Online Puja Services

అసలైన ధనవంతుడు ఎవరు ?

3.22.98.193

అసలైన ధనవంతుడు ఎవరు ?
- లక్ష్మి రమణ 

 జీవుల కర్మఫలాలే వారి జన్మజన్మలకీ కారణమవుతాయి . పాపపుణ్యాల ఆధారంగానే ఆ జీవికి ఉత్తమమైన / నీచమైన గతులు సంప్రాప్తిస్తుంటాయి. అందుకే పెద్దలు ఎప్పుడూ మంచి చేయమని , మంచిని మాత్రమే చేయమని చెబుతుంటారు . పుణ్యం ఎక్కువగా చేస్తే, స్వర్గానికి వెళతారని , తరగని స్వార్థంతో పాపాలు మాత్రమే ఖాతాలో వేసుకుంటే, నరకబాధలు తప్పవని మన ధర్మం చెబుతుంది.  ధర్మాచరణ, సత్యాచరణ వలన మనకి లభించే కీర్తి ఈ భువి మీద నిలిచి ఉన్నంతవరకూ, మనకి పుణ్యలోకప్రాప్తి కలుగుతుందని మహాభారతం చెబుతోంది . స్వయంగా మార్కండేయ మహర్షి, ధర్మరాజుకి  చెప్పిన వృత్తాంతం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది . ఆ కథని ఇక్కడ తెలుసుకుందాం .

ధర్మరాజుకి పేరుకు తగ్గట్టే ధర్మ చింతన చాలా ఎక్కువ. ఆయన మార్కండేయ మహర్షిని ఇలా ప్రశ్నించారు .  “మహర్షీ ! నాకు తెలిసినంతవరకు మీరు మాత్రమే చిరంజీవి. ఇంకెవరైనా చిరంజీవులు ఈ భువిపై ఉన్నారా?”  అప్పుడు మహర్షి, “ ఓ రాజా ! దేహము అశాశ్వతమైనది.  శాశ్వతమైన జీవుడు ఎప్పుడూ చిరంజీవే ! కానీ ఆ జీవుడు చేసుకున్న కర్మల పైన అతని గతి ఆధారపడి ఉంటుంది . ధర్మానుసరణ కలిగిన జీవుల కీర్తి ఎప్పటివరకూ అయితే ఈ భూమిమీద నిలిచి ఉంటుందో , అప్పటివరకూ ఆటను ఉత్తమగతులని అనుభవిస్తాడు . రాజా నాకు తెలిసిన ఇంద్రద్యమ్నుడు అనే రాజు కథని నీకు వినిపిస్తాను . శ్రద్ధగా ఆలకించు .” అంటూ ఇలా చెప్పసాగారు. 

ఇంద్రద్యుమ్నుడు తన రాజ్యపాలనలో అడిగినవారికి  అడిగినట్లు దానధర్మాలు చేసి, ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందాడు. లెక్కగట్టలేనన్ని గోదానాలు, భూ దానాలు, హిరణ్య దానాలు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్యసంపదను పొందాడు. అంతేకాక ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసాడు. అతని రాజ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా ప్రజారంజకంగా పాలన చేసాడు. 

ఇంద్రద్యుమ్నుడు మరణించాక అతని పుణ్యనిధి ప్రభావంతో దేవదూతలు వచ్చి సరాసరి స్వర్గలోకానికి తీసుకువెళ్ళారు. అయితే, కొన్ని సంవత్సరాలు గడిచేసరికి భూలోకంలో ఇంద్రద్యుమ్నుని కీర్తి మాసిపోయి, ఆ పేరుగల రాజు ఒకప్పుడుండేవాడన్న సంగతి కూడా ప్రజలకు గుర్తు  లేకుండా పోయింది.

 అప్పుడు, ఆ పుణ్యలోకంలో దేవదూతలు ఆయన్ని పిలిచి, “అయ్యా ! మీరు స్వర్గంలో గడిపిన కాలానికి, భూలోకంలో మీరు చేసుకున్న పుణ్యానికి సరిపోయింది. మీ కీర్తి అంతరించిపోయింది . కాబట్టి , ఇక మీరు ఇక్కడ ఉండటానికి అవకాశంలేదు. మీరు ఇంకా ప్రజల హృదయాల్లో నిలిచే ఉన్నారని నిరూపించ గలిగితే, మళ్ళీ రావచ్చు” అని చెప్పారు. మరుక్షణం ఇంద్రద్యుమ్నుడు,  వెంటనే భూలోకానికి దిగిపోవడం మొదలు పెట్టారు . 

ఆయన పుణ్యశీలుడు కనుక సరాసరి మార్కండేయ మహర్షి దగ్గరకు చేరుకున్నారు.  “మహర్షీ! నన్ను దేవతలు భూలోకానికి పంపించేశారు. నా పుణ్యం అయిపోయిందన్నారు. నేను ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానో చూడండి.  మీరే దీనికి పరిష్కార మార్గం చూపండి” అని వేడుకున్నారు .  దానికి మార్కండేయ మహర్షి, “మహారాజా ! ఇదే సృష్టి వైచిత్య్రం. అయినా ఈ లోకంలో మీ కీర్తి ఉన్నంతకాలం మీరు పుణ్యాత్ములే అవుతారు. మీరు చేసిన పుణ్యకార్యాలను బట్టి యశోవంతులుగా మీ కీర్తి ఉంటుంది.దిగులు పడకండి. అసలీ భూలోకంలో ఎవరైనా, మిమ్మల్ని , మీ వితరణశీలతని గుర్తించగలరేమో చూడాలి .”  అన్నారు . 

ఆయన సలహాని అనుసరించి హిమాలయ పర్వత ప్రాంతలో ప్రావారకర్ణం అనే వృద్ధ గుడ్లగూబని కలిసి తనని గుర్తు పట్టగలడేమో చూద్దామని వెళ్లారు. ఆ గుడ్లగూబ ఇంద్రద్యమ్నుని గుర్తుపట్టలేకపోయింది.  తనకన్నా ప్రాచీనుడైన నాడీజంఘమనే  కొంగదగ్గరికి వెళ్ళమని చెప్పింది . ఆ కొంగ ఇంద్రద్యుమ్నము అనే సరోవరములో ఉన్నదని చెప్పింది. 

బ్రహ్మదేవుని స్నేహితుడు కూడా అయిన ఆ నాడీజంఘుమనే కొంగుని కలిశారు ఇంద్రద్యుమ్నుడు. ఆ బకరాజు కూడా ఆయన్ని గుర్తుపట్టలేక పోయింది. ఆ కొంగ తనకన్నా ప్రాచీనుడైన ఆకూపారమనే తాబేలుని పిలిచారు .  ఆ తాబేలు ఇంద్రద్యుమ్నుని చూడగానే చెమ్మగిల్లిన కళ్లతో  “అయ్యా! వెయ్యి యజ్ఞాలు సాంగంగా చేసి, వెయ్యి యూపస్తంభాలు కట్టించావు. ఆ యజ్ఞదానాలలో లెక్కకట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానం ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి యింత సరోవరం అయింది. ఇది అంతా నీ చలవే! నిన్ను ఎలా మరిచిపోగలను ఇంద్రద్యుమ్న మహారాజా!” అని నమస్కారం చేసింది . ” 

మరుక్షణం దేవతలు దివ్యవిమానంలో దివి నుండీ దిగివచ్చి , ఇంద్రద్యుమ్నుని స్వర్గానికి తీసుకొని వెళ్ళారు.” అని మార్కండేయ   మహర్షి ఇంద్రద్యుమ్నుని కీర్తిని గురించి ధర్మరాజుకి చెప్పారు . 

కాబట్టి ధర్మకార్యాలు చేయడం వలన నిలిచి ఉండే కీర్తి, పుణ్యమూ మాత్మే ఈ దేహానంతరం మనతో వచ్చే సంపదలు . అవి మాత్రమే నిజమైన సంపదలు. ఆ సంపదని అనంతంగా దక్కించుకున్నవాడు , ఈ దేహం కోసం చింకిపాతని కట్టుకున్నా, అతనే నిజమైన ఐశ్వర్యవంతుడు  అని గుర్తుంచుకోవాలి . 

శుభం . 

#bharatamlokathalu #stories

Tags: stories, mahabharatam, bharatam, bharatham, mahabharatham, 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore