకుంది సావిత్రి.
అయితే అతడు
సంవత్సరంలోపే మరణిస్తాడని తెలుసుకుంది
అయినప్పటికీ తండ్రిని ఒప్పించి అతణ్ణే
పెళ్ళాడి వనసీమల్లో కాపరానికి వెళ్ళింది.
సంవత్సరకాలం తరవాత
ఇక మూడు రోజుల్లోనే తన భర్త
గతిస్తాడనే విషయం గుర్తుకు వచ్చింది సావిత్రికి.
ఆ నాడు త్రయోదశి.
ఆ మూడు రోజులూ ఉపవాస దీక్షలో
ఉండాలని నిశ్చయించుకుంది.
అత్యంత భక్తి శ్రద్దలతో దీక్ష ప్రారంభించింది.
సరిగ్గా ఆ రోజు రానే వచ్చింది .
కట్టెల కోసం వటవృక్షాన్ని కొడుతూ
సత్యవంతుడు సొమ్మసిల్లాడు.
హఠాత్తుగా యమధర్మరాజు ప్రత్యక్షమై
సత్యవంతుడి ఆత్మను తన వెంట తీసుకు వెళ్తున్నాడు .
సావిత్రి యముడిని
అనుసరిస్తూ అతడి వెంటే నడుస్తుంది.
కొంతసేపటికి ఆమె
వెనకకు మరలి పోతుందని భావించిన యముడు
ఆమె రాకను అడ్డగించలేదు.
ఆమె పట్టుదలగా
లక్ష్యసాధన కోసం యముని వెనుకే నడుస్తుంది..
ఆమెను మరల్చడానికి యముడు
ఎన్నో ఎత్తులు వేశాడు.
చనిపోయిన సత్యవంతుడని
తిరిగి బ్రతికించడం ప్రకృతి విరుద్ధమని
అందుకు బదులుగా మూడు వరాలిస్తానన్నాడు.
అది కూడా భర్త ప్రాణాలు తప్ప
అని నియమం విధించాడు.
అంగీకరించింది సావిత్రి .
మొదటి వరంగా
రాజ్యభ్రష్టులైన అత్తమామలకు
రాజ్యసంప్రాప్తి, నేత్ర దృష్టి అనుగ్రహించాడు.
రెండవ వరంగా
తన తండ్రికి కుమారుడిని అనుగ్రహించాడు.
ఇక. చివరగా మూడో వరంగా
తనకు సంతానభాగ్యం ప్రసాదించమని ప్రార్థించింది.
యముడు అంగీకరించాడు.
వెంటనే సావిత్రి
యమధర్మరాజా !
భర్త లేనిదే సంతానయోగం లేదు కదా
అనడంతో .... సావిత్రి పాతివ్రత్యాన్ని
అర్థం చేసుకున్నాడు యముడు.
సావిత్రి వటవృక్షం దగ్గర
తన భర్త పడి ఉన్న ప్రదేశానికి వచ్చి
ఆ వృక్షం చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసేసరికి
సత్యవంతుడు మేల్కొన్నాడు .
దంపతులిద్దరూ మళ్ళీ ఒకటయ్యారు.
ఏ పనైనా త్రికరణశుద్ధిగా చేసినప్పుడే
సరైన ఫలితం దక్కుతుంది.
మీ, రాజు సానం