Online Puja Services

భీష్ముణ్ణి గెలిచిన అంబ కథ తెలుసా!

18.221.93.167

భీష్ముణ్ణి గెలిచిన అంబ కథ తెలుసా!
లక్ష్మీరమణ 

భీష్ముడు అపరాపరాక్రమశాలి . ఆయన  ఇఛ్ఛా మరణాన్ని వరంగా పొందినవాడు.  భీష్ముణ్ణి గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు . కానీ ఒక స్త్రీ ఆపనిని సాధించింది . ఈ కథకి మూలం కాశీరాజు ప్రకటించిన స్వయంవరం . కాశీరాజుకి ముగ్గురు కుమార్తెలు . అంబ , అంబిక, అంబాలిక . ముగ్గురూ చక్కని చుక్కలే . వీరికి స్వయంవరం ప్రకటించాడు కాశీరాజు .  తన తమ్ముళ్ళయిన చిత్రాంగదుడు,  విచిత్రవీర్యులకి ఇచ్చి పెళ్లి చెయ్యడం కోసం  భీష్ముడు ఆ స్వయంవరానికొచ్చిన రాజులందరినీ ఎదిరించి ఆ రాచకన్యలని హస్తినకు తీసుకొచ్చాడు . కానీ, ఆ పడుచులు మనసుని అడిగి ఆపని చేసుంటే ఎంతో బాగుండేది! 

అంబ అప్పటికే సాళ్వరాజుని వరించింది . చిన్ననాటినుండీ అతనే తన విభుడని కలలు కంది.  భీష్మునికి ఆవిషయాన్ని ధైర్యంగా చెప్పింది . భీష్ముడు సరేనన్నాడు . సాళ్వుని  దగ్గరకి ఆమెని  పంపించేశాడు . కానీ సాళ్వుడు “ఇంతకాలమూ ఆ హస్తినాపురంలో విచిత్రవీర్యునికి కాగల సాటిగా ఉన్న నిన్ను నేను ఏలుకోను పొమ్మ”న్నాడు . ఎంతగా అంబ నచ్చజెప్పినా , వేడుకున్నా ఆమె వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది . తిరిగి భీష్ముని ఆశ్రయించింది అంబ .  ‘నీ మనసులో పరపురుషుడు ఉండగా, నిన్ను నా తమ్మునికి కట్టబెట్టలే’నన్నాడు భీష్ముడు .  అంబ అతని  కరుకు హృదయానికి తల్లడిల్లిపోయింది . దిక్కుతోచని స్థితిలో  పడింది . తన ఈ పరిస్థితికి కారణమైన భీష్మునిపై అంతులేని క్రోధంతో రగిలిపోయింది . ఎలాగైనా భీష్మునిపై పగ సాధించాలనుకుంది. 

హొత్రవాహనుడనే రాజర్షి సాయంతో పరశురాముని ఆశ్రయించింది . పరశురాముడు , భీష్మునికి విలువిద్యనేర్పిన గురువు . కానీ భీష్ముడు గురువుని మించిన శిష్యుడనిపించుకున్నాడు . యుద్ధానికి దిగినా  పరశురామునిపైన విజయం భీష్మునిదే అయ్యింది . దానితో అంబ తన పంతం చెల్లించుకుందుకు యమునాతీరంలో కుటీరాన్ని ఏర్పరచుకొని తీవ్రంగా తపస్సు చేయడం మొదలుపెట్టింది.  

ఒకనాడు గంగాదేవి ఆమెకి దర్శమిచ్చింది . తన కుమారుడైన భీష్ముని చంపాలనే ఆమె ఆకాంక్షని విని కోపగించింది . “ నువ్వు కుటిల సంచారిణివి ! కనుక ఈ శరీరం విడిచి ఏరై ప్రవహించు . అంతకన్నా నువ్వు భీష్ముణ్ణి ఏమీ చేయలే”వంది . కానీ అంబ తన తపః ఫలములో సగం ధారపోసి అంబానదిగా మారింది . మిగిలిన సగభాగంతో తన శరీరాన్ని నిలబెట్టుకొని పరమేశ్వరునికోసం తన తపస్సు కొనసాగించింది . ఆమె తపస్సుకి మెచ్చి , శివుడు ప్రత్యక్షం అయ్యాడు . “ మరుజన్మలో నువ్వు భీష్ముణ్ణి చంపగలవు “ అని వరం అనుగ్రహించాడు . మొదట నువ్వు ఈ శరీరాన్ని విడిచి ద్రుపదమహారాజుకి కూతురువై పుడతావు . ఆతర్వాత కొడుకుగామారి శిఖండి అనే పేరుతొ ప్రసిద్ధి కెక్కి , గాంగేయుని వధిస్తావు అని వివరించి అంతర్థానమయ్యాడు . 

అంబ గాంగేయుణ్ణి చంపాలన్న ఒకే ఒక్క కోరికని మనస్సులో గట్టిగా నింపుకొని, చితిపేర్చుకొని అగ్నిప్రవేశం చేశింది . ఆ తర్వాత ద్రుపదమహారాజుకి సంతానముగా జన్మించిన అంబ , కురుక్షేత్ర సంగ్రామంలో శిఖండిగా మారి భీష్ముణ్ణి సంహరించింది .  ఆవిధంగా అంబ తన పంతం నెగ్గించుకుంది .  అందుకే అంటారు స్త్రీ పగపడితే అంతం చూస్తుందని . 

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda