Online Puja Services

మహాభారతంలో యమధర్మరాజు అంశతో జన్మించిన వారెవరు ?

3.128.171.192

ధర్మరాజు కాకుండా మహాభారతంలో యమధర్మరాజు అంశతో జన్మించిన వారెవరు ? 
- లక్ష్మీరమణ 

మహాభారతంలో పాండవాగ్రజుడు ధర్మరాజు యమధర్మరాజు అంశతో జన్మించినవాడని మనకి తెలిసినదే ! అయితే, మహా భారతంలోని  మరో ధర్మ కోవిదుడు కూడా యమధర్మరాజు అంశతో జన్మించాడు . శ్రీకృష్ణునికి అత్యంత ప్రియభక్తుడు, ధర్మశాస్త్రంలోనూ, రాజనీతిలోనూ బాగా ఆరితేరిన వాడు, కోపతాపాలు, ఈర్ష్య అసూయలు లేని మహాత్ముడు, పెద్దలందరి చేత మంచివాడని అనిపించుకున్న వాడు ధృతరాష్ట్రునికి  మంత్రిగా ఉన్న విదురుడు. యమధర్మరాజు విదురునిగా పుట్టడానికి దారితీసిన పరిస్థితుల గురించి పంచమ వేదం ఇలా చెబుతుంది . 

విదురునికి సాటి వచ్చే విజ్ఞానవంతుడు, ధర్మనిష్ఠుడు ముల్లోకాల్లోనూ ఎవ్వరూ లేరు. పాండవులతో జూదమాడడానికి దుర్యోధనుడు తన తండ్రి అనుమతి కోరినప్పుడు విదురుడు దృతరాష్ట్రుడి  చేతులు పట్టుకుని “మహారాజా మీరు ఈ జూదానికి  ఒప్పుకోవద్దు. ఈ జూదం వల్ల అన్నదమ్ముల మధ్యలో విరోధం వస్తుంది.  కౌరవ రాజ్యానికే దీనివల్ల ముప్పు కలుగుతుంది.”  అని ఎన్నో విధాల చెప్పాడు. 

ధృతరాష్ట్రుడికి విదురుడి మీద అపారమైన నమ్మకం. అందువల్ల అతను చెప్పిన మాటలు విని కొడుకుతో “ దుర్యోధనా ! ఈ జూదం మనకు వద్దు. పాచికలతో పరాచకాలు వద్దని విదురుడు చెబుతున్నాడు.  అతడు ఏం చెప్పినా మన మేలు కోరే చెబుతాడు.  ఆయన చెప్పిన ప్రకారం చేస్తే, మనకి శుభం జరుగుతుంది.  బుద్ధిలో విదురుడు బృహస్పతి లాంటివాడు.  జరిగింది, జరగబోయేది అన్నీ చెప్పగలిగినవాడు.  ఈ జూదం వల్ల మీ అన్నదమ్ముల మధ్యలో తగాదా వస్తుందని విదురుడు చెబుతున్నాడు. అది నాకస్సలు ఇష్టం లేదు” అని శతవిధాల చెప్పాడు. కానీ, అవి ఏవీ దుర్యోధనుడి చెవికి ఎక్కలేదు.  కుమారుని మీద కల మితిమీరిన ప్రేమ కొద్దీ ధృతరాష్ట్రుడు చివరికి తప్పనిసరై, అతను జూదమాటానికి సరే అన్నాడు. ఆ తర్వాత విదురుడు చెప్పినట్టే జరిగింది.  కౌరవ వంశమంతా నాశనం అయిపోయింది. చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు.

ఇంతటి ధర్మనిష్ఠాపరుడు, ప్రతిభాశాలి , రాజనీతిజ్ఞుడైన  విదురుని జన్మ వృత్తాంతం కూడా సామాన్యమైనది కాదు . యమధర్మరాజు విదురునిగా జన్మనెత్తడానికి మాండవ్యముని శాపం కారణమయ్యింది. 

మాండవ్యముని ఊరికి దూరంగా ఒక వనంలో ఆశ్రమం కట్టుకుని జీవిస్తూ ఉండేవారు.  ఒకనాడు ఆయన తన ఆశ్రమం వెలుపల తపస్సు చేసుకుంటూ ఉంటే, కొందరు దొంగలు అటువైపు వచ్చారు. వాళ్లని కొందరు రాజభటులు తరుముకొస్తున్నారు. వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు దొంగలు మాండవ్యముని ఆశ్రమంలోకి చొరపడ్డారు.  దోచుకు తెచ్చిన సొమ్ములన్నీ ఒక మూల పడేసి, మరో మూల వాళ్ళు దాక్కున్నారు. రాజుబటులు దొంగలు పారిపోయిన జాడ కనిపెట్టి, ఆ దారిలోనే ఆశ్రమం దగ్గరికి వచ్చారు.  

అక్కడ తపస్సు చేసుకుంటున్న మాండవ్యముని వారికి కనిపించారు.  వాళ్ళు “ఏమయ్యా ఇప్పుడే కొందరు దొంగలు ఇటుగా వచ్చారే! వాళ్ళని నువ్వేమైనా చూసావా? వాళ్ళు ఎటు వెళ్లారు?” అని అడిగారు.  ధ్యానంలో మునిగి ఉన్న మాండవ్యుడు బదులు చెప్పలేదు.  రాజుబటులు ఎంతగా ప్రశ్నించినా ముని కళ్ళు తెరవలేదు, సమాధానం చెప్పలేదు . ఇంతలో కొందరు రాజభటులు ఆశ్రమంలోకి వెళ్లి, శోదా చేయటం మొదలుపెట్టారు. ఆశ్రమం లోపల, ఒక మూల దొంగలెత్తుకొచ్చిన నగలు, డబ్బు కనిపించాయి.  మరో మూల నక్కిన దొంగలు కూడా కనిపించారు. “ ఓహో ఇదీ కథ! ఈ ముని కపట సన్యాసన్నమాట! దొంగల నాయకుడు చాలా గొప్పగా మునివేషం వేసుకుని ఉలక్కుండా, పలక్కుండా వేషాలేస్తున్నాడు! ఇతని సలహా మీదే ఈ దొంగతనం జరిగి ఉంటుంది.” అని రాజభటులు  తీర్మానించుకుని, దొంగలతోపాటు, మాండవ్యుని చేతులకి కూడా బేడీలు తగిలించారు . 

మరో వైపు విషయమంతా తెలుసుకున్న రాజుగారు, మారు విచారణ లేకుండా , “సన్యాసిని వెంటనే శూలానికి గుచ్చి కొరత వేయండి” అని ఆజ్ఞాపించారు. రాజు గారి ఆజ్ఞ ప్రకారం మాండివ్యుడ్ని శూలానికి గుచ్చి శిక్షించారు .  ఆశ్రమంలో దొరికిన సొమ్ము మొత్తం రాజు గారికి అప్పగించారు.  

ఇంత జరుగుతున్నా దొంగలు మాత్రం నోరు మెదపలేదు. మాండవ్యముని ధ్యానం నుండీ బయటికి రాలేదు . శిక్షకూడా ఆయన ధ్యానంలో ఉండగానే అమలు చేసేశారు రాజభటులు . కానీ  మాండవ్యముని ధ్యానంలో ఉండటం వల్ల శూలం పోట్లు కూడా ఆయన ఏమి చేయలేకపోయాయి.  ప్రాణం నిలిచే ఉంది.  

అడవిలో ఉన్న మునులందరికీ ఈ విషయం తెలిసి, ఆయనని చూడటానికి వచ్చారు.  ‘ఇంత ఘోరానికి ఒడికట్టిందెవరు మహానుభావా’ అని దుఃఖిస్తూ అడిగారు. అప్పుడు ధ్యానం నుండీ బయటికి వచ్చిన మాండవ్యుడు  “ఏమని చెప్పను నాయనా ? ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చారు . రాజుబటులు పట్టుకున్నారు.  రాజుగారు నాకీ శిక్ష విధించారు” అని  సమాధానం చెప్పారు. 

మరోవైపు శూలానికి వేలాడుతున్న మనిషి అన్నం, నీళ్లు లేకపోయినా ఇంకా అలాగే ప్రాణాలతో బ్రతికి ఉండడం రాజుగారికి ఆశ్చర్యాన్ని కలిగించింది.  ముని మహనీయుడని గ్రహించాడు.  వెంటనే ఆయన్ని శూలం నుంచి దింపమని బటులని ఆజ్ఞాపించాడు. మహాముని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ఇంత జరిగినా, మాండవ్యమునికి రాజు గారి మీద కోపం వచ్చిందా?  రాలేదు. 

ఆయన  తిన్నగా యమధర్మరాజు దగ్గరికి వెళ్లారు . “ స్వామి! నిరంతరమూ భగవంతుని  తపస్సులో గడిపే నాకు  ఇంత కఠిన శిక్ష నాకెందుకు విధించారని” అడిగారు.  యమధర్మరాజు మాండవ్యుడికి కలిగిన కష్టానికి విచారిస్తూ,  “మహామునీ ! మీరు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు, పక్షులని తుమ్మెదలని హింసించారు.  పాపం అనేది ఎంత కొద్దిగా చేసినా, దాని ఫలము చాలా ఎక్కువగా అనుభవించాలి” అన్నాడు.  “పసితనంలో తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా? సరే, నువ్వు చేసిన పాపానికి భూలోకంలో మానవుడివై జన్మించు” అని యమధర్మరాజుని శపించాడు మాండవ్యముని . 

ఆ విధంగా ధర్మదేవత, మాండవ్యముని శాపం వల్ల, అంబాలిక దగ్గర ఉన్న దాసీ వనిత కడుపున పుట్టాడు.  అతడే విదురుడు.  అందుకని ధర్మదేవతావతారమే ధర్మకోవిదుడైన విదురుడని పెద్దలు చెబుతారు. 

#yamadharmaraju #mahabharatam #vidura #dharmaraju

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi