Online Puja Services

లక్ష్మీ నివాసం ఎక్కడ?

3.137.159.17

లక్ష్మీ నివాసం ఎక్కడ?
లక్ష్మీరమణ 

అమ్మా , నీ ఇల్లెక్కడ అని అడిగితె ఏ హైందవ స్త్రీ  అయినా , తన మెట్టినింటి చిరునామానే  చెబుతుంది . లక్ష్మీ దేవి కూడా  శ్రీ విష్ణువక్షస్థల నిలయా అని  అని పూజిస్తే చాలా ఇష్టపడతారట . అలా పూజించినవారి ఇంట కొలువై ఉంటారట . ఈ విషయం శ్రీమన్నారాయణుడికీ తెలుసు . అయినా భార్యలని ఉడికించడం భర్తలకు ఒక సరదాగా ఉంటుంది కదా ! ఆ సరదాకి ఆయనకూడా మినహాయింపేమికాదు . అది లోకకల్యాణం కోసమే అని ఆ తర్వాత సవరణలు ఇస్తారు సరే! కానీ ముందర భక్తులకి పరీక్షలు, ఆ తర్వాత కనువిప్పులు, పూజల వేడుకోళ్ళు చోటుచేసుకోవడం పరిపాటేకదా ! 

అలాంటి ఒక సంఘటననే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుందాం . 

 ఒకసారి అలవైకుఠపురములో ఆదిశేషునిపైన పవళించిన  నారాయణుడు లక్ష్మీదేవి తో ముచ్చటిస్తూ ఇలా  అన్నారట,

"లక్ష్మీ ! ప్రజలలో  భక్తి ఎంతగానో పెరిగింది .   అందరూ నా కరుణ కోసం "నారాయణ నారాయణ" అని నా నామం జపిస్తున్నారు” అని . 

అప్పుడామె  " అది మీకోసం కాదు, మీనామం నాకిష్టమైనందున , నా కరుణా కటాక్షం కోసమే మిమ్మల్ని భజిస్తున్నారు “ అన్నారట . అమ్మకి అన్ని తెలుసు కదా !
 వాళ్లిద్దరూ అలా వాదించుకుంటూ , సరేఅయితే,  ఈ భక్తులు ఎందుకు నా నామ జపం చేస్తున్నారనేది మనిద్దరం  పరీక్షించి తెలుసుకుందాం .అనుకుంటారు . 

నారాయణుడు ఒక  బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామం లోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతారు .  గ్రామాధికారి తలుపు తెరిచి, “ మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు?"  అని అడుగుతారు. 

“నాపేరు లక్ష్మీపతి, నాఊరు  వైకుంఠం . నేను మీ నగరంలో హరికథ చెప్పాలని అనికొంటున్నాను. అనుమతినిచ్చి వసతిసదుపాయాలు కల్పించండి అని కోరతారు శ్రీహరి  .  
.
 దానికి గ్రామాధికారి “అలాగా ఇది మా గ్రామ ప్రజల మహాభాగ్యం. తప్పకుండా మీ కథాకాలక్షేపాన్ని ఏర్పాటు చేస్తాను . , మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు నా ఇంట్లోనే ఉండండి”  అని చెప్తారు 
హరికథాకాలక్షేపం మొదలవుతుంది .  హరియే చెబుతున్న హరికథ యెంత అద్భుతమో , విన్నవారిదెంతపుణ్యమో వివరించే పనియేముంది . ఆ కథ వినేందుకు మొదటి రోజు పది మంది వస్తారు. రెండవ , మూడవ రోజులలో క్రమంగా శ్రోతల సంఖ్య పెరిగి  కూర్చోటానికి స్థలం లేక కిక్కిరిసిపోతుంది . తన కథలు వినడంలో  ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతారు .
 
ఇదంతా ఒకపక్క నడుస్తుండగానే, లక్ష్మీదేవి జగన్నాటకంలోకి ప్రవేశిస్తారు .  లక్ష్మీ మాత ఒక  వృద్ధురాలిగా మారి  ఆ గ్రామానికి వచ్చి అప్పడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళుతున్న ఒక స్త్రీ ని దాహం అడుగుతారు.ఆమె ఒక్కక్షణం ఆగి అమ్మకి నీటిపాత్రని అందిస్తుంది .  దాహం పుచ్చుకొని తిరిగి ఆ శ్రీకి ఇచ్చినపాత్ర బంగారపు పాత్రగా మారిపోతుంది . ఆ తర్వాత హరికథాకాలక్షేపానికి వెళ్లిన ఆ స్త్రీ అక్కడున్నవారికి ఈ విషయాన్ని సెబుతుంది . ఆడవారినోటిలో ఆవగింజయినా నానదు  కదా !!

ఇక ఆరోజునుండీ ఎవరింటికి ఆ పరమపావనమూర్తి అయిన అమ్మ వచ్చి దాహం అడుగుతారోనని ఇల్లుకదలకుండా ఉండే ఇల్లాళ్ళు  ఎక్కువవడంతో , శ్రీహరి హరికథా కాలక్షేపానికి జనుల ఎద్దడి తగ్గిపోతూ ఉంటుంది . 

చివరికి గ్రామపెద్ద కూడా హరికథని వదలి  ఇంటికే పరిమితం అవుతారు . ఆయనకీ  అమ్మ దర్శనం  
అవుతుంది . కానీ దాహం అడగదు . ఎందుకమ్మా ఈ గ్రామంలోని ఇళ్ళన్నింటినీ పావనం చేసిన నీవు నా యింటి నీరు ముట్టలేదని అడుగుతాడు ఆ పెద్ద . నేను మొదట నీ ఇంటికే వచ్చాను నాయనా ! కానీ నీవు ఆ హరిదాసుకి ఆశ్రయమిచ్చి ఉండడం చేత లోపలి రాలేకపోయాను అంటుంది . అంతే  వెంటనే హరిదాసుగారికి ఆ ఊరి సత్రంలో బస ఏర్పాటుచేసి , శ్రీహరిని పిలిపించి తన ఇంటినుండీ మకాం సత్రానికి మార్చాల్సిందిగా కోరతాడు . 

మరొక్క రెండురోజుల్లో కథాకాలక్షేపం ముగుంచుకుని వెళ్ళిపోతాను . నాకు ఇక్కడే సౌకర్యంగా ఉన్నందున , ఇక్కడే ఉండనీయమని అర్థిస్తారు నటనసూత్రధారి . కానీ గ్రామాధికారి అందుకు అంగీకరించడు . శాశ్వతుడైన హరిణి వెళ్లగొట్టి , క్షణికమైన సంపదలకోసం ఆరాటపడతారు . 

అప్పుడు శ్రీహరితో నిజరూపంలో సాక్షాత్కరించిన అమ్మ , "ప్రభు నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నావా నీ భక్తులు నీకోసం కాదు, నాకోసం మీనామం జపిస్తున్నారని” అని నవ్వుతూ అడుగుతుంది . “ ఏదేమైనా ఆ నాలుగు మాటలూ అడిగేస్తేగానీ ఏ ఇల్లాలికైనా మనసు తృప్తి పడదు మరి ! 

అప్పుడా స్వామి , “ నిజమే, నీ ప్రభావాన్ని ఒప్పుకుంటున్నాను . కానీ లక్ష్మీ, నాకోసం నువ్వుకూడా  వైకుంఠాన్ని వీడి వచ్చేశావు కదా ! , ఇప్పుడు నేను ఇక్కడి నుండీ తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను. నువ్వు వస్తావా ? ఇక్కడే ఉండిపోతావా ?” అని చిద్విలాసంగా ప్రశ్నించారు . 

స్వామీ , నీవులేని చోట నేను నిలువ జాలగలనా ? అని స్వామీ వెనుకనే గరుడవాహనంపై వైకుంఠానికి తరలింది అమ్మ !!

అయినా ఆయన్ని ఏ అవతారంలో వీడింది గనుక ? ఆఖరికి నరసింహుడై , అడవుల్లో తిరుగుతుంటే , తానూ చెంచులక్ష్మిగా మారి అనుసరించిన దేవికదా అమ్మ . అందుకే, విష్ణు కథలు ఎక్కడ గానం చేస్తారో ఎక్కడ ఆయన నామం జపిస్తారో అక్కడ అమ్మ స్వయంగా వచ్చి నిలుస్తుంది. కేవలం క్షణికమైన ధనం వెంట పరిగెత్తేవారికి ఎటువంటి ఉపయోగం ఉండదు . 

ఇది సత్యం . శుభం .

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya