Online Puja Services

దేవతల గర్వభంగం

3.149.239.79

దేవతల గర్వభంగం 

దేవతలకి రాక్షసులకి మధ్య ఎప్పుడూ శతృత్వమే. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి పడదు. చిన్న చిన్న విషయాలకి కూడా వాదులాడుకోవడం, చివరికి ఒకళ్ళనొకళ్ళు చంపుకోడం అలవాటుగా మారిపోయింది. ఒకసారి ఇలాగే వాదించుకుని చివరికి యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల్ని ఓడించి విజయం పొందారు.

యుద్ధంలో రాక్షసులు చాలా మంది మరణించారు. మిగిలినవాళ్ళు పారిపోయారు. ఆ యుద్ధంలో జయించారు కనుక దేవతలని అందరూ పొగిడారు. పొగడ్తలకి ఉబ్బని వాళ్ళు ఉండరు కదా. సామాన్యుడు కూడా పొగడ్తలకి గర్వపడతాడు. దేవతలు కూడా ఈ పొగడ్తలకి ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ విజయం మేమే సాధించాం అని గర్వంతో విర్రవీగి పోయారు. తమ విజయానికి కారణం పరబ్రహ్మశక్తి అనే విషయాన్ని మర్చిపోయారు. మాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకుని అహంకారంలో పడ్డారు. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా పరమాత్మ విషయం వదిలేశారు. "సర్వ శక్తిమంతుడైన ఈశ్వరుడికి వాళ్ళ మనస్సులో స్థానమే లేకుండా పోయింది” దేవతలకి కలిగిన గర్వాన్ని బ్రహ్మం తెలుసుకుంది. వాళ్ళ ఎదుట దివ్యమైన తేజస్సుతో ప్రకాశించింది. కాని, వాళ్ళకి తమ ముందుకి వచ్చి నిలిచిన ఆ అపురూపమైన శక్తి ఏమిటో అర్థం కాలేదు.

దేవతల్లో పెరిగిన అహంభావాన్ని గుర్తించాడు పరబ్రహ్మ. వాళ్ళుని అహంకారంలో కూరుకుని పోకుండా రక్షించాలని అనుకున్నాడు. కొడుకు క్షేమంగా ఉండాలని తండ్రి కోరుకున్నట్టే భగవంతుడు కూడా భక్తుల క్షేమాన్ని కోరుకుంటాడు. తన కళ్ళముందే తన కొడుకు చెడిపోతుంటే ఏ తండ్రి చూస్తూ ఊరుకోలేడు కదా? అదే విధంగా తన

పిల్లలైన దేవతలు అహంకారంలో పడి నాశనమై పోకుండా రక్షించాలనుకున్నాడు. వాళ్ళని ఉద్ధరించడం కోసం ఒక గుణపాఠాన్ని నేర్పాలని అనుకున్నాడు.

ఒకరోజు అమరావతీ పట్టణంలో ఉన్న ఉద్యానవనంలోఇంద్రుడు ఒక సభని ఏర్పాటు చేశాడు. దేవతలందరూ హాజరయ్యారు. దేవతలకి అసలు విషయం తెలుపడానికి అదే మంచి సమయం అనుకున్నాడు, ఆ సభలోనే ఉన్న పరబ్రహ్మ వెంటనే వాళ్లకి ఎదురుగా గొప్ప ప్రకాశవంతమైన యక్షరూపంలో ప్రత్యక్షమయ్యాడు. అంత గొప్ప తేజస్సు ఎలా వచ్చిందో... ఎక్కడనుంచి వచ్చిందో... 

అసలు దాని స్వరూపం ఏమిటో దేవతలకి తెలియలేదు. ఆశ్చర్యంతోను, భయంతోను చూస్తూ ఉండిపోయారు. ప్రకాశవంతమైన ఆ శక్తిని చూసి  

దేవతలు ఆశ్చర్యంతో పాటు భయపడ్డారు. ఆ రూపం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నారు. ఆ పనిని అగ్నిదేవుడికి అప్పగిద్దామని నిశ్చయించుకుని దేవతలంతా కలిసి అగ్ని దగ్గరికి వచ్చారు. యజ్ఞాలు జరిగినప్పుడు ఆహుతుల్ని ఎవరివి వాళ్ళకి అందచేస్తాడు అగ్ని, సర్వజ్ఞుడు, శక్తిమంతుడు అయిన అగ్నిని "ఓ జాతవేదా! మా బుద్ధికి అందని ఆ ప్రకాశవంతమైన శక్తి యొక్క రూపం ఏమిటో తెలుసుకుని వచ్చి మాకు చెప్పు! అన్నారు.

అంత గొప్పగా పిలిచి అడిగినందుకు తనే అందుకు సమర్ధుడని చెప్పినందుకు అగ్ని పొంగిపోయి అలాగే తెలుసుకుని వస్తాను అన్నాడు. యక్షుడి దగ్గరికి వేగంగా వెళ్ళాడు. 

యక్షుడి దగ్గరికి వెళ్ళాడు కాని, నువ్వు ఎవరివని అడగలేదు. ఆ ప్రశ్న దివ్యశక్తే అగ్నిని నువ్వెవరు అని అడిగింది. అహంకారంతో “నేను అగ్నిని, సర్వమూ తెలిసినవాణ్ణని, జాతవేదుణ్ణని లోకంలో ప్రఖ్యాతి పొందినవాణ్ణి” అని గర్వంగా చెప్పాడు. “అయితే నీలో ఏం శక్తి ఉంది?" అని అడిగింది. “భూమ్మీద ఏదైతే ఉందో దాన్నంతటినీ నేను దహించివేయగలను” అన్నాడు అగ్నిదేవుడు. -

ఆ యక్షుడు అతని ఎదుట ఒక గడ్డి పోచను ఉంచి “అయితే దీన్ని కాల్చు” అన్నాడు. అగ్ని తన యావశ్శక్తితో ప్రయత్నించాడు కాని ఆ గడ్డిపోచను కాల్చలేకపోయాడు. అగ్నిదేవుడు తిరిగి దేవతల దగ్గరికి వెళ్ళి “దేవతలారా! నేను ఎంత ప్రయత్నించినా ఆ దివ్యశక్తి యొక్క శక్తిని మాత్రం తెలుసుకోలేకపోయాను. దాన్ని తెలుసుకోగలిగినంత సామర్థ్యం నాలో లేదు” అన్నాడు. 

దేవతలు వాయుదేవుడి దగ్గరికి వెళ్ళారు. “

వాయుదేవా! నువ్వు గొప్ప శక్తిమంతుడివి నువ్వు వెళ్ళి ఆ దివ్యశక్తికి కారణమైనదానిని తెలుసుకోని రా!” అని చెప్పి పంపించారు. వాయువు మహా వేగంగా వెళ్ళాడు. ఆ శక్తి “నువ్వెవరు?” అని అడిగింది. వాయువు మహా గర్వంతో 'నేను వాయువు' అని పేరు గలవాణ్ణి. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి యొక్క జీవితం నా చేతుల్లోనే ఉంది. నన్ను 'మాతరిశ్వుడు' అని కూడా పిలుస్తారు. నీకు తెలియదా?” అన్నాడు.

"అయితే నీలో ఏం శక్తి ఉంది?” అని ఆ దివ్య శక్తి అడిగింది. “భూమ్మీద ఉన్నదాన్ని దేన్నైనా ఎగురగొట్టగలను” అని వాయుదేవుడు సమాధానమిచ్చాడు.

వాయువు ఎదుట దివ్య శక్తి ఒక గడ్డిపోచను ఉంచి దీన్ని ఎగురగొట్టు అంది. వాయువు తన సర్వ శక్తిని ప్రయోగించాడు. కాని, గడ్డిపోచ కదల్లేదు. దేవతల దగ్గరికి వెళ్ళి “ఆ అపురూప శక్తి యొక్క తత్త్వం ఏమిటో నేను తెలుసుకోలేక పోయాను!” అన్నాడు.

తరువాత దేవతలు ఇంద్రుణ్ణి పంపాలనుకుని 

“దేవేంద్రా! ఈ పనికి నువ్వే సమర్ధుడివి. నువ్వు వెళ్ళి ఆ దివ్యశక్తి యొక్క తత్త్వం ఏమిటో తెలుసుకుని వచ్చి మా భయాన్ని, సందేహాన్ని తీర్చు అని అడిగారు. ఇంద్రుడు వాళ్ళు అడిగినట్టుగానే తెలుసుకుని వస్తానని వెళ్ళాడు. కాని, ఇంద్రుడు వెళ్ళగానే ఆ దివ్య ప్రకాశం అంతర్థానమైంది.  

దివ్యశక్తి ఏమైందో తెలియక ఇంద్రుడు అయోమయంగా అన్నివైపులా వెతుకుతున్నాడు. నిరాశతో వెనక్కి తిరిగి వెళ్లిపోకుండా దేవతలు తనకు అప్పగించిన పనిని తప్పకుండా పూర్తి చెయ్యాలి అని నిర్ణయించుకుని అక్కడే ఉండిపోయాడు. ఈ సమయంలో దివ్యశక్తి అదృశ్యమైన ప్రదేశంలోనే ఇంద్రుడికి ఆకాశంలో గొప్ప సౌంద కలిగి, శోభయమానంగా ప్రకాశిస్తూ ఉన్న హిమవంతుని కుమార్తె ఉమ ప్రత్యక్షమైంది.

ఇంద్రుడు భక్తితోను, వినయంతోను ఆమెకి నమస్కరించి "దేవీ! ఇంతవరకు దేవతలను భయపెట్టిన దివ్యశక్తి ఎవరు?” అని అడిగాడు. ఉమాదేవి "దేవేంద్రా! యక్షస్వరూపంలో వచ్చిన దివ్యశక్తి 'పరబ్రహ్మం'. అంతటా ఆవరించి ఉండే పరబ్రహ్మమే రాక్షసులతో జరిగిన యుద్ధంలో మీకు విజయం కలిగేలా చేసింది. బ్రహ్మం పొందిన విజయం వల్ల మీకు కీర్తి ప్రతిష్ఠలు కలిగాయి. నిజాన్ని మీరు తెలుసుకోలేక మీ బలపరాక్రమాల వల్లే మీరు రాక్షసుల్ని జయించగలిగామని గర్వపడుతున్నారు”.

“మీలో లేని బలపరాక్రమాల్ని మీలో ఉన్నాయని అనుకుంటున్నారు. మీకు కలిగిన మిథ్యాభిమానం పోగొట్టడానికి బ్రహ్మం మీ ముందు ప్రకాశవంతమైన దివ్య శక్తిగా వచ్చి నిలిచింది. మీరు మీ బలపరాక్రమాలతో గడ్డిపోచను కూడా కదల్చలేక పోయారు. ఎందుకంటే, ఆ సమయంలో బ్రహ్మం మీకు సహకరించలేదు. కాబట్టి, మీలో ఉన్న శక్తిసామర్థ్యాలు పరబ్రహ్మ శక్తే అని తెలుసుకోండి!” అని చెప్పి ఉమాదేవి అంతర్ధానమైంది.

అంత వరకు గౌరీదేవి చెప్పిన మాటలు విన్న ఇంద్రుడు తమ ఎదురుగా వచ్చి నిలిచిన ప్రకాశవంతమైన దివ్య శక్తి పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకుని అగ్నికి, వాయువుకి కూడా చెప్పాడు. అగ్ని, వాయువు, ఇంద్రుడు బ్రహ్మానికి దగ్గరగా వెళ్ళి దర్శించడంవల్ల పార్వతీదేవి చెప్పడంవల్ల దివ్య తేజస్సు 'పరబ్రహ్మం' అని మొదట ఇంద్రుడు, ఇంద్రుడు చెప్పడం వల్ల వాయువు, అగ్ని తెలుసుకున్నారు. మిధ్యాభిమానాన్ని వదులుకున్న అగ్ని, వాయువు, ఇంద్రుడు దేవతల్లో గొప్పవాళ్ళుగా మిగిలారు. యక్ష రూపంలో వచ్చిన దివ్యశక్తిని పరబ్రహ్మ స్వరూపంగా మొదట తెలుసుకున్న ఇంద్రుడు బ్రహ్మవేత్తల్లో మొదటివాడుగా నిలిచాడు. 

బ్రహ్మం గురించిన వర్ణన ఇది. మిరుమిట్లు గొలిపే మెరుపుని ప్రకాశింప చేస్తున్నది ఆ బ్రహ్మమే! మనిషిని రెప్పలు ఆర్పేటట్టు చేస్తోంది ఆ బ్రహ్మమే. ప్రకృతి, శక్తులుగా ఆ బ్రహ్మం అభివ్యక్తీకరణకు సంబంధించిందిగా ఉంటోంది. ఇప్పుడు అంతర్గత సాధన మొదలవుతుంది. మనస్సు దేనివల్ల ప్రపంచ విషయాలమీదకి పరుగెడుతుందో, దీనివల్ల జరిగిపోయిన విషయాలని జ్ఞాపకం చేసుకుంటుందో, దేనివలన అనుక్షణమూ కొత్త సంకలాలను చేసుకుంటుందో అదే బ్రహ్మం. -

"ఆ బ్రహ్మాన్నే జీవులు ఆత్మగా ఆరాధింపదగినది. కాబట్టి దాని తదనుగుణంగా ధ్యానించాలి”. ఈ విధంగా తెలుసుకున్న వాళ్ళని స జీవులూ ప్రేమిస్తాయి.

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya