కొత్త చీర - పాత చీర
ఆ రోజు దీపావళి. గుర్రబ్బండి తోలేవ్యక్తి శ్రీమఠానికి వచ్చి పరమాచార్య స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామివారిని ఏదో అడగాలన్నట్టు పక్కన నిలబడ్డాడు.
పరమాచార్య స్వామివారు సైగలతో అతణ్ణి, “నీకు ఏమి కావాలి?” అని అడిగారు. కాస్త సంకోచిస్తూ తనకు పంచె కావాలని అడిగాడు.
స్వామివారు శ్రీమఠం సేవకుణ్ణి పిలిచి అతనికి ఒక పంచె, తువ్వాలు ఇవ్వమని ఆదేశించారు. ఆ శిష్యుడు ఒక పంచె, తువ్వాలి తెచ్చి అతనికి ఇచ్చాడు. కానీ అతను అక్కడి నుండి కదలక తన భార్య కోసం ఒక చీరను అడిగాడు.
అప్పటికి మఠం చీరలు లేవు, కానీ స్వామివారు ఒక చీరను ఇవ్వమని ఆ శిష్యునికి చెప్పారు. ఇప్పుడు ఏం చెయ్యాలో అతనికి పాలుపోలేదు.
మహాస్వామి వారి దర్శనం కోసం ఎందరో భక్తులు వరుసలో నిలబడున్నారు. ఆ వరుసలో నిలబడున్న ఒకామెకు ఆ శిష్యుని పరిస్థితి అర్థమైంది. ఆవిడ వెంటనే కొద్దిదూరంలో మరుగున ఉన్న చోటుకువెళ్ళి, తనతోపాటు తెచ్చుకున్న పాత చీరను కట్టుకుంది. అప్పటిదాకా కట్టుకున్న కొత్త చీరను మడిచి ఒక రవిక గుడ్డను జతచేసి ఇద్దరూ ఆ గుర్రబ్బండి నడిపే వ్యక్తికి ఇచ్చారు.
కొద్దినిముషాల్లోనే స్వామివారి ఎదుటకు దర్శనంకోసం నిలబడున్న దంపతులోకరు వచ్చారు. తమ కుమార్తె పెళ్లిపత్రికను తీసుకునివచ్చి స్వామివారి ఆశీస్సులను కోరారు.
“పెళ్లిచీరలను కాంచీపురంలోనే కొన్నారా?” అని అడిగారు స్వామివారు.
“అవును, చాలా చీరాలను కొన్నాము - పెళ్లి చీరతో పాటు, ఆడపడుచులకు బంధువులకు కూడా కొన్నాము” అని చెప్పారు.
“మీ చుట్టాలకోసం తీసుకున్న చీరలలో ఒక చీరను మఠానికి ఇవ్వగలరా?” అని అడిగారు స్వామివారు. ఇది వినగానే ఆ దంపతులు ఎంతో సంతోషంతో ఒక ఖరీదైన చీరను తీసి స్వామివారి ముందుంచారు.
మహాస్వామివారు మరొక శిష్యుణ్ణి పిలిచి, “అక్కడ నిలబడున్న ఆవిడకు ఈ చీరను ఇవ్వు. ఆమె తన దీపావళి కొత్త చీరను గుర్రబ్బండి నడిపే వ్యక్తికి ఇచ్చి తను పాత చీరను కట్టుకుంది” అని ఆదేశించారు.
కానీ ఇదంతా స్వామివారి ఎదురుగా జరగకపోయినా ఈ విషయం స్వామివారికి ఎలా తెలిసిందో అర్థం కాలేదు ఆ శిష్యునికి. ఆమె కూడా చాలా ఆశ్చర్యానికి లోనయ్యింది. ఏ దైవశక్తి ఈ విషయాన్ని స్వామివారి చెవిలో చెప్పిందో మరి.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం