Online Puja Services

కామాక్షి లీల

18.221.68.196

మూగవాడైన మూకశంకరుల నోట ఆశువుగా 500 శ్లోకాలు పలికించిన కామాక్షి లీల !
సేకరణ లక్ష్మీ రమణ 

అమ్మ అవతారాలు, ఆకృతులు అనంతాలు. అమ్మ లీలలు, హేలలు అనిర్వచనీయాలు. విశ్వరక్షణ, జీవ సంరక్షణకై అమ్మ చేసే వింతలు, వినోదాలు అద్భుతాలు. అమ్మ అర్చనలు, ఆరాధనలు, ఉపాసనలు, మంత్ర జపాలు, ఆధ్యాత్మిక తపాలు, బీజాక్షర యుక్తమైన నామ మంత్ర పఠనాలు మహాశక్తివంతం. మహిత శుభ ఫలప్రదం. అమ్మ సన్నిధి బిడ్డలకు పెన్నిధి. నమ్మి కొలిచినవారికి నారాయణీ మాత కొంగు బంగారం. భక్తితో భజించినవారికి బలం, ఫలం ప్రసాదించే తత్త్వం అమ్మది. అమ్మ అనుగ్రహంతో మూగవారైన మూకశంకరులు కంచి పీఠాన్ని అలంకరించడం అమ్మ కరుణా కటాక్షానికి ఒక మచ్చుతునక మాత్రమే ! 

మూకశంకరేంద్ర సరస్వతీ స్వామివారిని గూర్చి తెలుసుకోవాలి. కామాక్షీమాత దివ్యానుగ్రహంతో మూగవాడైన మూకశంకరులు మాటలు వచ్చి మహాకవియై ఆశువుగా 500 శ్లోకాలను అమ్మవారిపై అనర్గళంగా చెప్పి “మూక పంచశతి” అనే స్తుతి కావ్యానికి తెరదీసిన యోగీశ్వరుడు. కంచికామకోటి పీఠానికి 20వ పీఠాధిపతిగా పనిచేసి, అమ్మవారి దంత పంక్తిలో ఐక్యత నందిన దివ్యపురుషుడు మూకశంకరులు. 

మనకున్న శక్తిపీఠాలలో ప్రసిద్ధమైంది కాంచీపురం. ఇక్కడ శక్తిపీఠం ఇతర శక్తిపీఠాలకు శక్తి, దీప్తి, స్పూర్తులను సదా అందిస్తోందని ప్రతీతి. కాంచీపురం మోక్షపురిగా ప్రసిద్ది. జగద్గురువు ఆదిశంకరులు సర్వజ్ఞ పీఠం స్థాపించారు. ఇక్కడున్న మహాశక్తి, అమ్మవారు కామాక్షీ మాత. స్వామి కామేశ్వరుడు.  కామేశ్వరునే కనులలో దాచుకున్న తల్లి కామాక్షి. సకల కామితాలకు సాక్షియై అనుగ్రహించే తల్లి కామాక్షి. త్రిమూర్తులే త్రినయనాలుగా కల్గిన తల్లి కామాక్షీ మాత . కామునకు పునర్జన్మనిచ్చి, అనంగునిగా మార్చి, రతీదేవికి సంతృప్తిని కల్గించిన తల్లి కామాక్షి అని పండితులు చెప్పడం గమనార్హం . 

అటువంటి విశిష్టమైన  కామకోటి పీఠానికి గురుపరంపరలో 20వ మహర్షి మూకశంకర సరస్వతీస్వామిశ్రీ విద్యా మాతకు ప్రతిరూపులు. పుంభావ వాగ్గేవీ మాత. క్రీ.శ. 398 నుండి క్రీ.శ 437 వరకు 39 సం||లు కంచిపీఠమును నిర్వహించిన మహాయోగి మూకశంకరులు.

ఖగోళ శాస్త్ర పండితులైన శ్రీ విద్యాపతికి జన్మించినవారు మూకశంకరులు. పుట్టుకతో మూగతనం, చెవుడు ఉన్నాయి. అయినా ఆదినుండి అమ్మవారి ధ్యానంతో పెరిగారు . ఒకమారు తన మిత్రునితో కంచికి పోయి, అమ్మవారి ఎదుట ధ్యానంలో మూకశంకరులు నిమగ్నమైనారు. ఇంతలో కాంచీపుర పీఠ శిఖాధిరూఢయైన ఆదిమశక్తి కామాక్షీమాత సామాన్యకాంతగా, పండు ముత్తైదువగా ఆలయంలోనికి వచ్చి మూకశంకరులను సమీపించింది. తాను నములుతున్న తాంబూలం ఎంగిలి పిడచను నోటినుండి తీసి ఎదురుగా ఉన్న శంకరుల మిత్రునకివ్వబోయింది. అమ్మవారిని గుర్తించలేని ఆ సాధకుడు, ఆ ముత్తైదువ ఎంగిలిని తిరస్కరించాడు. అప్పుడు ఆ తల్లి ప్రక్కన ఉన్న మూకశంకరులకిచ్చింది. మూకశంకరులు భక్తితో తీసుకుని, కళ్ళకద్దుకుని, ఎదురుగా ఉన్న అమ్మకు, పండు ముత్తైదువకు నమస్కరించి నోటిలో వేసుకొని నమిలినాడు. 

అంతే శంకరుల మూగతనం మాయమైంది. మాటల ప్రవాహం పెల్లుబికి వచ్చాయి. కనులు వర్తించాయి. ఒళ్ళు పులకరించింది. భావావేశం, సాహిత్యాభినివేశం, భక్త్యార్థతలు సమ్మిళితమై అతని నోట ఆశువుగా ఛందోబద్దమైన శ్లోకాల జలపాతం ప్రారంభమైంది. 500 శ్లోకాలు ఆలపిస్తే గాని మూకశంకరుల భావావేశం శాంతించలేదు. 

ఇంతలో అమ్మ “నాయనా! ఏమైనా వరం కోరుకో. అనుగ్రహిస్తా”నంది. అప్పుడు మూకశంకరులు “అమ్మా! నీ నామ మహిమ, నీ పాద మహిమ, నీ కటాక్ష వైభవం, నీ మందస్మితం, నీ దివ్యత్వంలను సంస్తుతించిన నోటితో లౌకికాలు మాట్లాడలేను. కనుక అమ్మా! తిరిగి నాకు మూగతనాన్ని అనుగ్రహించు”మని కోరినాడు. అమ్మ “తథాస్తు" అంది. అలా పారలౌకికం మాత్రమే కోరిన భక్తుడు మూకశంకరులు. 

అమ్మ మణిద్వీపవాసిని. అక్కడ మహాయోగులకు ప్రత్యేకించి జ్ఞానమండపం ఉంది. అదే అమ్మ పరమపదం. మూకశంకరుల ఆత్మ బహుశః ఆ పరమ పదాన్ని కోరియుండవచ్చు. ఏదైనా అమ్మ అనుగ్రహం. అర్హతే అన్నీ నిర్ణయిస్తుంది కదా! - ఇది తెలిసి కంచిపీఠం స్వావిశ్రీ మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతి మూకశంకరులను పిలిపించి, ఆయన తల్లితండ్రుల అనుమతితో సన్యాసదీక్ష నిచ్చి , ఉత్తరాధికారిగా చేయడం, అనంతరం మూకశంకరులు కంచిపీఠం అధిపతిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అమ్మ అనుగ్రహ విశేషం అలాంటిది.

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi