Online Puja Services

దాసానుదాసుడు - హరిదాసుడు

3.135.247.17

దాసానుదాసుడు - హరిదాసుడు

మౌజీకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించారు. ఆ గ్రామం లోనివారు ఎవరైనా దయతలచి పెట్టిన ఆహారం తింటూ, రాత్రులు దేవాలయంలోను, సత్రాలలోను, వీధి అరుగులమీదా నిద్రించేవాడు. ఇలా పది సంవత్సరాలు గడిచిపోయాయి. 

ఆ గ్రామంలోని ఒక ధనికుడు అన్నవస్తాలిచ్చి నెలకు రెండు రూపాయల వేతనంతో మౌజీని తన పశువుల కాపరిగా నియమించుకున్నాడు. మౌజీకి ఆ రోజునుంచి అడవికి పశువులను తోలుకువెళ్ళి మేపడం, ఆ ఇంట పెట్టిన ఆహారం తినడం, పశువుల కొట్టంలో నిద్రించడం దినచర్యగా అయిపోయింది. 

ఒకరోజు యథాప్రకారం పశువులను తోలుకొని అడవికి వెళ్ళాడు. పశువులు పచ్చికను మేస్తున్నాయి. మౌజీ సమీపంలోని నది ఒడ్డున ఉన్న చెట్టు క్రింద కూర్చుని పాటలు పాడుకోసాగాడు.

ఆ సమయంలో పండితుడొకడు ఆ మార్గం గుండా పోతూ ఆ చెట్టు వద్దకు వచ్చాడు. నదిలో స్నానంచేసి, తన వద్ద ఉన్న సంచీలోని పొడిబట్టలను ధరించి, తడిబట్టలు ఆరవేసుకొని చెట్టునీడన విశ్రమించాడు. కళ్ళు, ముక్కు మూసుకొని కాస్సేపు ధ్యానం చేశాడు. ధ్యానం చాలించి ఆరబెట్టిన బట్టలను సంచీలో పెట్టుకొని వెళ్ళిపోవటానికి సిద్ధమైనాడు.

అంతదాకా పండితుడి చర్యలు గమనిస్తున్న పశువుల కాపరి మౌజీ పండితుణ్ణి సమీపించి, నమస్కరించి, “అయ్యా, మీరెవరు? ఎక్కణ్ణుంచి ఎక్కడకు వెళుతున్నారు? మీరింతవరకు కళ్ళు మూసుకొని ఏం చూశారు? కాస్త వివరంగా చెప్పి నా సందేహాలు తీర్చండి” అంటూ వినయంగా అడిగాడు.

అందుకు ఆ పండితుడు మౌజీని తేరిపార చూసి, “భగవదనుగ్రహం కలుగుగాక” అంటూ ఆశీర్వదించాడు. అతడి వినయవిధేయతలకు సంతోషించాడు. తానొక పండితుడననీ, కేశవపురంనుంచి దౌలతాబాదు వెళుతున్నాననీ, అక్కడ తనకు శిష్యులు అనేకులున్నారనీ, తను కళ్ళు మూసుకొని దేవుణ్ణి చూశాననీ చెప్పి ఆ పండితుడు తనదారిన వెళ్ళిపోయాడు. 

పండితుడు వెళ్ళిపోయాక మౌజీకి దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగింది. వెంటనే నది వద్దకు పరుగెత్తాడు. 

కట్టుకొన్న బట్టలు విడిచి గట్టున పడేశాడు. నదిలో స్నానం చేసి తిరిగి వచ్చాడు. ఒళ్ళు తుడుచుకొని, ఆ బట్టలనే ధరించాడు. కళ్ళు మూసుకొని చెట్టునీడన కూర్చున్నాడు. అలా కూర్చోగానే దేవుడు కనిపిస్తాడని భావించిన మౌజీ నమ్మకం వమ్మయింది. కళ్ళు, ముక్కు మూసుకోవడంలో లోపం జరిగిందేమోనని, ఈసారి గట్టిగా మూసుకొన్నాడు. చీకటి తప్ప అతడికి మరేదీ కనిపించలేదు. ఐనప్పటికీ దేవుణ్ణి చూడకుండా అక్కడ నుంచి కదలనని పట్టుబట్టి కూర్చున్నాడు. కాస్సేపటికి ఊపిరాడక ప్రాణంపోయే పరిస్థితి ఎదురైంది. 

జగత్తు అంతటా సర్వాంతర్యామిగా ఉన్న భగవంతుడికి ఈ పశువుల కాపరి విషయం తెలియకపోతుందా? పండితుడు పలికిన మాటల్లో నిజమెంత ఉందో గ్రహించలేని అమాయకుడు, పట్టుదలతో కూర్చున్న మౌజీని కాపాడాలనే ఉద్దేశంతో పరుగెత్తుకొని అక్కడకు వచ్చి, మౌజీ 
ముందు నిలబడి, “బాలకా! దైవదర్శనం కోసం పట్టుదలతో కూర్చున్న నీ కోర్కెను తీర్చడానికి వచ్చాను. కళ్ళు తెరచి చూడు” అంటూ తన దివ్యహస్తాన్ని మౌజీ తలపై ఉంచాడు. 

వెంటనే మౌజీ కళ్ళు తెరచి తన ఎదుట సాక్షాత్కరించిన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న మూర్తిని చూశాడు. ఆశ్చర్యపోతూ “ఎవరు నువ్వు?” అని అడిగాడు. 

“ఎవరిని దర్శించాలని కళ్ళు, ముక్కు మూసుకొని దీక్షతో కూర్చున్నావో ఆ భగవంతుణ్ణి నేనే.”

“ఓహో! భలే! నువ్వు దేవుడవా? అందుకు ఆధారం ఏమిటి?” 

చిరునవ్వుతో భగవంతుడు, “నీకు నమ్మకం కలగడానికి ఏం చేయాలో తెలియచేయి. అలాగే జరుగుతుంది” అన్నాడు. 

అందుకు మౌజీ ఏదో జ్ఞాపకం రాగా, ఇలా అన్నాడు: “నువ్వు నన్ను మోసం చేయలేవు. ఇంతకు క్రితం ఒక పండితుడు దేవుణ్ణి చూశానని నాతో చెప్పి వెళ్ళాడు. ఆయన ఎంతో దూరం వెళ్ళి ఉండడు. ఒక్క పరుగులో పోయి ఆయన్ను పిలుచుకొని వస్తాను. తాను చూసిన దేవుడు నువ్వేనని పండితుడు నిర్ధారిస్తేనేగాని నమ్మను. అంతదాకా నువ్వు ఇక్కడే ఉండాలి.”

భగవంతుడు అందుకు అంగీకరించాడు. కాని తాను తిరిగి వచ్చే దాకా భగవంతుడు ఉండడేమోనని మౌజీకి అనుమానం వచ్చింది. వెంటనే అక్కడున్న తీగలతో భగవంతుణ్ణి ఒక చెట్టుకు గట్టిగా కట్టేసి పండితుడి కోసం పరుగెత్తాడు. 

కొంత దూరం పరుగెత్తి మొత్తానికి పండితుణ్ణి చూడగలిగాడు. "స్వామీ! కాస్త ఆగండి. మీరు వెళ్ళాక దేవుడు వచ్చాడు. అతడే దేవుడనే నమ్మకం కలుగక ఆయన్ను చెట్టుకు కట్టేసి వస్తున్నాను. నాతో వచ్చి
మీరు చూసిన భగవంతుడు ఆయనో కాదో తెలుపండి” అంటూ ఎలుగెత్తి పిలిచాడు.

తనను పిలుస్తూ పశువుల కాపరి రావడం పండితుడు చూశాడు. తన వద్దవున్న సంచిని దొంగిలించడానికి ఏదో నెపంతో వస్తున్నాడని సందేహపడ్డాడు. ఆ ఆలోచన రాగానే పరుగెత్తడం ప్రారంభించాడు.

మౌజీ అంతకంటె వేగంగా పరుగెత్తి పండితుణ్ణి అందుకోగలిగాడు. పండితుడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వదలక ఉడుంపట్టు పట్టి భగవంతుణ్ణి కట్టివేసిన చెట్టు వద్దకు తీసుకువెళ్ళాడు.

“స్వామీ! ఆ చెట్టుకేసి చూడండి. భగవంతుణ్ణి చెట్టుకు కట్టి వేశాను. మీరు ధ్యానంలో చూసిన దేవుడు ఆయనో కాదో చెప్పండి” అని అడిగాడు.

పండితుడి కళ్ళకు భగవంతుడు కనబడలేదు. చెట్టుకు చుట్టిన తీగలు మాత్రమే కనిపించాయి. నాలుగువైపులా పరకాయించి చూసి, “భగవంతుడెక్కడ” అని మౌజీని అడిగాడు.

పశువుల కాపరి నవ్వుతూ, “ఏమిటి స్వామీ! పగటివేళ తెల్లని ఆవులనే గుర్తించని మీరు అమావాస్య చీకటిలో నల్లని దున్నలను గుర్తించగలరా? కళ్ళ ఎదుటే ఉన్న భగవంతుడే కనిపించడం లేదా? అదుగో చూడండి; ఆ చెట్టుకు తీగలతో కట్టివేశాను; మీరు చూసిన భగవంతుడు ఆయనో కాదో తేల్చి మీ దారిన మీరు వెళ్ళండి” అన్నాడు.

పండితుడు మౌజీని త్వరగా వదిలించుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో, అతడికి భగవంతుడు కనిపించకపోయినా చెట్టుకు కట్టివేయబడ్డ భగవంతుడనే తాను కూడా చూశానని బొంకి, తన దారిన వెళ్ళిపోయాడు.

పండితుడు వెళ్ళిపోగానే పశువుల కాపరి మౌజీ చెట్టువద్దకెళ్ళి భగవంతుడి కట్లు విప్పి, సాష్టాంగనమస్కారం చేశాడు.

అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు: “బాలకా! నన్ను పూర్తిగా నమ్మినందుకు నీకు దర్శనం ఇచ్చాను. ఆ పండితుడు భక్తుడు కాడు. నా పట్ల పరిపూర్ణ విశ్వాసం లేనివాడు. అతగాడికి నేనెన్నడూ కనిపించలేదు. ధ్యానంలో నన్ను చూశానని అబద్దం చెప్పాడు. ఇప్పడుకూడ నీకు మాత్రమే కనిపించాను. ఆ పండితుడికి కనిపించలేదు. చెట్టుకు కట్టివేయబడ్డ నన్ను చూశానని చెప్పడంకూడ అబద్దమే. అతడు పచ్చి మోసగాడు. నువ్వు నన్ను చూశావు. నా దర్శనం చేసుకొన్నవారిని ఉత్తచేతులతో పంపను. కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను.”

"దేవా! ధన్యుణ్ణి. నేను స్నానం చేసి ధ్యానంలో కూర్చోగానే మీరు కనబడాలని కోరుకొంటున్నాను. అనుగ్రహించండి. మీరు మోసగాడని చెప్పిన పండితుడి మూలంగానే నాకు భగవంతుణ్ణి చూడాలనే కోరిక కలిగింది. పట్టుదలతో కూర్చుని మీ దర్శనం చేసుకోగలిగాను. అందుచేత ఆ పండితుణ్ణి గురువుగా భావిస్తున్నాను. ఆయనకుకూడ మీ దర్శన భాగ్యం కలిగించండి. ఇంతకంటే నాకు ఏ కోరికా లేదు” అన్నాడు వినయంగా మౌజీ.

భగవంతుడు ఆ బాలుడి కోర్కెలు విన్నాడు. చిరునవ్వుతో “వత్సా, మౌజీ! నీ ఉన్నత భావాలను మెచ్చుకొంటున్నాను. లోకంలో గురువు వల్ల శిష్యుడు తరించడం చూస్తున్నాం. అందుకు భిన్నంగా నీవల్ల నీ గురువు తరించాడు. అతడికి నాపట్ల భక్తిశ్రద్ధలు లేకున్నప్పటికీ నీ కోర్కెప్రకారం సద్గతిని ప్రసాదిస్తున్నాను. మీరిద్దరూ కలిసి లోకంలో భక్తి మార్గం ప్రచారంచేసి పాపులను పునీతులుగా మార్చి జీవితాంతాన పుణ్యలోకంలో శాశ్వతంగా నివాసం చేయండి” అని చెప్పి అంతర్థానమైనాడు.

అక్కడ దౌలతాబాద్లో పండితుడు ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాడు. భగవంతుడి దివ్యమంగళ విగ్రహం కనులార గాంచాడు. బ్రహ్మానందం అనుభవించాడు. తనకు భగవద్దర్శనం కలగడానికి కారణ భూతుడు పశువుల కాపరి మౌజీయే అని భగవంతుడి వలన తెలుసుకొని ఆ పిల్లవాణ్ణి కలుసుకొనే నిమిత్తం బయలుదేరాడు. 

కొద్దిరోజుల్లోనే గురుశిష్యులు కలుసుకొన్నారు. పరస్పరం నమస్కరించుకొన్నారు. గౌరవించుకొన్నారు. నువ్వు గురువంటే నువ్వే గురువనీ, భగవంతుడి దర్శనం నీ మూలంగానే కలిగిందంటే నీ మూలంగానే కలిగిందనీ కొంచెం సేపు వాదించుకొన్నారు. చివరకు వారిద్దరూ కలిసి భక్తి గీతాలు గానం చేస్తూ లోకంలో దైవభక్తిని ప్రచారం చేయటానికి కంకణం కట్టుకొన్నారు. వెంటనే సన్న్యాసి ఉడుపులు ధరించారు. పండితుడు తన పేరును '
దాసానుదాసు'డనీ, మౌజీ తన పేరును 'హరిదాసు' అనీ మార్చుకొన్నారు.

హరిదాసు తంబూరా మీటుతూ పాడేవాడు. దాసానుదాసుడు తాళం వేస్తూ పాడేవాడు. వారి పాటలకు శిలలు కరిగాయి. కఠిన హృదయాలు మైనం ముద్దలయ్యాయి. భక్తులు పరవశించారు. జనసామాన్యం సైతం భగవంతుణ్ణి చేరుకొనే మార్గం తెలుసుకొన్నారు. ఆ గురుశిష్యులు ధన్య జీవులైనారు.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore