బార్బరీకుడు కేవలం సాక్షిగా ఎందుకు మిగిలాడు ?
మూడేమూడు బాణాలతో కురుక్షేత్రాన్ని ముగించగల బార్బరీకుడు, కేవలం సాక్షిగా ఎందుకు మిగిలాడు ?
లక్ష్మి రమణ
కురుక్షేత్రానికి ముందు బలిగా తనని తాను అర్పించుకొని, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరుకి సాక్షిగా నిలిచిన వీరుడు బార్బరీకుడు. ఒకవేళ ఆయనే కనుక యుద్ధరంగంలో నిలిచి ఉంటె, ఫలితాలు వేరుగా ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదు . ఆ వీరునికి అసలాగతి ఎందుకు పట్టింది ? అని ప్రశ్నిస్తే, శ్రీకృష్ణ బార్బరీకుల సంవాదం దానికి సమాధానం చెబుతుంది .
శ్రీకృష్ణుడు కురుక్షేత్రానికి బయల్దేరిన బార్బరీకునితో , ‘బర్బరీకా! నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో, ఆ నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా! అలా నువ్వు పాండవులు, కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా!’ అని వివరిస్తాడు .
ఒక బ్రాహ్మణుని రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో స్పందిస్తూ , ‘ఓ బ్రాహ్మణుడా , ఇంతకీ నీకేం కావాలో కోరుకో!’ అని అడుగుతాడు. దానికి శ్రీ కృష్ణుడు ‘మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావల్సి ఉందనీ, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వ’మని కోరతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బర్బరీకునికి. మారుమాటాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు.
కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందనీ, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది.
అయితే, ఆ సమయంలోనే కృష్ణుడు బార్బరీకునికి ఇటువంటి స్థితికి కారణమైన అతని పూర్వ జన్మ వృత్తాంతాన్ని ఇలా వివరిస్తాడు . ’ఓ బర్బరీకా! నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి. భూమి మీద అధర్మం పెరిగిపోయింది. నువ్వే కాపాడాలి. శ్రీమహావిష్ణు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకింత పొగరుగా మాట్లాడావు. దానికి నోచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకే నీ బలి. అంతేకాదు ఇది నీకు శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీ కృష్ణుడు. అంతేకాదు, కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే పూజలందుకుంటాడనీ, అతణ్ని తల్చుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ చిటికెలో తీరిపోతాయనీ వరమిస్తాడు శ్రీ కృష్ణుడు.
మరో నమ్మకం ప్రకారం బర్బరీకుని బాణం శ్రీ కృష్ణుడు యొక్క కాలి చుట్టూ తిరగడం వల్ల, ఆయన కాలు మిగతా శరీరంకంటే బలహీనపడిపోయింది. అందుకని,శ్రీ కృష్ణుడు అవతార సమాప్తి చేయవలసిన సమయం ఆసన్నం అయినప్పుడు, ఒక బాణం ఆయన బలహీనమైన కాలికి గుచ్చుకోవడం సాధ్యమైంది.
అలా శ్రీ కృష్ణుని అనుగ్రహాన్నిపొంది , ఈ కలికాలంలో బార్బరీకుడు శ్యాం బాబాగా పూజలందుకుంటున్నారు . దక్షిణ భారతాన ఖాటు శ్యాంను ఆరాధించేవారి సంఖ్యే కాదు, అసలు ఆ పేరు విన్నవారి సంఖ్యే చాలా తక్కువ. కానీ ఉత్తరాదిన, ఆ మాటకు వస్తే భారతదేశాన్ని దాటి నేపాల్ లోనూ ఖాటు శ్యాం బాబాను ఆరాధించేవారి సంఖ్య అనంతం .