Online Puja Services

ఆ ఒక్కడూ యుద్ధం చేసుంటే,

3.142.245.16

ఆ  ఒక్కడూ యుద్ధం చేసుంటే, కొన్ని క్షణాల సమయంలో కురుక్షేత్రం ముగిసిపోయేది . 
లక్ష్మీ రమణ 

భీముడు, హిడింబాసురుడి చెల్లెలు హిడింబని వివాహం చేసుకున్నాడు . వారిద్దరికీ ఘటోత్కచుడు పుట్టాడు . ఆ ఘటోత్కచుడు, మౌర్వి(అహిలావతి) అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ పుట్టినవాడే ఇప్పుడు మనం చెప్పుకోబోయే యోధుడు .  ఘటోత్కచుడే వీరుడనుకుంటే, అతని కొడుకు అంతకు మించిన వీరుడు, పెదనాన్న వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న విలుకాడు . అతనే కనుక భారత యుద్ధంలో తలతెగి కేవలం వీక్షకునిగా మిగలకపోయి ఉండిఉంటే, ఆ యుద్ధం ఒక్క గంట వ్యవధిలో ముగిసిపోయి ఉండేది .  ఆ కథేమిటో చూద్దాం పదండి . 

బార్బరీకుడు - ఘటోత్కచుని కొడుకు . మహా విలుకాడు . అతని యుద్ధకళా నైపుణ్యానికి మెచ్చిన దేవతలు అతనికి మూడు బాణాలు ప్రసాదిస్తారు . ఇక  కురుక్షేత్రం సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నం అయ్యింది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమీ కాదు కదా! బర్బరీకుని బలమెరిగిన అతని తల్లి, ఏ పక్షమైతే బలహీనంగా ఉందో, నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది. కానీ వీరుల సామర్ధ్యాలు , వాసుదేవుని అండదండలు, ధర్మాధర్మాలూ విచారిస్తే, పాండవుల పక్షం బలంగా ఉంది . 

బర్బరీకుడు పాండవ పక్షాన నిలిస్తే, ఆ పోరు క్షణాల్లో ముగిసిపోతుంది. పొరపాటున కౌరవ పక్షాన నిలిస్తే, ఫలితాలు తారుమారైపోతాయి. ఒకవేళ ఎవరి పక్షం బలహీనపడుతోందో . ఆ పక్షాన అతను మార్చి మార్చి యుద్ధం చేస్తే, యుద్ధరంగమంతా బార్బరీకుడు తప్ప మరెవరూ ఉండరు . ఇదంతా  శ్రీకృష్ణునికి ముందే తెలుసు . అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు. 
‘మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు. 

‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు. 

‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయాగించు’ అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు. 

కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద అకులన్నింటి మీదా తన గుర్తుని వేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది. 

‘అయ్యా! మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి’ అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు. 

ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. ‘అతను కనుక యుద్ధ రంగంలో ఉంటే ఏమన్నా ఉందా!’ అనుకుంటాడు. పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే, అతని బాణాలు వారిని వెతికి వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు.

అందుకే.‘మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావల్సి ఉందనీ, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వ’మని కోరతాడు. ఆ విధంగా బార్బరీకుడు మహాసంగ్రామానికి ముందే తన తలని బలిగా చేశాడు . 
                       

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba