Online Puja Services

అశాంతికి కారణం

3.135.190.81

ఇదొక సందేశాత్మక నీతి కథ, సమయం తీసుకుని వీలు చేసుకొని తప్పక చదవండి.

ఒక రాజ్యంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను రాజభవంతి దగ్గరలో ఉంటూ రోజూ, ఆ భవంతిలోని రాజుగారిని దూరం నుండి చూస్తూ ఉండేవాడు.
ఒకరోజు రాజుగారు అందరికీ విందు ఇస్తున్నారు అనే వార్త విన్నాడు.


ఇది విన్న ఆ బిచ్చగాడికి ఒక ఆశ పుట్టింది.

తన దుస్తులు చూసుకున్నాడు అన్ని చిరిగిపోయాయి. ఎలాగైనా రాజుగారి నుండి మంచి దుస్తులు సంపాదించాలని అనుకున్నాడు.
రాజభవనము దగ్గరకి వెళ్లి కాపలా వారిని బ్రతిమిలాడి, దర్బారులోకి ప్రవేశము సంపాదించాడు.

ఎంతో ధైర్యం కూడగట్టుకొని, చాలా వినయంగా రాజు దర్భారులోకి ప్రవేశించాడు.

అతన్ని చూడగానే రాజు. “నీకేమి కావాలి” అని అడిగాడు. దానికి ఆ బిచ్చగాడు రాజు గారికి వంగి వంగి దండాలు పెడుతూ ఇట్లా అన్నాడు.
“రాజా! నాకు మీరు ఇస్తున్న విందుకు రావాలని వుంది. దయచేసి తమ పాత దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను. నా దగ్గర చినిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి."

రాజుగారు వెంటనే తన పాత దుస్తులను తెప్పించి బిచ్చగాడికిస్తూ “ఈ దుస్తులు చినిగిపోవు, మాసిపోవు వాటిపై దుమ్ము పడదు, మరకలు అంటవు ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. నీవు ఎప్పటికి వీటిని ధరించవచ్చు”. అన్నాడు.

బిచ్చగాడి కళ్ళ వెంట నీరురాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు.

వెంటనే ఆ దుస్తులు తన గదికి తెచ్చుకొని ధరించి అద్దములో చూచుకొని మురిసిపోయాడు బిచ్చగాడు .

అయితే రాజు గారు ఎంత చెప్పినా, బిచ్చగాడికి ఆ రాజూ గారి దుస్తులు చినిగిపోతే ఎట్లా అనే భయం పట్టుకొంది.
ఎందుకైనా మంచిదని పాతదుస్తులన్నీ ఒక మూట కట్టి తనవెంటనే ఉంచుకొని తిరిగేవాడు. ఎందుకంటే రాజుగారి దుస్తులు చినిగితే తన పాత దుస్తులు ధరించవచ్చు అని.

రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపు కూడా తనకి ఆనందంగా లేదు. బైట ఎక్కడో దాచిన తన పాత దుస్తుల మూట ఎవరన్నా ఎక్కడన్నా పారవేస్తారేమో అని భయం తనకి.

క్రమంగా రాజుగారి మాటలలోని సత్యం తెలిసివచ్చింది. ఎన్ని రోజులు ధరించినా దుమ్ము పడలేదు, అవి కొత్తవిగానే వున్నాయి. కానీ తన పాత దుస్తులపై మమకారంతో ఆ మూటను మాత్రం అస్సలు వదిలేవాడు కాదు. అతని తోటి వారు అతనిని చూసి, ధరించిందేమో రాజుగారి దుస్తులు మోసేదెమో పాత గుడ్డలు అని హేళన చేస్తూ “పీలిక గుడ్డల మనిషి” అని తనకి పేరు పెట్టారు. 

చివరగా ఆ బిచ్చగాడు చనిపోవుటకు సిద్ధముగా ఉండి మంచం పై నుండి లేవలేక పోయేవాడు. పక్కనున్న జనాలు అతని తలగడ దగ్గర ఉన్న పాతబట్టల మూటను చూశారు. అది చూసి, ఎంతో విలువైన చిరగని తరగని దుస్తులు ధరించినా కూడా బిచ్చగాడికి ఆ పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు. వాటి సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపి, ఏ రోజు సంతోషమును పొందలేదు గదా! అని బాధ పడ్డారు.


ఇందులోని నీతి :
ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు! మనం అందరమూ కూడా ఈ అనుభవాల మూటలను పట్టుకొని, వదలకుండా ఇప్పటికి ఎప్పటికి అలానే మోస్తూ ఉంటున్నాము.

మనం మోస్తున్న మూటలో ఉన్నవి, అవి ఏమిటంటే శత్రుత్వము, ఈర్ష్య, ద్వేషము, కోపము, తన భాధలు మొదలగునవి ఇంకా ఎన్నో జ్ఞాపకాలు. అంతే కాదు ఈ భావనలతో మాటి మాటికీ దుర్గుణాలను, దుఃఖాన్ని గుర్తుతెచ్చుకుంటూ జీవితంలోని అందమైన, సంతోషమైన వాటిని అనుభవించలేకపోతున్నాం,

ఇలా ఉంటే జీవితంలో వేటిని గుర్తించలేము ఆనందించలేం కూడా! ఎప్పుడో, ఎక్కడో జరిగిన సంఘటనలను ఎక్కడకిక్కడ, ఎప్పటికప్పుడు వదలకుండా ఒక పెద్ద పనికిరాని పాతబట్టల మూటలాగా, ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ ఉండటమే అనేక బాధలకు, మనలోని అశాంతికి కారణము.


సర్వేజన సుఖినోభవంతు..
శివాయ గురవే నమః 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya