Online Puja Services

జగత్తులోని మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీలు

3.144.4.54

వీళ్ళిద్దరూ మహాతపస్సంపన్నులు, జగత్తులోని మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీలు  
-లక్ష్మీ రమణ 

మన రాజకీయ నాయకుల్లాంటివాడే ఇంద్రుడు . ఇంద్రుడు - అంటేనే ఇంద్రియములకు అధిపతి అని కదా అర్థం . తన ప్రలోభాలకు లొంగని వాళ్లంటే, మహాభయం మనవాడికి . అగ్ని దేవుడు , వాయు దేవుడూ ఆయన కొలువులోనే  ఉంటారు . వాళ్ళిద్దరికీ రాక్షసులని చంపే పని అప్పజెప్పాడు . వాళ్ళు ఆపనిలో విఫలం కావడం ఇద్దరు మహర్షుల జననానికి కారణమయ్యింది . 

నర నారాయణులు నరసింహుని రూపాలు . సింహం- నారాయణ స్వరూపంగా, నరుడు - నరుడిగా విడిపోయారాని పురాణాలు వివరిస్తున్నాయి . వీళ్ళిద్దరూ బదిరికావనంలో తపస్సు చేసుకొనే వారు .  వాళ్ళ తపస్సుని భగ్నం చేయాలి అనుకున్నాడు . కామ ప్రేరణకి పూనుకొని అప్సరసలని పంపాడు . దానికి ధీటైన జవాబు చెప్పారా తాపసులు . వాళ్ల కంటే సౌందర్యంతో ఉట్టిపడే ఊర్వశిని నారాయణుడు తన తొడ చరిచి సృష్టిస్తాడు . 

ఇదిలా ఉంటె, తారకాసుర వధ తర్వాత దైత్యులని (రాక్షసులని) మట్టుబెట్టే పనిని అగ్నికి , వాయువుకీ అప్పగించాడు దేవేంద్రుడు . రాజుగారు అప్పగించిన పనిని వాళ్ళు నిర్వర్తించకుండా ఉంటారా ? వాయువు, అగ్ని కలిసి రాక్షసుల అంతం చూడ్డం మొదలెట్టారు . దీంతో  దైత్యులు కొత్త పన్నాగాలు పన్నారు  . దైత్యులు పగలనంతా  సముద్రంలో దాక్కొని, రాత్రిపూట తమ అసురీ చర్యలు కొనసాగించడం మొదలెట్టారు . దాంతో అగ్ని , వాయువు కూడా కొంత తమ ప్రభంజనాన్ని తగ్గించారు . ఇలా పన్నెండు వేల సంవత్సరాలు గడిచిపోయాయి . క్రమంగా అసురుల విజృంభణ పెరిగిపోయింది . దీనివల్ల లోకానికే ఉపద్రవం ఏర్పడే పరిస్థితి దాపురించింది .  

ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది . మహేంద్రుడు మండిపడి , అగ్నిదేవా,  వాయుదేవా , తారకాది రాక్షసులని చంపమని మీకు చెప్పాను కదా ? మీరు నా మాట వినకపోవడం వల్లే ఇప్పుడు లోకానికి ఉపద్రవం ఏర్పడింది. ఇప్పటికైనా సముద్రాన్ని ఇంకించి ఆ రాక్షసులని మట్టుబెట్టండి అని ఆజ్ఞాపించారు . అగ్ని , వాయువులు ‘దేవేంద్రా ! సముద్రాన్ని ఇంకించవచ్చు . కానీ అందులోని కోటానుకోట్ల జీవులు  నశిస్తాయి . ప్రక్రుతి అసౌమతుల్యం ఏర్పడుతుంది . అది మహాపాపం కదా ! అన్నారు .  నా మాటకే ఎదురు చెప్తారా ? ఆ ఆజ్ఞనే పాలించనంటారా? అని కోపించిన దేవేంద్రుడు , మీరిద్దరూ భూమిపైన ఒక అచేతనమైన పదార్ధం నుండీ మునులై పుట్టండని శపించాడు . 

ఇక , మళ్ళి నరనారాయణుల కథకి  వెళితే, ఊర్వశి మహా సౌందర్య రాసి . దేవేంద్రుని దగ్గరున్న అప్సరసలని మించిన అందాల భరిణ. ఆమె సౌందర్యాన్ని చూసిన సూర్యదేవుడు మోహపరవశుడయ్యాడు . సూర్యుడు అగ్ని గోళము . ఆమెను తనదగ్గరికి రమ్మని పిలిచాడు . ఆమె సరేనని వస్తుండగా , వరుణుడు ఆమెని చూసి చలించాడు . వరుణుడు వాయు చాలకుడు కదా ! అగ్ని , వాయువులు ఆ విధంగా ఇంద్రుని శాప వశాన సూర్య , వరుణులని ఆవహించారన్నమాట ! 

నేను సూర్యదేవుడు పిలవంగ పోతున్నానని ఊర్వశి జవాబిచ్చింది . వరుణుడు ఆమెపైనే తాపాన్ని తాళలేక , మండే సూర్యుడు నీ అందాన్ని కూడా మండించేయగలడు . కాబట్టి నన్ను మనస్సులో నిలుపుకొని , సూర్యుని దగ్గరకి వెళ్ళమన్నాడు .  ఆమె అలాగేనని , వరుణునిపై వలపు నిలుపుకొని సూర్యునిదగ్గరికి వెళ్ళింది . సూర్యుడది గ్రహించి, పరపురుషునిపైన మోహాన్ని నిలుపుకొని నాదగ్గరికి వచ్చావా ? ఛీ ! అని ఈసడించి , భూలోకములో ఉన్న బుధుని కొడుకు పురూరవుడికి భార్యగా పడిపుండు  అని శాపమిచ్చాడు .  

కానీ భానుడికీ, వరుణుడికీ ఆమె మీద మోహం భరించలేనిదిగా తయారయ్యింది . ఇది అగ్ని వాయువులు తమని ఆవహించి ఉన్న ఫలితమేనని , దానివల్ల మహర్షులు ఉద్భవించి , లోకానికి మేలు చేస్తారని భావించిన ఆ మహాత్ములు తమ వీర్యాన్ని నిగ్రహించకూడదని నిర్ణయించుకున్నారు . దీంతో వారు ఒక పూర్ణ  కలశంలో స్కలించారు . ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీలని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి . ఈ టెక్నాలజీ ఎప్పటిది ? ఎవరి చేత దీని జననమయ్యింది అని అర్థం చేసుకోవాలి . కార్తికేయుడు కృత్తికల నుండీ పుట్టాడని , ఆ తర్వాత, మహాభారతంలో రెల్లుదుబ్బు నుండీ పుట్టిన కృపాచారుడు , కుండ నుండీ పుట్టిన దుర్యోధనుడూ , అతని తమ్ములూ వీరందరూ నాటి టెస్ట్ ట్యూబ్ బేబీలే కాదా ! అదెలా సాధ్యం అంటే, అప్పటి టెక్నాలజీ ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది .  

సరే, కథలోకి వెళితే, అలా ఆ కలశం నుండీ ఉద్భవించిన మహానుభావులు అగస్త్యుడు , వసిష్ఠుడు . బ్రహ్మ వర్చస్సు ఉట్టిపడే ఈ మహానుభావులు కలశసంభవులని , కలశజులని , కుంభసంభవులని , మిత్రావరుణ పుత్రులని ,ఔర్వశేయులని , వహ్నిమారుత సంభవులని అనంతర కాలంలో పేరొందారు . అదీ కథ .

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya