అహంకారం నాశనానికి హేతువు .
అహంకారం నాశనానికి హేతువు .
- లక్ష్మీరమణ
అహంకారానికి , ఆత్మగౌరవానికి మధ్య చిన్న తేడా ఉంది . అహం మనిషిని అధోగతిపాలు చేస్తుంది . ఆత్మగౌరవం వ్యక్తిత్వాన్ని అందలమెక్కిస్తుంది . వీటిమధ్య అంతరం తెలియలేక, అహంకారమే ఆత్మగౌరవం అనుకున్నారో ఇక అక్కడితో మన పతనం ఆరంభమయినట్టే అంటుంది పంచమవేదం. ఇందుకు ఉదాహరణగా ఒక చక్కని కథని భరద్వాజ మహర్షి తన కుమారుడైన యువక్రీతుడికి వివరించారు .
అహం వినాశకారి. పిల్లలకి చిన్నతనం నుంచే వినయ విధేయతలు అలవడేలా చేయాలి . మొక్కై వంగనిది మానయ్యాక వంగుతుందా ! మర్యాద తప్పకుండా ప్రవర్తించడం తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి . మనకంటే గొప్పవాళ్ళు లేరని ఎన్నడూ విర్రవీగకూడదు. పెద్దలపట్ల భయభక్తులు కలిగి ఉండాలి. మనిషిలో గర్వం పెరిగితే, ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతింటాడు.
భరద్వాజ మహర్షి కుమారుడు యువక్రీతుడు తపస్సు చేసి ఇంద్రుణ్ణి మెప్పించినా, విద్యలన్నీ వచ్చేయుగాక అని వరమివ్వలేదాయన . ‘నువ్వు మీ నాన్నగారిని గురువుగా ఆశ్రయించి వేదవిద్యాలన్నీ నేర్చుకో’ అని దిశానిర్దేశనం చేశాడు . యువక్రీతుడు సత్యం తెలుసుకున్నాడు . అలాగే నేర్చుకున్నాడు. గొప్ప పండితుడయ్యాడు.
అయితే విద్య వినయాన్నివ్వాలి. కొన్నిసార్లు అహంకారాన్ని కూడా ఇస్తుంది మరి . ‘ నేను కదా తపస్సు చేసి, ఇంద్రుడి వల్ల వరం సంపాదించి, ఇంత పాండిత్యాన్ని పొందాను’ అని ఎప్పుడూ గర్వపడుతూ ఉండేవాడు యువక్రీతుడు. కుమారుడి ప్రవర్తన భరద్వాజుడికి నచ్చేది కాదు.
ఆయన స్నేహితుడైన మహర్షి రైభ్యుడితోనూ అతని పిల్లలతోనూ యువక్రీతుడుకి అస్సలు పడేది కాదు. ఏ క్షణాన తగాదా పెట్టుకుని, విరోధం తెచ్చుకుంటాడో అని భయపడుతుండేవాడు భరద్వాజుడు . ఆ భయం కారణంగానే ఒకరోజు భరద్వాజుడు కుమారుడికి ఒక కథ చెప్పాడు.
అదేంటంటే, చాలా ఏళ్ల క్రితం బాలదిహి అని ఒక ముని ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. పాపం ఆ కొడుకు కాస్త ఉన్నట్టుండి చనిపోయాడు. దాంతో ఆ ముని చాలా దుఃఖపడ్డాడు. ఈసారి చావులేని కుమారుడిని పొందాలనుకుని ఘోర తపస్సు చేశాడు. ‘మనిషి పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. అసలు చావే లేకుండా వరం పొందడం కుదరదు. అందుచేత, ఈసారి నీకు పుట్టబోయే కొడుకు ఎన్నాళ్లు జీవించాలి అనుకుంటున్నావో చెప్పు. అన్నేళ్ల ఆయుష్షుని ఇస్తా’మన్నారు దేవతలు. ‘సరే అలాగైతే, అదిగో ఆ ఎదురుగా కొండ ఉందే, అది ఉన్నంత కాలము నా బంగారు కొండ బతికి ఉండాలి’ అని బాలదిహి కోరుకున్నాడు. దేవతలు అలాగేనని వరమిచ్చా రు.
తర్వాత వరప్రభావంతో మునికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి మేధావి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచాడు ముని. తన రహస్యం తెలుసుకున్నాక మేధావికి ‘నా ప్రాణానికి ముప్పు లేదు. కొండలాగా, స్థిరంగా ఎంత కాలమైనా బతకొచ్చు’ అనే గర్వం కలిగింది. దాంతో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరితోనూ పొగరుగా ప్రవర్తించేవాడు. ఒకరోజు ధనుసాక్షరి అనే మహాత్మున్ని మేధావి తూలనాడాడు. అతని పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.
ధనుసాక్షరి భగ్గున మండిపడి, ‘నీవు భస్మమైపోతావు పో’ అని శపించాడు. కానీ మేధావి మీద ఆ మహర్షి శాపం పనిచేయలేదు . అలాగే కొండలాగా స్థిరంగా నిలబడి , వెటకారంగా నవ్వాడు . అప్పుడు ధనుసాక్షరి మేధావికి గల వరాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. వెంటనే తన తపో మహిమ వల్ల తాను ఒక అడవి దున్నగా మారిపోయి, కొండను దబీమని ఢీ కొట్టి దాన్ని బద్దలు చేశారు. అక్కడ కొండ చీలిపోతూనే, ఇక్కడ మేధావి తల కూడా రెండు ముక్కలైంది. మేధావి ముగిసిపోయింది .
ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి వరాలు పొందామని ఎప్పుడూ గర్వపడకూడదు . విద్యలు నేర్చామని అహంకరించకూడదు. పెద్దలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. అందరిని గౌరవించడం నేర్చుకోవాలి. ఇది కేవలం కథగా మాత్రమే భరద్వాజుడు కొడుక్కి చెప్పలేదు . ఒక పాఠంగా , తన జీవితాన్ని దిద్దుకోవడానికి చక్కని మార్గాన్ని గురువుగా ఉపదేశించారు . ఆ మాటని మనం కూడా అనుసరిస్తే మంచిది ఏమంటారు !