Online Puja Services

చదువు కున్న వాడి కంటే చాకలి వాడు ఎలా నయం? - కధ!

3.17.74.181
ఒకసారి ఒక గ్రామం లో పండితులు, తర్క శాస్త్రజ్ఞులు, మీమాంసకులు ఇలా అందరూ కలిసి ఓ ఇంటి అరుగు మీద సభ జరుపుకుంటున్నారు.
అటు జరిగి ఇటు జరిగి వాళ్ల చర్చ ‘వైకుంఠం ఎక్కడ ఎంత దూరం లో ఉండి ఉంటుంది?‘ అనే విషయం వైపు జరిగింది.

ఒక పండితుడేమో వైకుంఠం కొన్ని వేల కోట్ల ఖగోళాలకు అవతల నిజం గా ఉన్న ఒక పాల సముద్రం లో ఉన్నదన్నాడు. తార్కికుడేమో అలా గాదు చంద్రుడు లక్ష్మీ దేవి తో పాటే పుట్టాడు ఆయనని మనం రోజూ చూడ గలుగు తున్నాము.

తన అక్క లక్ష్మీదేవికి దూరం గా చంద్రుడు ఉండడు కాబట్టి వైకుంఠం ఎక్కడో చంద్ర మండలానికి అవతల వైపు ఉండచ్చు అని తార్కికం గా చెప్పాడు. అదే గ్రామం లో ఒక చాకలి వ్యక్తి నివసిస్తున్నాడు. అతడు తన బట్టలను తీసుకుని చెరువుకు పోతూ ఈ పండితుల నందరినీ గమనించాడు. తన దారిన తాను వెళ్లి పోయాడు. సాయంత్రం అతడు తిరిగి వస్తూ ఆ పండితులు ఇంకా గట్టి గా వాదించు కుంటూనే ఉండడం గమనించాడు.

‘ఈ పండితులు ఉదయం నుండీ సాయంత్రం దాకా ఏం వాదించు కుంటున్నారా!‘ అని సందేహం వచ్చి వాళ్లని వెళ్లి కారణం అడిగాడు. వాళ్లు ‘మేం వైకుంఠం ఎక్కడ ఉందో వాదించు కుంటున్నాము‘ అంటే
అతడు తల గుడ్డ తీసి తన తలగోక్కుని. ‘ఇంత మాత్రం దానికి ఉదయం నుండి సాయంత్రం దాకా వాదించు కోవాలా బాబయ్యా?!‘ అని ఆశ్చర్యం గా ఆడిగాడు. దాంతో ఈ సారి ఆశ్చర్య పోవడం ఆ పండితుల వంతయింది. "అంటే ఏంటి?! నీకు వైకుంఠం ఎక్కడుందో తెలుసా?! ఇంత చదువు కున్నాము మాకే తెలియని అతి సూక్ష్మ మైన ఈ శాస్త్ర రహస్యం నీకెలా తెలుస్తుంది... పో పో నీ పనిచేసుకో..." అని ఈసడింపు గా పలికారు.

"అయ్యా! నేను తమ రంత చదువుకో లేదండీ. కానీ నాకు వైకుంఠం ఎక్కడుందో చూచాయ గా తెలుసండీ... నేను మా పంతు లోరు మొన్నీ మధ్య బాగోతం (భాగవతం) చెబుతా ఉంటే ఇన్నా నండీ బాబయ్య! మా పంతు లోరు చెప్పారు. 

ఆ ఏనుగు (గజేంద్రుడు) ప్రాణంబుల్ ఠావుల్ దప్పె మూర్చవచ్చె... అని, మరంత మూర్చ వచ్చే పరిస్థితుల్లో మాటలే రావు గదా బాబయ్యా. మనం చావ బోయె మనిషి చెప్పే మాటలు వినాలంటే నోటి దగ్గర చెవి బెడితే గానీ వినబడవు గదా బాబయ్యా! మరి ఆ ఏనుగు చాలా బలహీనం గా అరిచింది గదా...

‘రావే ఈశ్వరా... రావే వరదా.... రావే గోవిందా...‘ అని అయినా గూడా ఆ ఏనుగు మాటలు ఆ వైకుంఠయ్య కు వినపడ్డాయి అంటే బహుశా ఆ వైకుంఠం ఇక్కడే ఎక్కడో మహా అయితే ఓ నాలుగిళ్ల అవతల ఉండుంటుందండీ‘ అని చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు.

ఎన్నో శాస్త్రాలను అభ్యసించి వైకుంఠం ఎక్కడ ఉందో తెలియని చదువుకున్న పండితులకంటే,
‘తన పంతులయ్య చెప్పిన భక్తి వెనుక తన దైన నమ్మకం పెట్టు కుని వైకుంఠం మా ఇంటి పక్కనే ఎక్కడో ఉంది. అని తార్కికం గా సమాధాన పడి తన రోజు వారీ పని (కర్మయోగం) చేసు కుంటున్న చాకలి వాడు కొన్ని లక్షల రెట్ల నయం‘ అని అప్పట్నించీ ‘చదువు కున్న వాని కంటే చాకలి వాడు నయం‘ అన్న నానుడి పుట్టింది. 

"మన మనసు లో ఉన్నది వదిలేసి ఎక్కడో వెతుకుతున్న దైవం మనలో లేడా" మనలో నిత్యం అయిన ఆత్మ నిత్యం, సత్యం, సత్యము. 

సర్వే జనా సుఖినోభవంతు

- సారధి అక్షింతల 

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha