అర్జునుడి కొడుకే అతన్ని సంహరించాడు
అర్జునుడు కర్ణుడి బిడ్డని చేరదీసినా చివరికి అర్జునుడి కొడుకే అతన్ని సంహరించాడు .
-లక్ష్మీ రమణ .
మహాభారత యుద్ధం మహా భయంకర సంగ్రామం. ఈ సంగ్రామంలో పాండవుల పక్షానే ధర్మముంది . వీరులున్నారు . భగవంతుడూ ఉన్నాడు . కానీ వారు తమ పుత్రులైన ఉపపాండవుల్ని కోల్పోయారు .
కథలో స్వంత సోదరుడే అయినా విధి రాత వల్ల శతృపక్షం వహించిన వీరుడు కర్ణుడు. కర్ణుడు అర్జునుడిని ఓడించడానికి , అర్జునుడు కర్ణుడిని ఓడించడానికి రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేశారు . తపస్సులు చేసి శాస్త్రాస్త్రాలు సంపాదించారు . ఈ ధీరులిద్దరిలో కర్ణుడు , అర్జునుడి చేతిలో హతుడయ్యాడు. అంటే కాదు తన ఎనిమిది మంది పుతృలు కురుకేత్రానికి తమ రుధిరధారలర్పించి అశువులుబాశారు .
పురాణాల ప్రకారం కర్ణుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు వృశాలి. ఈమె రథసారధి కూతురు. రెండో భార్య పేరు సుప్రియ. ఈమె దుర్యోధనుడి భార్య భానుమతి స్నేహితురాలు. కర్ణుడికి తొమ్మిది మంది సంతానం. వీరిలో మొదటి ఎనిమిది మంది కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. వీరిలో పెద్దవాడైన వృషసేనుడుని , తన తండ్రి కర్ణుడి రథం ముందు ఉన్న సమయంలోనే అర్జునుడు సంహరించి పద్మవ్యూహంలో తన పుత్రుడైన అభిమన్యుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
మరో ఇద్దరు కుమారులు శత్రుంజయ, ద్విపాతలు కూడా పార్థుడి చేతిలో మరణించారు. మిగతా వారిని సాత్యకి, భీముడు, నకులుడు సంహరించారు. మొత్తం తొమ్మిదిమందిలో ఆఖరివాడు , కురుక్షేత్ర సంగ్రామం నాటికి పసివాడు వృషకేతుడు మాత్రమే. ఇతను మాత్రమే యుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. కర్ణుడు మరణించేనాటికి ఈయన చాలా చిన్నవాడు. రాధేయుడి మరణం తర్వాత వృషకేతుడి బాధ్యతలను అర్జునుడు తీసుకున్నాడు. కృష్ణార్జునులు ఇద్దరూ ఈయనను అమితంగా ఇష్టపడేవాళ్లు.
ఇతను అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్ర, వారుణాస్త్ర, అగ్ని, వాయాస్త్రాలను వినియోగించడం తెలిసిన వ్యక్తి కూడా. ఈ నాలుగు అస్త్రాలను వాడితే భూమిపై జీవరాశి మిగలదు. ఇది తెలిసిన కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఎవరికీ బోధించవద్దని వృషకేతుడికి సూచించాడు. అర్జునుడి నిర్వహించిన అనేక అశ్వమేధ యాగాల్లో, వివిధ రాజ్యాలతో వృషకేతుడు యుద్ధం కూడా చేశాడు. అయితే చివరకు అర్జునుడి కుమారుడు బబ్రువాహునుడే వృషకేతుని సంహరించాడు. దైవికమైన ఆయుధాల పరిజ్ఞానం తెలిసిన వ్యక్తి కావడం వల్లే అతడు మరణించాడని అంటారు పండితులు .