బలవంతులతో దుర్భలులు పోటీపడడం మంచిది కాదు
బలవంతులతో దుర్భలులు పోటీపడడం మంచిది కాదు !
- లక్ష్మీరమణ
ఈ మాట చెబుతున్నది మహాభారతం . అన్నట్టు బూరుగు చెట్టు అందరికీ తెలిసే ఉంటుంది కదా ! లోకంలో బూరుగు గర్వభంగం అనే నానుడి కూడా ఉంది విన్నారో ! ఆ నానుడికి మూలకం కూడా ఈ కధే . ఈ కధలో బూరుగు మహావృక్షం ఏకంగా ఆ వాయుదేవుడితోనే పోటీకి దిగింది . శక్తికి మించిన పని. సాధ్యం కాదని తెలిసినా గొప్పల కోసం ప్రాకులాడి అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని దాని శ్రమకి ఎలాంటి ఫలితం దక్కిందో చూద్దాం పదండి .
ఎక్కలేని అందలానికి అర్రులుచాచకూడదు. బలవంతులతో దుర్భలు ఎప్పుడు పోటీ పడకూడదు. పెద్ద రాయి కింద చెయ్యి పెట్టకూడదని అనుభవజ్ఞులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఒకప్పుడు హిమావత్ పర్వతం మీద ఒక పెద్ద బూరుగు వృక్షం ఉండేది. ఒకసారి నారద మహర్షి ఆ దారిని వెళుతూ, మధ్యలో బూరుగు దగ్గర ఆగి ‘బూరుగా ఈ హిమవత్ పర్వతం మీద ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు ? ముదురు కొమ్మలతో మూల బలంతో టీవీగా నిలబడ్డావు. నీ అంత పొడుగు, వైశాల్యం కలిగిన చెట్టు మరి ఏదీ లేదు ఇక్కడ . ఎన్నో పక్షులు నిన్న ఆశ్రయించి జీవిస్తున్నాయి. గాలికి అన్ని చెట్లు కూలిపోతాయి. కానీ నువ్వు మాత్రం కూలకుండా ఉన్నావు. నీకూ వాయిదేవుడికి ఏమైనా చుట్టరికం ఉందా? లేకపోతే అతడు దయ తలిచి పోన్లే పాపం కదా అని నిన్ను రక్షిస్తున్నాడా? ఏమిటి రహస్యం?’ అని అడిగాడు.
బూరుగు వృక్షము నారదుడి మాటలకు ఉబ్బితబిబ్బయింది. ‘మునీంద్ర తెలియక మాట్లాడుతున్నావు కానీ, నా ముందర వాయుదేవుడు ఎంత ? అతగాడి బలం ఎంత? అతని బలము నా బలంలో పదో వంతు కూడా రాదు’ అంది కొమ్మలు విదిలిస్తూ గర్వంగా బూరుగు . దేవర్షి చిన్నగా నవ్వి ‘అమ్మమ్మ అంత మాటనకు. వాయి దేవుడు తలచుకున్నాడు అంటే,కొండలే కూలిపోతాయి. ప్రభంజనుడంటే సర్వాన్ని చక్కగా విరిచేవాడని అర్థం తెలుసా’ అన్నాడు.
‘ అదేమో నాకు తెలియదు. నా మొదలు కొమ్మలు చూసావా ఎంత బలంగా ఉన్నాయో!! నన్ను తాకితే అతనికున్న ప్రభంజనుడనే బిరుదు కాస్త పోతుంది’ అంది బూరుగు. ‘సరే జాగ్రత్త నీ కొమ్మలు, రెమ్మలు, దాని మీదున్న పిట్టలు, వస్తానంటూ’ చిరునవ్వు నవ్వి కలహాసనుడు బయలుదేరాడు.
సంగతంతా చిటికెలో అందజేశాడు వాయిదేవుడికి. అతడు రానే వచ్చాడు ‘ఏమే బురుగా ఏం వాగావు ? మళ్లీ అను. నిన్ను తాకలేనా? పడగొట్టలేనా ? నీ ఆటలు నా దగ్గర సాగవా? నీకు చేటుకాలం వచ్చింది. మాటలు ఎందుకు, కాచుకో అన్నాడు. కోపంగా, తేలిగ్గా మాట్లాడకు లోకంలో ఉన్న అన్ని వృక్షాలతో పాటే నన్ను చూస్తున్నట్టున్నావు అన్నది శాల్మలి (బూరుగు చెట్టు ). పక పకా నవ్వాడు ప్రభంజనుడు . ‘ఓహో, ఎంత గర్వం! అన్ని వృక్షాల లాంటి దానవు కాక, నీకేం కొమ్ములు మొలిచాయా ? బ్రహ్మదేవుడు నీ నీడలో నిలబడ్డాడు అన్న గౌరవం కొద్దీ, నిన్ను ఏమీ చేయకుండా ఇన్నాళ్లు వదిలేసాను. అందుకే ఇప్పుడు ఇలా పొగరెక్కి మాట్లాడుతున్నావు. ప్రస్తుతం కాస్త పనిలో ఉన్నాను. రేపు తేల్చుకుందాం బలాబలాలు’ అంటూ ముందుకు దూసుకుపోయాడు.
వాయుదేవుడు వెళ్లిపోయాక బూరుగు వృక్షానికి భయం పట్టుకుంది. ‘ అయ్యో మహాబలుడైన వాయువుతో ఎరగకపోయి విరోధం తెచ్చుకున్నానే రేపు నాకు గతి ఏమిటి నారదముని మాటలు వినకపోయాను కాదు అని విచారించింది. మరుక్షణం కొంచెం ధైర్యం తెచ్చుకుంది. వాయిదేవుడు వస్తే ఏంచేస్తాడు? ఆకులు రాల్చేస్తాడు? కొమ్మలు రెమ్మలు విరిచేస్తాడు. అంతేగా! ఆ పని నేనే చేసుకుంటే, ఇక అతను ఏం చేయగలడు? అతను ఓడి పోయినట్టేగా అనుకొని బలాన్ని అంతా కూడగట్టుకుని ఆకులు విదిలించుకుని కొమ్మలన్నిటినీ తనకు తానే విరుచుకుని మోడై నిలిచింది.
తెల్లవారింది భయంకరంగా ధ్వని చేస్తూ ప్రతిజ్ఞ తీర్చుకునేందుకు వచ్చాడు వాయిదేవుడు. దొంగలా మిగిలిన బూరుగుని చూస్తూనే పెద్దగా నవ్వుతూ’ నా పని నువ్వే చేసేసావే! మంచిది, ఇకనైనా బుద్ధి తెచ్చుకో !ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు. నువ్వే కాదు నీ బంధువులందరికీ కూడా చెప్పు.’ అని హేళన చేసి వెళ్ళిపోయాడు. పాపం శాల్మలి సిగ్గుతో తలవంచుకుంది.
అందువల్ల తలకి మించిన భారాన్ని ఎత్తుకొని ఆపసోపాలు పడేకన్నా , ఎంచక్కా వాస్తవంలో బతకడం చాలా సుఖం .
శుభం .