పది రూపాయలా? పదిహేను రూపాయలా?

పరమాచార్య స్వామివారు కలవైలో మకాం చేస్తున్నారు. ఒకరోజు ఉదయం తంజావూరు నుండి ఒక న్యాయవాది స్వామివారి దర్శనానికి కారులో వచ్చాడు. చాలా ఆడంబరంగా పటాటోపంతో వచ్చాడు. అతని భార్య సంప్రదాయ పద్ధతిలో మడిచీర కట్టుకుంది. వారి కుమారులు పంచ ఉత్తరీయములు వేసుకున్నారు. ఇక అతను వైదికంగా పంచకట్టుకుని ఉత్తరీయం వేసుకొని, మేలిమి రత్నం పొదగబడిన ఒక బంగారు గొలుసును మెడలో వేసుకున్నాడు.
అతని చేతిలో ఒక పెద్ద పళ్ళెం ఉంది. అందులో చాలా పళ్ళు, పూలు, ద్రాక్షలు, జీడీపప్పు, కలకండ, తేనె వీటన్నిటితో పాటు ఒక కవరులో డబ్బులు పెట్టుకుని తీసుకువచ్చాడు. వీటన్నిటిని తీసుకొని వచ్చి మహాస్వామి వారి ముందుంచి స్వామివారికి సాష్టాంగం చేసాడు. మహాస్వామివారు కళ్ళతో ఆ పళ్ళాన్ని తీక్షణంగా చూసారు.
”ఆ కవరులో ఏముంది?” అని అడిగారు.
”కొద్దిగా ధనం. . . ఉంది”
“కొద్దిగా అంటే పది రూపాయలా? పదిహేను రూపాయలా?”
బహుశా ఆ న్యాయవాది అహం దెబ్బతిని ఉంటుంది. అతను ఆ జిల్లాలోనే పెద్ద పేరుమోసిన క్రిమినల్ న్యాయవాది. “ఎందుకు మహాస్వామి వారు అతని గురించి అంత తక్కువ అంచనా వేసారు."
అతను అతివినయం ప్రదర్శిస్తూ, నమ్రతతో కొద్దిగా వొంగి మృదుమధురంగా “పదుహేను వేల రూపాయలు” అని అన్నాడు.
మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. “ఇక్కడికి ఎలా వచ్చారు?” అని అడిగారు.
”మేము ఇక్కడికి కారులో వచ్చాము” అని చెప్పాడు.
”ఈ కవరును జాగ్రత్తగా నీ కారులో ఉంచుకో. పూలు పళ్ళు చాలు” అని చెప్పారు స్వామివారు.
ఆ న్యాయవాది ఆ మాటలకు గతుక్కుమన్నాడు. స్వామివారు చెప్పినట్టు చేసాడు. స్వామివారు అతనితో చాలాసేపు ప్రశాంతంగా మాట్లాడి, వారికి ప్రసాదం ఇచ్చి పంపించివేసారు. కారు వెళ్ళిపోయిన శబ్ధం వినిపించింది.
పదిహేను వేలు వద్దు అన్నందుకు పరిచారకులు బాధపడి ఉంటారని స్వామివారికి తెలియదా? తెలుసు. వారివైపు తిరిగి,
”అతను తప్పుడు కేసు వాదించి గెలిచాడు. అతను ఇవ్వదలచిన ఆ పదిహేను వేలు ఆ కేసు గెలవడం వల్ల అతనికి ముట్టిన దాంట్లోనిదే. అది పాపపు సొమ్ము. అందుకే తీసుకోలేదు” అని చెప్పారు. సేవకులకు విషయం అర్థమై సమాధాన పడ్డారు.
ఒకానొకప్పుడు శ్రీమఠం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. మఠం మేనేజరు చాలా ఆరాటపడేవారు. అటువంటి సమయంలో కూడా పరమాచార్య స్వామివారు ఆత్రుతతో అక్రమ ధనం ముట్టేవారు కాదు.
“ఒక బిందెడు పాలు పాడుచేయడానికి ఒక చిటికెడు ఉప్పు చాలు. ఒక్కడికోసం, ఒక్కదానికోసం ఆచారాలను సంప్రదాయాలను ధర్మాన్ని వదిలేస్తే అదే అలవాటు అవుతుంది” అని చెప్పేవారు స్వామి వారు.
--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।