Online Puja Services

భార్యా భర్తల మధ్య ఉండే అన్యోన్యత ఎలా ఉండాలి !

3.147.65.111

భార్యా భర్తల మధ్య ఉండే అన్యోన్యత ఎలా ఉండాలి !
-సేకరణ 

భార్యాభర్తల మధ్య ఏదైనా మాట వచ్చిందంటే, ఇక దానిమీద చాలా  నడుస్తుంది. అందులోనూ భార్య  అలిగిందంటే, ఇక పరాశక్తి అలిగినట్టే. అందులోనూ భార్య స్వయంగా ప్రక్రుతి స్వరూపము .  మాటంటే పడనీ తత్త్వం, భర్తపైన అంతులేని అనురాగం ఒకేసారి కలిగిఉండే శక్తి స్వరూపము కదా స్త్రీ అంటే. ఇది కేవలం సామాన్యులకి మాత్రమే కాదు ,  ఆది దంపతుల విషయంలోనూ వర్తిస్తుంది .  అటువంటి ఉదంతము పార్వతీ మాతని గౌరిగా మార్చింది. ఆ కథని తెలుసుకుందాం రండి . 

 ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులిరువురూ మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతం ఒక మానుష రూపాన్ని పొంది   సేవిస్తోంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనమైన వృషభం తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే పర్వతం తెల్లగా ఉంటుంది. వేసుకునే పుర్రెల మాల తెలుపు. ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు జ్ఞానప్రదాతయై ఉంటాడు. అందుకే ఆయనకీ చెల్లెలుగా చెప్పే జ్ఞానస్వరూపమైన మాత సరస్వతీదేవి కూడా శ్వేత వర్ణం లోనే శోభిస్తూ ఉంటారు . ఇలా తానూ తెల్లగా ఉంది, తనచుతూ ఉన్నవన్నీ కూడా తెల్లగా ఉన్న  శంకరుడి ప్రక్కన నల్లగా ఉన్న అమ్మవారు కూర్చుంది. 

శివపార్వతులకు రూపము , వర్ణముకి  సంబంధించిన భేదాలు ఏవీ  లేవు. వాళ్లిద్దరూ కూడా ఒకరితో ఒకరు భేదము లేనివారు . అయినా కూడా  ఆయన పార్వతీదేవి వంక చూసి ‘కాళీ’ అని పిలిచారు. ఆ పిలుపు పూర్వం పిలిచినట్లు లేదు. కొద్దిగా ఏదో ఎత్తిపొడిచినట్లుగా ఉంది. ‘ఓ నల్లపిల్లా’ అని పిలిచినట్లు అనిపించింది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయ్యింది.  కన్నుల వెంట బాష్పధారలు కారుతుండగా అమ్మవారు దిగ్గున క్రిందికి దిగింది .  ‘లోకములో  ఎన్ని సుఖములైనా ఉండవచ్చు, ఎన్ని భోగాములైనా ఉండవచ్చు. కానీ భర్తకు ప్రీతికరంగా ఉండేటటువంటి  సౌందర్యం ఈ శరీరములో  లేనప్పుడు దీనివల్ల లాభం ఏముంది ? ఇప్పుడు నేను కైలాసంలో ఉన్నా, మణిద్వీపంలో ఉన్నా, నన్ను ఎంతమంది సేవిస్తున్నా సౌందర్యలహరి నని కీర్తించినా, అది ఆయనకీ ప్రీతిని కలిగించనప్పుడు లాభం ఏమిటి ? అనుకున్నారు . 

“ స్వామీ నీకు ప్రీతిని కలిగించని  శరీరంతో నేను ఉండాలని అనుకోవడం లేదు. ఈ నల్లటి శరీరమును వదిలిపెట్టేస్తాను. నీకు ప్రీతిని కలిగించే శరీరముతో వస్తాను. దేవా నన్ను అనుగ్రహించండి” అన్నారు ఆవిడ పరమేశ్వరునితో.  ఈ మాటకు శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ‘అయ్యో పార్వతీ, నా మనస్సు నీకు తెలియదా. నీపైన  నాకెప్పుడూ అటువంటి భావన లేదు. ఒకవేళ నేను పరాచికానికి అన్నమాట, నీ మనసుకి కష్టాన్ని కలిగించినట్టయితే, నేను నీకు క్షమార్పణ చెప్పుకుంటాను . కానీ దేవీ, నువ్వు ఇంత తొందర నిర్ణయమును తీసుకోవద్దు’ అన్నాడు. 

పరమశివుని మాటలను విన్న ఆవిడ ‘లేదు లేదు. నేను మీ మనస్సును చూరగొనలేక పోయినప్పుడు నేను అలా ఉండడాన్ని ఇష్టపడను. నీకు ఇష్టమైన రూపాన్ని, వర్ణాన్ని పొంది నీదగ్గరకి తిరిగి వస్తాను .  అని తపస్సుకు బయలుదేరింది. ఆకాశగంగలో స్నానం చేసి తపస్సుకు అనుకూలమయిన వస్త్రములను ధరించింది. శివునికి ఇష్టమైన రంగుని పొందాలనే  సంకల్పం చేసి, తపస్సు చేయడం ప్రారంభించింది. 

అరణ్యంలో ఆమెను తిందామని ఒక పులి వచ్చింది. ఆమెను చూడగానే దుష్ట గుణము కలిగిన పులి కాస్తా సాత్త్విక ప్రవృత్తిని పొంది అలా నిలిచిపోయింది. దానిలో ఉండేటటువంటి దుష్టమైన ప్రవృత్తి కాస్తా అణగారిపోయింది .  అమ్మవారి పాదములకు ఉండే బొటనవేలి గోటి నుండి వస్తున్నా కాంతిని చూస్తే పాపములు ఎగిరిపోతాయని వ్యాసమహర్షి అంటారు.  అగ్ని హోత్రమును ముట్టుకుంటే కాల్చడం దాని ధర్మం. అలాంటిదే ఈశ్వరీ దర్శనం కూడాను . అందువల్ల ఆ పులి  అదేపనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణిని లోపలికి రాకుండా కాపాడుతోంది.

ఆ తర్వాత  శుంభనిశుంభులను సంహరించదానికి ఒక రూపమును ఇవ్వమని బ్రహ్మ అడిగాడు. ఆ తల్లి ఇపుడు రూపమును స్వీకరించాలి. కాబట్టి  బంగారు రంగులో ఉండే మొగలి పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో తెలుపు ఎరుపు పసుపు రంగులతో కూడిన రంగులోకి అమ్మవారు మారిపోయింది. అప్పుడు ఆమె గౌరవర్ణమును పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు. 

తన నల్లని శరీరమును పాము కుబుసము విడిచినట్లు అమ్మవారు లీలా మాత్రంగా శరీరమును విడిచింది. ఈ విధంగా విడిచిన నల్లని శరీరమునకు కౌశికి అనే పేరు .

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది . మీకొక విషయం అవగతం కావాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినది కాముని బాణముల వలన జరిగిన సృష్టి కాదు. అది లీలా మాత్రంగా వీళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై, ఆ తల్లి లోపల మనస్సులో కదిలితే, ఆ సృష్టిగా పరిణమించింది. కనుక ఇప్పుడు కౌశికి అనే పేరుతొ నల్లటి శరీరమును ఇచ్చి ఈవిడ వచ్చి శుంభ నిశుంభులను సంహారం చేస్తుందని బ్రహ్మ కోర్కెను తీర్చింది. ఇపుడు ఈ కౌశికి వెళ్లి శుంభనిశుంభుల సంహారం పూర్తిచేసింది. ఆ తర్వాత అమ్మవారు వింధ్యవాసినియై వింధ్య పర్వతం మీద కూర్చుని ఉంది. 

ఆ సమయంలో బ్రహ్మ అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహమును ఆవిడకి వాహనంగా బహూకరించాడు. సింహవాహన అనే పేరుతో వింధ్యవాసిని అనే పేరుతో ఆ కౌశికి మనలనందరిని రక్షించడం కోసమని ఆ వింధ్యపర్వతం మీద వేంచేసి ఉంది. ఇపుడు ఈ బంగారు గౌరమ్మ వ్యాఘ్రమును కూడా వెంటపెట్టుకుని పరమశివుడు ఉన్న మందరపర్వతం మీదకు వెళ్ళింది. ఆమెను చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. 

‘పార్వతీ, నేను ఆనాడు ఈమాట ఎందుకన్నానో దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థం అయింది. ఈ శరీరమును విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి. ఇప్పుడు నువ్వు నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవడం వలన  లోకమునకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి. నీవు వాక్యము, నీవు విద్య. నేను ఆ విద్యచేత ప్రతిపాదింపబడే జ్ఞానమును. విద్య జ్ఞానము ఈ రెండూ ఎలా విడివడి ఉండవో అలా నీవు నేనూ ఎల్లప్పుడూ కలిసే ఉంటాము. నీవు సోమాత్మకంగా ఉంటావు. నేను అగ్నిస్వరూపంగా ఉంటాను. ఊర్ధ్వముఖ ప్రయాణం నాది. నీవు క్రిందికి వెడతావు. నేనే ఈ సృష్టినంతటినీ లయకారకుడనై కేవలము బూదిగా మార్చి ఉంచినపుడు నీ అనుగ్రహ ప్రవేశం చేత మరల సృష్టి పునఃసృష్టి జరుగుతోంది. కాబట్టి ఈ సమస్తము మనమిరువురమై ఉన్నాము. ఇక మనం విడివడినది ఎప్పుడు! అటువంటిది నీవు నామీద కోపపది దూరంగా వెళ్ళినట్లుగా కనపడడం ఒక అద్భుతం. లోకరక్షణ కోసమని ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాము. మనం చేసిన ఈ లీల వృథాగా పోదు. రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతువు అవుతుంది’ అన్నాడు.

అదన్నమాట సంగతి . కాబట్టి భార్యాభర్తల సంబంధములో ఒకరికొకరు ఆ ఆదిదంపతుల మాదిరిగా ప్రేమ అనురాగాలతో ఉండాలని ఈ కథ మనకి చెబుతుంది. ఇది శివపురాణాంతర్గతమైన విశేషం . 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore