Online Puja Services

రూపాయి బడాయి

18.224.21.26

ఒక రైతు నడుస్తూ పట్నం వెళుతున్నాడు. అతని జేబులో ఒక రాయి, ఒక అయిదు రూపాయల నాణెం ఉన్నాయి. నాణెం కొత్తది. తళతళమని మెరిసి పోతోంది. అది నల్లగా గరుకుగా ఉన్న రాయిని చూసి చిరాకు పడింది. పైగా రైతు అడుగుల కుదుపుకి రాయి వచ్చి నాణేనికి తగులుతోంది.

అయిదు రూపాయల బిళ్ల ఎగతాళిగా రాయితో ఇలా అంది. ‘‘నన్ను తాకకు, దూరంగా, మర్యాదగా ఉండు. నేను నీలా విలువ లేని రాయిని కాను. నన్ను డబ్బు అంటారు. నాతో ఆహార పదార్థాలు, వస్తువులు కొనుక్కోవచ్చు. "ధనమూలం ఇదం జగత్‌" అంటారు తెలుసుగా?’ అంటూ గొప్పలు పోయింది.

రాయి ‘అలాగా’ అన్నట్లుగా ప్రశంసగా చూసింది. ఇక నాణెం రెచ్చిపోయి తన గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది. తను ఇప్పటి వరకు ఎన్ని చేతులు మారిందీ, తనతో కొనుక్కో దగిన వస్తువులెన్ని ఉన్నాయో వినిపించింది. అన్నింటినీ ప్రశాంతంగా వినసాగింది రాయి.

ఇంతలో లేత మొక్కజొన్న పొత్తులు నిప్పులపై కాలుస్తున్న కమ్మటి వాసన వచ్చింది.

‘‘ఈ రైతు నన్ను ఆ బండి వాడికిచ్చి ఓ కండె కొనుక్కుంటే బాగుండు. వాడి గల్లా పెట్టెలో నా స్నేహితులతో కలిసి పోతాను. మురికిగా ఉన్న నీతోఉండలేకపోతున్నాను’అంది నాణెం బడాయిగా.

‘ నిజమే ’ ఒప్పుకుంది రాయి నిజాయతీగా. కానీ రైతు నడక ఆగకుండా సాగింది. భోజన సమయానికి ఒక చెట్టు కింద ఆగాడు. అక్కడ కూర్చుని తెచ్చుకున్న మూటవిప్పి గోంగూర పచ్చడి నంచుకుంటూ పెరుగన్నం తిన్నాడు. కాసేపు నడుం వాల్చాడు. ఇంతలోనే లేచి ఎవరితోనో
మాట్లాడసాగాడు.

ఆ మాటలను బట్టి పట్నం నుంచి పల్లెకు వస్తున్న అతడి మిత్రుడొకడు ఎదురు పడినట్లుగా నాణేనికి, రాయికి అర్థమైంది.

‘‘lనీ కోసమే పట్నం బయలుదేరాను మిత్రమా! నా తండ్రి చనిపోతూ ఈ రాయిని నా చేతిలో ఉంచి కన్నుమూశాడు. ఇదేపాటి విలువ చేస్తుందో చెప్పగలవా? నువ్వు రత్నాల వ్యాపారివి కదా’’ అంటూ జేబులో ఉన్న రాయిని తీసి స్నేహితుడికి చూపించాడు.

దాన్ని పరీక్షించిన రైతు మిత్రుడు ఆశ్చర్యంలో తలమునకలయ్యాడు. ‘‘ఇది ముడి వజ్రం. సానబెడితే ఈ చుట్టుపక్కల వూళ్లన్నీ కొనేయగలవు’’ అన్నాడు.

ఆ మాటల్ని జేబులోంచి వింటున్న నాణెం తెల్లబోయింది. రైతు కళ్లు సంభ్రమంతో మెరిశాయి. వజ్రాన్ని కళ్లకద్దుకుని తిరిగి జేబులో వేసుకున్నాడు.

జేబులో చేరిన రాయిని చూసి నాణెం గౌరవంగా దూరం జరిగింది. తన గొప్పలకి సిగ్గుపడి మౌనంగా ఉంది. రాయి నాణేన్ని స్నేహంగా చూస్తూ ‘‘మౌనంగా ఉండిపోయావేం మిత్రమా? నువ్వు గలగలా మాట్లాడుతూ ఉంటే ఎంతో బాగుంది’’ అంది.

నాణెం సిగ్గుతో ‘‘నీ విలువ తెలియక బడాయి పోయాను. నన్ను క్షమించు. నువ్వు విలువైన వజ్రానివని ముందే నీకు తెలుసా?’ అంది.

తెలుసన్నట్లు తలూపింది రాయి.
‘‘మరి నేను అన్ని గొప్పలు పోతుంటే నాకు బుద్ధి వచ్చేలా అసలు విషయం చెప్పలేదెందుకు?’’ అంది నాణెం.

‘ఇదిగో, ఇందుకే. నాకు సహజమైన స్నేహం కావాలి. నువ్వు చూడు. ఇప్పుడు ఎలా వినయంగా, బిడియంగా ఉన్నావో? కృత్రిమత్వం నాకు నచ్చదు. నేను ఎవరో తెలిస్తే నువ్వు నీలా ఉండవు. మన నిజమైన విలువ స్నేహంగా, నిజాయతీగా ఉండే మన ప్రవర్తనని బట్టి ఉంటుంది. డబ్బుతో తూచగలిగేది నిజమైన విలువ అనిపించు కోదు’’ అంది రాయి.

వజ్రపు ఆలోచనా ధోరణికి ముగ్ధురాలైంది నాణెం. చేరువగా వచ్చిన నాణేన్ని ఆదరంగా చూసింది రాయి. మళ్లీ మునుపటిలానే ఎడతెగకుండా నాణెం కబుర్లతో హాయిగా సాగిపోయింది ప్రయాణం!

ఏవరూకూడా సంపదనుచూసి స్నేహం చేయకండి! మనసుచూసి స్నేహం చేయండి

ఏడుకొండలవాడ అందరిని చల్లగా చూడు తండ్రి

 
- బి. సునీత శివయ్య 

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha