Online Puja Services

కుబేరుడి మాట రావణాసురుడు వినిపించుకొని ఉంటే

3.142.194.159

కుబేరుడి మాట రావణాసురుడు వినిపించుకొని ఉంటే , కథ మరోలాగా ఉండేది !
లక్ష్మీరమణ 

మాయపొరలు కమ్మినప్పుడు ఎంతటి విజ్ఞానవంతుడైనా , మంచిని విస్మరిస్తాడు . అందుకు ఉదాహరణ రామాయణంలోని రావణాబ్రహ్మె ! మహాతాపసి అయినా విశ్రవునికి, రాక్షస రాకుమారి కైకసికీ పుట్టిన సంతానం రావణాసురుడు.  జన్మతః బ్రాహ్మణుడు . వేదాలు, ధర్మాలు తెల్సిన పండితుడు, మహా ద్రష్ట . అపర శివభక్తుడు .  రావణాసురుడు ఎంతటి శివభక్తుడంటే , శివుని ఆత్మలింగాన్ని పొందేంత, కైలాసాన్నే పెకిలించి లంకలో పెట్టుకోవాలనే ప్రయత్నం చేసేంత, తన తలనే తెగనరికి శివపూజకు అర్పించేంత  . భక్తి బాగా ముదిరితే , భక్తుడికి ఉన్మత్తావస్థ కలుగుతుందని యోగ శాస్త్రం కూడా చెబుతుంది . ఇక ఆయన ఎంతటి పండితుడు , ధర్మాత్ముడూ అంటే, రాముడు -రావణాసురునితో యుద్ధానికి రావణాసురుణ్ణే మంచి ముహూర్తం చూడమని ప్రార్ధించేంత, ఆయన రాముడి విజయం తధ్యమయ్యేలా ముహుర్తాన్ని నిర్ణయించేంత. బద్ధ శత్రువుల మధ్య ఈ సన్నివేశం వారి రాజనీతిని, ధర్మనిరతిని ప్రతిఫలిస్తుంది కదూ !

రామాయణంలోని రాక్షసరాజు రావణుడు సీతమ్మని వదిలెయ్యమని ఇచ్చిన సలహా ఒక్కటి వినివుంటే, అసలు రామాయణం ఉదాత్తత ఎవరికీ అర్థమయ్యేది కాదేమో ! అయినా వైరంతోనైనా హరి చేతుల్లో మరణాన్ని పొందడం అదృష్టమే కదా ! మహాజ్ఞాని అయిన రావణుడికి ఈ విషయం తెలుసు అనుకోవాలో, తెలీదు అనుకోవాలో అది వేదవ్యాసులవారికే ఎరుక ! కానీ ఆయన ఆ మాటని పెడచెవిన మాట మాత్రం నిజం . 

ఆసమయంలో , మండోదరి మాట వినలేదు , విభీషణుడ్ని రాజ్యం నుండీ వెలివేశాడు . ఇక అన్నగారైన కుబేరుడి మాటకూడా పెడచెవిన పెట్టాడు . ఆ సంఘటన రామాయణంలో మనకి కనిపిస్తుంది. 
  
కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు. సీతా దేవిని బంధించిన రావణునితో పర స్త్రీని గౌరవంగా చూడాలనీ, చెడు ఉద్దేశంతో చూడరాదనీ, సీతమ్మని విడిచి పెట్టమనీ హితవు చెబుతూ ఒక లేఖను పంపుతాడు కుబేరుడు. ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకానగరం వెళ్ళినప్పుడు ఆవిడని కుబేరుడు వంకర చూపు చూశాడట. దాంతో అలా చూసిన కుబేరుడి ఎడమకన్ను  ఆవిడ తేజస్సు వలన మూసుకునిపోయిండట. అది గమనించిన పార్వతీదేవి, కుబేరునికి కన్ను పోయేలా చేయటం, తద్వారా తన కన్ను పింగళ వర్ణం లోనికి మారిపోవటం వలన తనకి ఆ పేరు వచ్చిందనీ ఆ లేఖలో వివరిస్తాడు కుబేరుడు .  ఏ దురుద్దేశమూ లేకపోయినా పరాయి స్త్రీని చూడడం వల్లనే అలా జరిగిందనీ,  ఉద్దేశ్యపూర్వకంగా అటువంటి తప్పు చెయ్యొద్దని చెబుతాడు .  పరాయిస్త్రీని అందులోనూ పరాశక్తి వంటి సీతమ్మని,ఆశించవద్దనీ హితవు చెబుతాడు.  

తన ప్రియమిత్రుడయిన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశము లేదని జరిగిన సంఘటనను వివరించి, అమ్మవారిని అనుగ్రహించమని అనునయించటంతో ఆ రెండవ కన్ను మళ్ళీ మామూలుగా మారి చూపు సంతరించుకోవడం వేరేకథ. 

కానీ, బుద్ధి వంకరగా తిరిగి నప్పుడు, అదుపులేని గుర్రంలా పరుగులు తీస్తున్నప్పుడు విహితావిహితాలు యెరిగి ప్రవర్తించాలనే ఎరుక ఈ నాటి సమాజంలో చాలా అవసరం . మనసు గుర్రంకి బుద్ధి ముక్కుతాడు వేసే ప్రయత్నం చేస్తుంది . కానీ మనసు చెప్పే మాటలు తీయగా ఉంటాయి . అందుకే అధికారం బుధ్ధికియ్యడానికి మనం అంగీకరించం. కానీ పగ్గాలు ఉండాల్సింది బుద్ధి దగ్గరే. మెదడుకి తోచకపోయినా , మంచి మాటలు చెప్పే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు . అవి చెవికెక్కకపోతే , మనం కూడా అసురులమే అవుతాం కానీ నరులం కాలేమని గుర్తుంచుకోవాలి . సరే, ఈ రావణాసురుడి కథయినా , ఈ దేశ మహిళలు ధైర్యంగా వార్తాపత్రికలు చదివే రోజుని తీసుకొస్తే చాలు .

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore