కారుణ్యానికి కానుక
కారుణ్యానికి కానుక
అయోధ్య మహారాజైన దిలీపుడు మగధ రాకుమార్తెను
వివాహం చేసుకొని మనునీతిని తు.చ. తప్పక పాటిస్తూ రాజ్యపాలన సాగిస్తూ వచ్చాడు. పలు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఆ దంపతులకు మగసంతతి కలుగలేదు. దానం, పూజలు, తీర్థయాత్రలు నిష్ఠతో ఆచరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దాంతో వారు బాగా దిగులు చెందారు.
వసిష్ఠ మహర్షి దిలీపుని కులగురువు. ఒక సందర్భంలో వసిష్ఠుడు ఆ దంపతులను తన ఆశ్రమానికి ఆహ్వానించాడు. అప్పుడు వారు ఆయనకు తమ కొరతను విన్నవించుకొన్నారు. వసిష్ఠుడు దీర్ఘదర్శి కావడం వలన తన దివ్యదృష్టితో కారణాన్ని తెలుసుకొన్నాడు.
“దిలీపా! నువ్వు ఒకప్పుడు దేవలోకానికి వెళ్ళావు. అప్పుడు కల్పవృక్షం కింద నిలబడి ఉన్న కామధేనువును అలక్ష్యం చేశావు. ఆ దేవతా గోవును దర్శించి ఆశీస్సు పొందని కారణాన కోపం పూనిన కామధేనువు నిన్ను శపించింది. ఆ కారణంగానే నీకు పుత్రభాగ్యం ఇంతదాకా లేకుండా పోయింది. కామధేనువును ప్రసన్నం చేసుకోవడానికి నువ్వు ఏదైనా చేస్తే శాపం తీరి నీకు పుత్రోదయం అవుతుంది” అని వసిష్ఠుడు చెప్పాడు.
అది విని రాజు, “మహర్షివర్యా! ఏం చేస్తే కామధేనువు కోపం పోయి నా పట్ల ప్రసన్నమౌతుందో మీరే సెలవివ్యండి” అని వినమ్రంగా అడిగాడు.
"కామధేనువుకు నందిని అనే ఒక దూడ ఉంది. అది నా ఆశ్రమంలోనే ఉంటున్నది. నందిని ఇప్పుడు నదీ తీరంలో పచ్చిక మేస్తూ ఉండి ఉంటుంది. నందిని ఆలనాపాలనా జాగ్రత్తగా చూసుకొంటూ దానికి ఎలాంటి హాని వాటిల్లకుండా పరిరక్షిస్తూ ఉంటే తల్లియైన కామధేనువు సంతసించి నీ పట్ల ప్రసన్నురాలౌతుంది; నీ శాపం తీరుతుంది” అని వసిష్ఠుడు మార్గాంతరం చెప్పాడు.
వెంటనే దిలీపుడు నందినిని వెతుకుతూ బయలుదేరాడు. పరిరక్షణకై విల్లంబులు ధరించి మరీ వెళ్ళాడు. ---
నదీ తీరంలో పచ్చిక మేస్తూన్న నందినిని చూసిన దిలీపుడు ఆతురతతో దానిని సమీపించాడు. నందినిని తన అంతఃపురానికి తోడ్కొని పోవాలని ఆయన అభిలషించాడు. కాని ఆయనను చూడగానే
దూడ పరుగెత్త నారంభించింది. దిలీపుడు నందిని వెంట తనూ పరుగెత్తాడు. ఆ దూడ కొంతదూరం పరుగెత్తి, ఆగి ఒకింత పచ్చిక
మేసి మళ్ళీ పరుగెత్తసాగింది. దిలీపుడు కూడా విసుగు, అలుపు చెందకుండా దాన్ని అనుసరిస్తూ పరుగెత్తాడు.
అలా పరుగెత్తిన నందిని చివరకు హిమాలయ పర్వత సానువును చేరి అక్కడ ఒక చెట్టు కింద నిలిచి విశ్రాంతి తీసుకోసాగింది. దాన్ని పట్టుకోవడానికి అదే అదను అని దిలీపుడు గ్రహించాడు. కాని ఎమాత్రం ఎదురు చూడని రీతిలో హఠాత్తుగా పక్కనున్న పొదలో
నుండి సింహం ఒకటి దూకి దూడపై దాడి చేయబోయింది. భయాందోళనలతో దిగ్డమ చెందిన దిలీపుడు తక్షణమే బాణం సంధించి సింహాన్ని నేలకూల్చాలని ప్రయత్నించాడు.
అదే సమయంలో ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది సింహం తన రూపం విడిచి ఒక అసురుడుగా మారిపోయింది. తరువాత వికటాట్టహాసం చేస్తూ ఆ అసురుడు మాట్లాడసాగాడు.
“ఏయ్, దిలీపా! నన్ను ఎవరనుకొంటున్నావు? పరమేశ్వరుని అష్టమూర్తులలో ఒకణ్ణి నేను. నా పేరు కుంభాసురుడు” అంటూ అతడు దర్పంతో కేక పెట్టాడు.
“నీకు ఇక్కడ ఏం పని?” అంటూ దిలీపుడు కోపంతో అడిగాడు.
“అలా అడుగు! ఈ చెట్టు పార్వతీదేవికి అమిత ప్రీతికరమైనది. తన కుమారుడైన కుమారస్వామి మీద కన్నా ఆమెకు ఈ చెట్టు పట్ల అధిక ప్రీతి ఉందనడం అతిశయోక్తి కాదేమో! ఈ చెట్టును కాపాడుతూ ఉండమని ఆమె నన్ను ఆజ్ఞాపించింది. ఈ చెట్టుకు వీపును రుద్ది బెరడును విదిల్చే ఏ మృగాన్నైనా చంపి తినడం నాకు రివాజు. చెట్టు నీడన నిలబడటం, పడుకోవడం, పచ్చిక మేయడం వంటి ఏ పనినీ నేను అనుమతించను. అందుకైన శిక్ష ఆ జంతువు నాకు ఆహారం కావటమే! దూడ చేసిన నేరానికి గాను దాన్ని నేను ఇప్పుడు చంపబోతున్నాను” అంటూ గర్జించాడు కుంభాసురుడు. -
“దూడను కాపాడటం నా కర్తవ్యం, అది వసిష్ఠ మహర్షి ఆజ్ఞ కూడా” అని చెప్పాడు దిలీపుడు.
దూడను చంపడం నా హక్కు అది పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞ కూడా!" అన్నాడు అసురుడు.
"నీతో పోరాడి నా లక్ష్యాన్ని నెరవేర్చుకొంటాను” అన్నాడు వీరత్వం ఉట్టిపడే స్వరంలో దిలీపుడు.
"నాతో పోరాడుతావా?" అంటూ పరిహాపంగా నవ్వాడు ఆ అసురుడు. "నేను పరాక్రమంతో పాటు అనేక సిద్ధులు కూడా పొందిన అసురుణ్ణి, నువ్వో సాధారణ మానవుడవు. నాతో పోరాడినందున నువ్వు మాత్రమే కాదు, ఆ దూడా చావడం తథ్యం. దూడను కాపాడే ఉద్దేశం విడిచి పెట్టి ప్రాణంతో తిరిగి వెళ్ళు!”
ఆ మాటలతో దిలీపుడు హతాసుడయ్యాడు. అసురుడికి తలనొగ్గడం తప్ప మరో మార్గం ఏదీ దిలీపునికి తోచలేదు. “దూడను రక్షించాలంటే నేను ఏం చెయ్యాలి? చెప్పండి, చేస్తాను” అన్నాడు దిలీపుడు వినమ్రంగా,
"నీ అంతట నువ్వే మనస్పూర్తిగా నాకు ఆహారంగా అవాలి”
అన్నాడు అసురుడు.
ముక్కుపచ్చలారని గోదూడ అసురునికి బలి కావడం తలచి దిలీపుని మనస్సు కోభించింది. అప్పుడు అతడి మనస్సులో తను పుత్రసంతతి కోసం వ్రతంపూనిన విషయం కూడా గుర్తు లేదు. దూడ ప్రాణం రక్షింప అతడు నిశ్చయించుకొన్నాడు; తనను బలి చేసుకోవడానికి అతడు కృతనిశ్చయుడయ్యాడు. తన ఆయుధాలను కింద జారవిడిచి అసురునికి ఆహారం అవడానికి సిద్ధపడ్డాడు.
అప్పుడు ఆకాశంలో కళ్ళు మిరిమిట్లుగొల్పే జ్యోతి కనిపించింది. ఆ జ్యోతి నడుమ ఆసీనురాలైన దేవి దర్శనమిచ్చి దిలీపుడు చేతులు జోడించి దేవికి నమస్కరించి నిలబడాడు.
- “దిలీపా! నేనే కామధేనువును. లక్ష్మి అని కూడా నను పేర్కొనడం కద్దు. ఎవరి మనస్సు ప్రాణికోటి పట్ల కారుణ్యం వహిస్తుందో వారిపై నా అనుగ్రహం ప్రసరిస్తుంది. దూడను రక్షింప నీ ప్రాణాన్ని అల్పంగా పరిగణించావు; పుత్రసంతతి అనే నీ ధ్యేయాన్ని సైతం విస్మరించావు. నీ కారుణ్యానికి సంతసించి ప్రసన్నురాలినయ్యాను. త్వరలోనే నీకు సత్త్వగుణ సంపన్నుడైన పుత్రుడు జన్మిస్తాడు. నీ రాజ్యం సతతం సుభిక్షంతో అలరారుతుందిగాక!” అని వరం అనుగ్రహించి అంతర్ధానమైంది కామధేనువు.
దిలీపుడు చెట్టు కింద చూశాడు. అక్కడ అసురుడుగాని, దూడగాని కనిపించలేదు.
కామధేనువు వర అనుగ్రహంతో అనతికాలంలోనే దిలీపునికి రఘువనే పుత్రుడు జన్మించాడు; ఆతడి కీర్తి చంద్రికలు దశదిశలా ప్రసరించాయి. ఆ కారణంగా వారి వంశాన్ని రఘువంశమని కూడా పేర్కొన్నారు.