Online Puja Services

కావేరీ నది ఈయన కమండలంలో ఉండేది

18.226.93.138

కావేరీ నది ఈయన కమండలంలో ఉండేది  ! 
-లక్షీ రమణ . 

నదులని దేవతలుగా కొలిచే సంస్కృతీ మనది . ప్రాణానికి ఆధారమైన నీటిని పంచభూతాలలో ఒకటిగా భావించి ఉన్నతమైన స్థానమిచ్చి పూజిస్తాం . అటువంటి నదీమతల్లుల్లో కావేరీ నది ఒకటి .  జన్మస్థానం కర్ణాటక, లోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలకావేరి అనే ప్రదేశం. కానీ ఆమె ఈయన కమండలం నుండీ ఉద్భవించిందని చెబుతారు . స్కాందపురాణంలోని తులాకావేరీ మహత్యం మనకీ  కథని వివరిస్తుంది . 

అగస్త్యమహాముని శుక్లపక్ష చంద్రుని వంటి తేజో పరిపూర్ణుడు . నిష్టాగరిష్ఠుడు . మహా తపస్సంపన్నుడు . ఆయన తన పితృదేవతలకు మోక్షప్రాప్తి కోసం వివాహాన్ని చేసుకున్నారు ఆయన భార్య లోపాముద్ర . ఈమె స్వయంగా విష్ణుమాయ అంశ . ఆ మాయకి లోనై ఇంద్రియలోనుడైనవాడు మనిషి . ఆ మాయని గెలిచి , ఆమె వరించి వివాహం చేసుకున్నా , భక్తి తత్పరతతో భగవంతుని తెలుసుకున్నవాడు మహర్షి . ఆ తర్వాత ఆయన స్వయంగా విష్ణుమాయా స్వరూపమైన కావేరకన్యని వివాహం చేసుకున్నారు . ఆవృత్తాంతమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం . 

పూర్వం కవేరుడనే రాజర్షి ఉండేవారు . ఆయన మోక్షాన్ని పొందాలనే తీవ్రమైన ఆకాంక్షతో ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు . ఆయన తపస్సుకి మెచ్చి దర్శనమిచ్చిన ఈశ్వరుడు, ఆయన కోర్కెను తీర్చవలసినవాడు ఆ సృష్టికర్తేనని చెప్పారు . తిరిగి కవేరుడు బ్రాహ్మని  గురించి తపస్సు చేశాడు . బ్రహ్మ ఆయన కోర్కె తీరాలంటే , ఆయన ముందుగా ఒక పాపకి జన్మనివ్వాలని ఆనతి నిచ్చాడు . అలా కవేరునికి జన్మించిన విష్ణుమాయే ఈ కవేరకన్య . మహా మాయా స్వరూపిణి . కర్మ పరిపక్వము అయ్యేవరకూ ఎంతడివాడికైనా ప్రారబ్దకర్మని అనుభవించక తప్పదు కదా ! 

అలా జన్మించిన ఆ కవేరకన్య తన తండ్రి కోర్కె తీర్చడానికి మహా తపస్సు చేయడం ఆరంభించింది . దాంతో బ్రహ్మ దేవుడు అగస్త్యుని కలవడానికి వచ్చి , ఆమెని వివాహం చేసుకోవాల్సిందిగా కోరాడు. విష్ణుమాయాలో ఒక అంశఅయిన లోపాముద్రని చేపట్టిన వాడు కనుక ఆయనే ఆమెకి సరైన వరుడని బ్రహ్మ ఆదేశించాడు . అనంతర కాలంలో ఆమె నదిగా మారి తన తండ్రికి మోక్షగతులని సంప్రాప్తిప జేయడమే కాకుండా, భువిమీది జనులనికూడా ఉద్ధరించగలదని తెలియజేశాడు . 

ఆదేశించింది స్వయానా సృష్టికర్త కాబట్టి , ఆమెని చేపట్టేందుకు అంగీకరించాడు అగస్త్య మునీంద్రుడు . సౌదర్యమే సమ్మోహనమయ్యే అందంతో , ప్రకృతే పులకించే లావణ్యంతో ఉన్న ఆ కవేరకన్యని సమీపించి, తాను ఆమెని వివాహమాడదలిచినట్టు చెప్పారు . అప్పుడామె , తానూ త్వరలోనే నదిగా మారబోతున్నానని , తనని పత్నిగా పొందడం వాళ్ళ ఆయనకి దక్కేదేమీలేదని తెలియజేసింది . అయినా ఇది విధాత నిర్ణయం . తప్పడానికి వీలులేదన్నారు అగస్త్యుడు . సరేనని ఆమె అగస్త్యుని వివాహం చేసుకుంది . 

లోక కళ్యాణం కోసం జరిగిన వివాహమది . వివాహం జరిగిన వెంటనే , ఆమె నదిగా మారిపోయింది . ఆ నదిని అగస్త్యుడు తన కమండలంలో నింపుకున్నాడు . అలా అగస్త్యునితో కావేరినది కూడా కలిసి ఉండేది . 

అయితే, విధ్యపర్వత గర్వమణిచేందుకు వెళుతూ అగస్త్యుడు , తాన కమండలాన్ని విడిచి వెళ్ళాడు . శిష్యులని ఆ కమండలాన్ని తెచ్చేందుకు పురమాయించాడు . ఆ కమండలాన్ని తేవడం అంటే, ఒక నదిని తీసుకురావడం . అది అగస్త్యునికి తప్ప , ఇతరులకి సాధ్యమేనా ? కవేరునికి ఆయన కోర్కె తీరే సమయం ఆసన్నమయింది . అందుకే , ఆ శిష్యులు వచ్చేలోపే కావేరీదేవి తన కర్తవ్యాన్ని గురుతెచ్చుకుంది . తండ్రికి ఉత్తమ గతులు కల్పించే సంకల్పంతో, సహ్యపర్వతసానువుల్లో , నేలపైకి జారి నదిగా ప్రవహించింది .   ఆ జలాలతో స్నానం చేసిన కవేరుడు ముక్తిని పొందాడు .  

అలా కావేరీనది అగస్త్యుని కమండలం నుండీ జారి ఈ నేలని పావన చేసిన విష్ణుమాయ . స్వయంగా ఆ మిత్రావరుణుని ఇల్లాలు. కాబట్టి కావేరీ జలాల్లో స్నానం చేసిన వారిని విష్ణుమాయ బాధించదు  . పైగా ముక్తిని ప్రసాదిస్తుంది .

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya