అమ్మ రాసిన ఉత్తరం

మా నాన్నగారు శ్రీ వీరరాఘవ అయ్యర్, వైకుంఠ ఏకాదశి రోజు పరమపదించారు. కేవలం పుణ్యాత్ములకే ‘ఏకాదశి మరణం, ద్వాదశి దహనం’ కలుగుతుందని పెద్దల ఉవాచ.
నాన్నగారి సంవత్సరీకం అయిపోయిన తరువాత, పరమాచార్య స్వామివారికి ఇమ్మని మా అమ్మ నాకు ఒక ఉత్తరాన్ని ఇచ్చింది. ఆ ఉత్తరం అంటించినప్పటికీ, అందులో ఉన్న విషయం ఏమిటో నాకు తెలుసు గనుక దాన్ని తెరిచాను. వీలయినంత త్వరగా తనకు ‘ముక్తి’ని ప్రసాదించమని స్వామివారిని వేడుకుంది. నేను చాలా బాధపడ్డాను.
ఉత్తరాన్ని మరలా యథాస్థితికి మార్చి, కంచికి వెళ్ళగానే ఆ ఉత్తరాన్ని ఒక పళ్ళెంలో ఉంచి, దానిపైన టెంకాయలు, తులసిమాల, కండచక్కర మొదలైనవి ఉంచాను. ఎంతోమంది తమకు మంచి కలగాలని స్వామివారి వద్దకు వచ్చి వేడుకుంటారని నాకు తెలుసు. నేను లోపలకు వెళ్ళగానే, శ్రీమఠం బాలు మామ నా గురించి స్వామివారికి తెలిపాడు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అని స్వామివారు అడిగారు. “మీ ఆశీస్సులు అందుకోవడానికి” అని బాలు చెప్పాడు. వెంటనే స్వామివారు, “కాదు, అతని తల్లి నాకు ఒక ఉత్తరం వ్రాసింది. అది ఇతడు టెంకాయల క్రింద దాచిపెట్టాడు. దాన్ని బయటకుతీసి చదువు” అన్నారు. అందులోవున్న విషయాన్ని చిన్నగా బాలుకు మాత్రమే వినబడేటట్టు చెప్పాను.
“ఇతని తల్లిగారు కూడా మీ ఆశీస్సులను వేడుకుంటున్నారు” అని బాలు స్వామివారితో చెప్పాడు. “కాదు, కేవలం అది మాత్రమే చెప్పడానికి ఆమె ఒకటిన్నర పేజీల ఉత్తరం వ్రాయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న విషయం ఏంటో నాకు తెలుసు. అందరికీ తెలియాలి కాబట్టి నిన్ను చదవమన్నాను”. బాలు ఆ ఉత్తరం చదివాడు, అక్కడంతా నిశ్శబ్ధంగా ఉన్నారు.
అందుకు స్వామివారు గట్టిగా నవ్వుతూ, “ఆ మార్గం ఏదో నాకు తెలిస్తే, చూపు, వినికిడి శక్తి కోల్పోయి ఇలా నేను ఇక్కడ కూర్చోనుగా! నాలాగా ఒకమూలన కూర్చుని రామనామ జపం చేసుకోమను ఆమెను”. నేను ఏడ్చేశాను. స్వామివారు తమనుతాము ఇంతతక్కువ చేసుకోవడమే కాకుండా అమ్మ కోరినడానికి మార్గం కూడా చెప్పారు.
నేను ఆ ఉత్తరాన్ని టెంకాయల క్రింద దాచినట్టు స్వామివారికి ఎలా తెలుసు? అది మా అమ్మ రాసిన ఉత్తరం అని, అది ఒకటిన్నర పేజీలు ఉంది అని ఎలా తెలుసు? అందులో ఉన్న విషయం స్వామివారికి ఎలా తెలుసు?
ఇది మనకు తెలిస్తే, ఈ మాయ మనల్ని ఎందుకు బంధిస్తుంది? మనం చెయ్యగలిగింది కేవలం స్వామివారి పాదాలను పట్టుకోవడమే. అదే మనకు ముక్తినిస్తుంది.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం