గురువు లేని విద్య ?

గురువు లేని విద్య ?
-లక్ష్మీరమణ
చదువుకోవాలంటే బోలెడంత బద్ధకం . ఎన్ని గంటలైనా కంప్యూటరు, సెల్ఫోనుల్లో గడిపేయవచ్చు . స్నేహితులతో ముచ్చటించవచ్చు. దైవం చల్లగా చూస్తే, ఏ కాఫీ షాపులోనో కూర్చొని కాలం వెళ్లదీయవచ్చు . చదువు మాటెత్తితే నిద్రాదేవి అనుగ్రహం చల్లగా వర్షిస్తుంది . అమాంతం ఆ తల్లి తన ఒడిలో సేదతీరుస్తుంది. స్కూల్ కి వెళ్లంటే చాలా ఆరోగ్య సమస్యలు అమాంతంగా గుర్తొచ్చేస్తాయి . అమ్మాయిల్లో కన్నా అబ్బాయిల్లోనే ఈ సమస్య ఎక్కువని కూడా చెబుతున్నారు విశ్లేషకులు . ఇలాంటి వేషాలని మనవాళ్లేమీ మొదలు కాదు . వీరికా ఘనులు ఉన్నారని భారతం చదివితే అర్థం అవుతుంది . అటువంటి ఒక కథని ఇక్కడ చెప్పుకుందాం .
గంగానది ఒడ్డున రైభ్యుడు అనే రుషి ఆశ్రమం కనిపించింది. ఆ పక్కనే మహర్షి భరద్వాజుని ఆశ్రమం కూడా ఉన్నది . భరద్వాజుడు, రైభ్యుడు ఇద్దరూ మంచి స్నేహితులు . ఇద్దరూ మహర్షులు ! వేదవిద్యలన్ని ఔపోసనపట్టినవారు !
వీరిలో రైభ్యుడికి ఇద్దరు కొడుకులు. పరావసు, అర్వావసు అని వారి పేర్లు . వాళ్ళిద్దరూ కూడా చక్కగా వేదం చదువుకొని గొప్ప పండితులుగా పేరుపొందారు. భరద్వాజుడికి ఒక్కడే కొడుకు . అతని పేరు యువక్రీతుడు. యువక్రీతుడికి రైభ్యుడు అన్నా, ఆయన కొడుకులన్నా గిట్టేది కాదు. మంచి చెప్పే వారి మాటలు మనకి పెద్దగా చెవికెక్కవు కదా ! పైగా పరావసు, అర్వావసులను చూసి యువక్రీతుడు అసూయపడేవాడు. వాళ్ళ కన్నా తాను గొప్పవాణ్ణి కావాలని ఆశపడేవాడు .
ఆశతీర్చుకోవడానికి మార్గం శ్రమ మాత్రమే . కానీ వేదవేదాంగాలూ తెలిసి బ్రహ్మమూర్తి అయిన భరద్వాజుని పుత్రుడైయుండీ , గురు శుశ్రూష చేసేందుకు, విద్యాభ్యాసం చేసేందుకు ఇష్టపడేవాడు కాదు యువక్రీతుడు . సులువైన మార్గం కోసం అన్వేషించి , ఇంద్రుని గురించి తపస్సు చేశాడు. నిప్పుతో వళ్ళంతా మండించుకున్నాడు.
అతని తపస్సు చూసి , ఇంద్రుడికి జాలి కలిగింది. యువక్రీతుడికి ప్రత్యక్షమయ్యి , ‘ఎందుకు నాయనా ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు’ అని అడిగాడు. ‘ఎవరూ చదవని వేద విద్యలన్నీ నాకు రావాలి. నేను గొప్ప పండితుడిని కావాలి. దానికోసమే నేను ఈ కఠోరమైన తపస్సు చేస్తున్నాను. అలాగని గురువుగారి దగ్గరకు పోవడం, కొన్నాళ్లు ఆయనకు శుశ్రూష చేయడం నాకు కుదరవు. అవేవీ లేకుండా, విద్యలన్నీ క్షణాల మీద పొందేందుకే ఈ తపస్సు చేస్తున్నాను. కాబట్టి నన్ను ఆశీర్వదించండి’. అని యువక్రీతుడు , ఇంద్రుణ్ణి వేడుకున్నాడు.
ఆ అమాయకమైన కోరిక విన్న ఇంద్రుడు నవ్వాడు. ‘ పిచ్చివాడా నీ తెలివి తప్పుదోవ పట్టింది. తక్షణమే వెళ్లి గురువును ఆశ్రయించు. ఆయన వద్ద వేద విద్యలన్నీ నేర్చుకో. ఈ విధానంలోనే ఎవరికైనా విద్య అబ్బుతుంది. గురువు అనుగ్రహం లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు ‘ అని చెప్పాడు. కానీ, యువక్రీతుడికి ఆయన మాటలు నచ్చలేదు. ఇంకా ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రుడు మళ్ళీ వచ్చి. ‘ నాయనా మూర్ఖంగా ఏ పని చేయకూడదు. నీ తండ్రిగారికి వేదవిద్యలన్నీ తెలుసు. ఆయన్ని ఆశ్రయించు. తండ్రినిమించిన గురువు లోకంలో లేరు తెలుసుకో ! ఆయన నీకు అవన్నీ నేర్పుతారు. వెళ్లి వేద విద్యలన్నీ నేర్చుకో. ఇలా ఒళ్ళు కాల్చుకోవడం మానుకో!’ అని చెప్పాడు. యువకుడితుడికి కోపం వచ్చి ‘నేను కోరిన వరం కనుక మీరు ఇవ్వకపోతే నా శరీరంలోని అవయవాలన్నీ విరిచి, ఈ అగ్నిగుండంలో పడేస్తాను’ అన్నాడు.
ఇదిలా ఉండగా ఒకనాడు యువక్రీతుడు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు నది ఒడ్డున కూర్చుని పిడికెడు పిడికెడు ఇసుక తీసి నదిలోకి విసురుతున్నాడు. అది చూసి యువక్రీతుడు ‘ఏం చేస్తున్నావు తాతా ?’ అని అడిగాడు. ‘గంగానది దాటడానికి వంతెన కడుతున్న’ అన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. అది విని యువక్రితుడు పెద్దగా నవ్వాడు. ‘వేగంగా పోయే ప్రవాహానికి ఇలా ఇసుకతో అడ్డంగా కట్ట వేయటం కుదరని పని. వేరే మార్గం చూడు’ అని సలహా ఇచ్చాడు. ‘గురువు లేకుండానే, అసలు చదవకుండానే, కష్టపడకుండానే విద్య రావాలని కొందరు తపస్సు చేస్తున్నారు . అదే విధంగా నేను గంగానదికి ఇసుకతో వంతెన కడుతున్న’ అని ముసలి బ్రాహ్మణుడు బదులు చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఆ ముసలి బ్రాహ్మణుడు ఎవరో యువక్రితుడికి. వెంటనే కాళ్ళ మీద పడ్డాడు.
ఇంద్రుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యి , నవ్వుతూ యువ క్రీతువుని దగ్గరకు తీసుకున్నాడు . ‘ నీ తండ్రి దగ్గర వేద విద్యలు నేర్చుకో. అనతి కాలంలోనే నువ్వు గొప్ప విద్వాంసుడు అవుతావు’. అని ఆశీర్వదించాడు. ఆ తర్వాత యువక్రీతుడు తన తండ్రి దగ్గర విద్యాభ్యాసం చేసి , నిజంగానే గొప్ప పండితుడు అనిపించుకున్నాడు .
ఈ ఉదంతం ధర్మరాజు లోమసుడు అనే మహర్షి సూచన అనుసరించి తీర్ధయాత్రలు చేసే సందర్భంలో మనకి కనిపిస్తుంది .
కాబట్టి పుస్తకం దిండు కింద పెట్టుకొని పడుకొని, తెల్లవారి రాసిన పరీక్షలో ప్రధమ స్థాయి మార్కులు సాధించాలనుకోవడం మూర్ఘత్వమే అని అర్థం చేసుకోవాలి . చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి .
శుభం .