ముని వాహన సేవ కథ
భక్తుడి గాయం భగవంతుడికి !
తెల తెలవారుతోంది ..కావేరి తీరంలో సందడి మొదలయింది...అల్లంత దూరాన గుడిగంటలు . లోకాభాంధవుడైన శ్రీరంగానాధుడి సేవలు ప్రారంభమయ్యాయి.
స్వామి కైoకర్యానికి నీటికోసం శ్రీరంగ ఆలయ ప్రధానార్చకులు లోకసారంగముని కావేరీ తీరానికి వస్తున్నాడు.
అంతలో ఓ మధురగానం ....
హృదయమంతా స్వామిని నింపుకుని.. భాహ్య స్మృతిలేని స్థితిలో ఓ వ్యక్తి హరినామాన్ని కీర్తిస్తున్నాడు .
కావేరికి వెళ్ళేదారిలో కూర్చుని , ఎవరి రాక పోకలను గమనించే స్థితిలో కూడా లేడాయన.
అంతలో అక్కడకు వచ్చిన లోకసారంగముని “ఏయి..!అడ్డులే “ అంటూ గద్దించాడు .
రంగనాధుని జపంలో లీనమై ఉన్న ఆ భక్తుడికి ఆ మాటలు చేరలేదు .
“దేవాలయ ప్రధాన అర్చకుణ్ణి నాకే అవమానమా !”అంటూ కోపంతో ఊగిపోయాడు లోకసారంగముని .
అక్కడున్న ఓ రాయిని తీసుకుని ఆ భక్తుడిపై విసిరాడు .
రాయిబలంగా తగలడంతో అతని తలకు గాయమైంది. రక్తం ధారకట్టింది .
అప్పుడు భాహ్యస్మృతిలోకి వచ్చిన ఆ భక్తుడు “అపచారం ....క్షమించండి స్వామి “ అంటూ పక్కకు జరిగాడు ,
నీళ్ళ బిందెతో కోవెలకు చేరుకున్న లోకసారంగముని రంగనాధుడి కైoకర్యానికి సిద్ధమవుతున్నాడు ...ఇంతలో స్వామి తలనుంచి రక్తం ,
ధారలుకట్టిన రుధిరం గర్భాలయం రంగుని మార్చేస్తోంది .
స్వామీ ! ఏంటీవైపరీత్యం !..హా ..అర్ధమయింది !.
నిత్యాగ్నిహోత్రుడను..నీ ప్రధానార్చకుడను అనే అహంతో ఓ భక్తుడిని శిక్షించాను.
కులం తక్కువవాడు అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతని రక్తం కళ్ళచూసాను .
నీవు తప్ప ఇహపరంబెరుగని ఓ నిర్మల హృదయుడికి గాయం చేసాను .
అందుకే అతనిలో ఉన్న నీవు స్పందిస్తున్నావు ..అంటూ కన్నీళ్ళతో స్వామిని వేడుకున్నాడు లోకసారంగముని
పరుగు పరుగున లోకసారంగమునిదళితవాడ వైపు వెళుతున్నాడు..ఏంజరిగిందో తెలియని మరికొంతమంది అర్చక స్వాములు కూడా ఆటే పరిగెత్తుతున్నారు.
ఇంతకుముందు తానూ చేసిన దోషానికి తీవ్రంగా దండించడానికి వారంతా తరలి వస్తున్నారని అనుకున్న ఆభక్తుడు స్వామి మీదే భారంవేసి బిక్కు బిక్కు మంటూ నిలుచున్నాడు .
కన్నీళ్ళతో అక్కడకు చేరుకున్న లోకసారంగముని అమాంతం ఆ భక్తుడిని భుజాలపై ఎక్కించుకున్నాడు .
సకల శాస్త్ర కోవిదుడు , వేద వేదాంగాలు చదివిన ఆ పండితోత్తముడు ..ఓ చదువురాని వాడిని భుజాలపై మోసాడు
నిర్మల భక్తీ శ్రద్దలే భగవంతుడికి పూజా పుష్పాలనిచాటుతూ లోకసారంగముని ఆ భక్తుడితో శ్రీరంగనాధుడి ఆలయప్రవేశo చేసాడు.
ఆ భక్తుడే తిరుపణ్ణళ్వార్
ఆరోజు ఆ భక్తాగ్రేసరుడికి జరిగిన సేవ నేటికి కొనసాగుతోంది . దానిపేరు “ముని వాహనసేవ “
తిరుపణ్ణళ్వారు పది పాశురాలతో స్వామిని అర్చించి తరించారు అదే అమలనాధ పిరాన్ గా నేటికి నిర్వహిస్తున్నారు.