నారదుడి ధర్మసందేహం
మహాత్ముల సందర్శనం
అర్జునుడికి గీతోపదేశం చేస్తూ శ్రీకృష్ణపరమాత్మ “దేవర్షిణాంచ నారదః” అని పలికాడు. అలాంటి నారదుడు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడానికి ఒకసారి వెళ్ళాడు. దండప్రణామాలు చేసి కాస్సేపు సంభాషించాక నారదుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు: “భగవాన్! మహాత్ముల సందర్శనంవలన కలిగే ఫలం ఏమిటో దయచేసి కాస్త వివరంగా సెలవియ్యండి.”
శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేదు. నారదుడికి అనుభవపూర్వకంగా తెలియపరచాలని ఆ యోగీశ్వరుడు సంకల్పించాడేమో మరి!
కాస్సేపయ్యాక చిరుదరహాసంతో నారదుణ్ణి చూస్తూ శ్రీకృష్ణుడు ఇలా పలికాడు: “నారదా! ఇటు తూర్పువైపుగా వెళ్ళావంటే నీకొక పెద్ద పెంటకుప్ప కనిపిస్తుంది. దాన్లో ఒక పేడపురుగు జీవిస్తోంది. దాన్ని కనుక ఈ ప్రశ్న అడిగావంటే నీకు స్పష్టమైన జవాబు లభిస్తుంది.”
భగవంతుడి ఆదేశం మేరకు నారదుడు తూర్పువైపుగా బయలుదేరి, మొత్తానికి ఆ పెంటకుప్ప దగ్గరికి వెళ్ళగలిగాడు. దాన్లో జీవిస్తూ ఉన్న ఆ పేడపురుగును చూసి, “మిత్రమా! మహాత్ముల దర్శనం వలన కలిగే ఫలం ఏమిటి?” అంటూ కుతూహలం ఉట్టిపడే స్వరంతో అడిగాడు. నారదుడు ఈ ప్రశ్నను అడిగీ అడగ్గానే ఆ పేడపురుగు గిలగిలకొట్టుకొంటూ ప్రాణాలు విడిచి పెట్టింది. ''హతోస్మి' అనుకుంటూ, విచారవదనంతో శ్రీకృష్ణుడి వద్దకు తిరిగివచ్చి నారదుడు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.
నారదుడు చెప్పినదంతా ఆలకించి మందహాసంతో దేవకీనందనుడు “నారదా! నువ్వు ఇప్పుడు పడమరగా వెళితే ఒక దేవాలయం కనబడుతుంది. దాన్లో ఒక పావురం నివసిస్తోంది. దాన్ని అడుగు, నీ ప్రశ్నకు జవాబు తెలుస్తుంది” అన్నాడు.
వెంటనే నారదుడు పడమర దిశకేసి బయలుదేరాడు. ఆ పావురాన్ని కలుసుకొని మునుపటిలాగానే ప్రశ్నించాడు. తన ప్రశ్నకు జవాబు లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తుండగానే - అదేమి వింతో - ఆ పావురం కణంలో రెక్కలను టపటపలాడిస్తూ దేవర్షి కాళ్ళముందుపడి ప్రాణాలు విడిచింది.
నారదుడికి జరిగినదంతా అయోమయంగా కనిపించింది. తాను ఆ ప్రశ్నను అడిగీ అడగ్గానే - రెండు నిండు ప్రాణాలు హరించుకు పోయాయి. ఇంకా ఎన్ని రీతుల్లో భగవంతుడు నన్ను శోధించాలనుకొంటున్నాడో!' అని యోచిస్తూ, విచారవదనంతో తిరిగి శ్రీకృష్ణుడి వద్దకెళ్ళి జరిగినదంతా విన్నవించాడు.
జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ ఎరుగని వాడిలా ముఖం పెట్టి “అయ్యో, అలా జరిగిందా నారదా! అయితే ఇప్పుడు నువ్వొక పని చెయ్యి. ఉత్తరదిశగా వెళితే అక్కడ సంస్థానంలోని రాజుకు ఒక అందాల మగశిశువు జన్మించాడు. ఆ పసికందు నీ ప్రశ్నకు తప్పక జవాబిస్తాడు” అన్నాడు.
మొదటి రెండుసార్లు భగవానుడి ఆజ్ఞను శిరసావహించిన నారదుడు ఈ సారి కాస్త తటపటాయించాడు. ఆ పేడపురుగు, పావురమూ ప్రాణాలు వదలినట్లు ఆ రాజు బిడ్డడు కూడ తన ప్రశ్నకు జవాబుగా అప్పుడే పోసుకున్న ఆ కాస్త ప్రాణం వదిలేస్తే! ఇక తన గతి ఏంకాను!
నారదుడి సంశయాన్ని ఎరిగిన శ్రీకృష్ణుడు, “నారదా! వెనుకాడవద్దు. నిర్భయంగా వెళ్ళు! ఈసారి అంతా శుభకరంగానే జరుగుతుంది” అంటూ ఆశీర్వదించి పంపాడు
మరే ఆలోచన పెట్టుకోక నారదుడు బయలుదేరాడు. శ్రీకృష్ణుడు సూచించిన సంస్థానంలోని రాజమందిరంలోకి వెళ్ళాడు. ఆ రాజుకు అప్పుడే జన్మించిన మగశిశువు ఉయ్యాలలో ఉన్నాడు. నారదుడు ఆ శిశువును సమీపించి “బాబూ! మహాత్ముల సాంగత్యంవల్ల కలిగే ఫలం ఏమిటి?” అని అడిగాడు. అప్పుడక్కడ ఒక అద్భుతం జరిగింది. క్షణంలో ఆ పసికందు తేజస్వియైన ఒక దేవతగా మారిపోయి, నారదుడికి భక్తిప్రపత్తులతో నమస్కరించాడు.
నారదుడికి జరిగినదేమీ అంతుబట్టలేదు. అప్పుడు ఆ మహాతేజస్వి వినయంగా ఇలా పలికాడు: “దేవర్షీ, అలా ఆశ్చర్యపోతారేం! నేను వేరెవరినో కాను. మొదట్లో మీరు చూసిన ఆ పెంటకుప్పలో హీనజన్మలో జీవిస్తూ ఉండిన ఆ పేడపురుగును నేనే! మహాత్ములైన తమ దర్శనభాగ్యంతో ఆ నికృష్టజన్మ అంతరించి పావురంగా జన్మనెత్తాను. ఆ జన్మలోనూ తమ దర్శనభాగ్యం దక్కడంచేత ఇప్పుడు ఈ రాజుకు కుమారుడిగా జన్మించడం జరిగింది. ఈ జన్మ కలిగిన వెంటనే మహాత్ములైన తమను దర్శించడంతో నాకు దైవత్వం సంతరించినది. ఇదంతా మహాత్ముల సందర్శన భాగ్యంవల్ల జరిగిన అద్భుతమే కదా!” ఇలా అంటూ ఆ తేజస్వి ఆకాశమార్గాన దేవలోకానికి వెళ్ళి పోయాడు.
సాధు సంగంబు సకలార్థసాధకంబు' అంటోంది కదా సుభాషితం. వివేక చూడామణి'లో శంకరాచార్యులు "దుర్లభం త్రయమే వైతత్ - దైవానుగ్రహ హేతుకం - మనుష్యత్వం, ముముక్షత్వం మహా పురుష సంశ్రయః ” అన్నారు.
తెలిసో తెలియకో అమృత పానం చేసిన వ్యక్తికి ఎలా అమరత్వం ఉందో - తెలిసిగాని, తెలియకగాని నిప్పును పట్టుకొంటే చేయి ఎలా కాలుతుందో - నీళ్ళలో పడ్డ వ్యక్తి శరీరం ఎలా తడిసిపోతుందో సత్సాంగత్యం తనంతట అదే లభించినా సరే; మనమే అందు నిమిత్తం
ప్రయతించి చేకూర్చుకొన్నాసరే - అందువల్ల తప్పక సత్ఫలితం కలుగుతుంది. కాని ఈ సత్యాన్ని బాగా అవగాహన చేసుకొని ప్రయత్నపూర్వకంగా సత్సాంగత్యం అలవరచుకొన్నప్పుడు, ఫలితం అతిశీఘ్రంగా లభిస్తుంది.
సర్వాంతర్యామిగా భగవంతుడు అందరిలోను నెలకొని ఉన్నాడు. కాని మహాత్ముల హృదయాల్లో ఆయన ప్రకాశం ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రజ్వలిస్తూన్న నిప్పులో పడవేసిన వస్తువులు నిప్పుగానే మారేట్లు, మహాత్ముల సంసర్గం ఎలాంటి పాపులనైనా పునీతులను చేస్తుంది.
ఇందుకొక చక్కని ఉదాహరణ గిరీష్ చంద్రఘోష్. ఇతడు వంగదేశంలో సుప్రసిద్ధ నాటకకర్త. ఎన్నో నాటకాలు రచించి, వాటికి జీవంపోసి ప్రజల మన్ననలను అందుకొన్న వ్యక్తి. గిరీష్ కి లేని దురల వాటంటూ లేదంటే అది అతిశయోక్తి కాబోదు. మితిమీరిన తాగుడు, కామినీ వ్యామోహం - ఇంకా ఎన్నో! ఇట్టి దురాచార పరాయణుని కరుణించి ఉద్ధరించినవారు దయార్ద్రహృదయుడైన శ్రీరామకృష్ణ పరమహంస. ఈ మహాత్ముడి సాంగత్య ఫలంతో అతడి జీవితమే పూర్తిగా మారిపోయింది. చివరికి స్వామి వివేకానంద వంటి మహాతేజస్వి సైతం మెచ్చుకొనే ఉన్నత స్థితికి రాగలిగాడు గిరీష్ చంద్రఘోష్.
ఎందరో పాపులు, దురాత్ములు మహాత్ముల సత్సాంగత్య ఫలంతో పరివర్తన చెంది, పవిత్రులైన సంఘటనలు చరిత్రలో మనకు ఎన్నో కనిపిస్తాయి.